గొల్లమండపానికి రక్షణ
                  
	=కూల్చివేతకు వెనుకడుగు
	 =ఇత్తడి కటాంజనాల ఏర్పాటు
	 =పనులు ప్రారంభం
	 =నెలాఖరుకు పూర్తి
	 
	 సాక్షి, తిరుమల:  తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం ఎదురుగా ఉన్న గొల్లమండపాన్ని టీటీడీ అధికారులు పటిష్టపరచనున్నారు. కూలే స్థితిలో ఉన్న ఈ మండపానికి టీటీడీ ఇంజినీర్లు రక్షణ చర్యలు వేగవంతం చేశారు. ప్రత్యేకంగా ఇత్తడితో కూడిన కటాంజన బంధనాలు అమర్చనున్నారు. ఈ మేరకు శనివారం పనులు ప్రారంభించారు.
	 
	ఆరు దశాబ్దాల క్రితం..
	
	 వేంకటేశ్వర స్వామివారి ఆలయ మహద్వారానికి పది మీటర్ల దూరంలో నిటారైన నాలుగు శిలలపై గొల్ల మండపం ఉంది. శాసనాధారం ప్రకారం కేవలం పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు 1464లో సాళువ మల్లయ్య దొర వేయికాళ్ల మండపం నిర్మించారు. అయితే భక్తుల సౌకర్యార్థం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ పురాతన మండపాన్ని 2003లో తొలగించారు. దీనివల్ల అక్కడే ఉన్న గొల్ల మండపం రాతి స్తంభాలకు పగుళ్లు వచ్చాయి. దీంతో గొల్లమండపాన్నీ తొలగించాలని టీటీడీ ప్రయత్నించింది. అయితే, తమ మనోభావాలకు విరుద్దంగా మండపం కూల్చడం సరికాదని కొన్ని యాదవ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు దీనిపై కోర్టులో కేసులూ నడిచాయి. తీర్పు కూడా టీటీడీకి అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ మండపాన్ని తొలగించేందుకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు.
	 
	ఏ క్షణమైనా కూలిపోవచ్చు
	
	 ఐఐటీ ప్రొఫెసర్  నరసింహరావు రెండేళ్లక్రితం గొల్లమండపాన్ని పరిశీలించారు. ఇది ఏ క్షణమైనా కూలిపోవచ్చంటా టీటీడీ అధికారులను హెచ్చరించారు. వ్యతిరేకత ఎదురవుతున్న దృష్ట్యా మండపం కూల్చివేతకు టీటీడీ అధికారులు సాహసించలేకపోయారు. అయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున మండపానికి రక్షణ చర్యలు చేపట్టారు.
	 
	 ఇవీ రక్షణ చర్యలు
	 
	 గొల్లమండపానికి ఉన్న నాలుగు రాతి స్తంభాలను కలుపుతూ ఇత్తడితో కటాంజనాలు నిర్మించనున్నారు. మండపం బరువు నాలుగు స్తంభాలపై ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం నుంచి పనులు ప్రారంభించారు. నెలాఖరులోపు పనులు పూర్తి చేయనున్నారు. మండపం కూల్చేస్తారనే వదంతులు కొంతకాలంపాటు వ్యాపించాయి. దీంతో  యాదవ సంఘాలు, భక్తుల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రక్షణ చర్యలు చేపట్టడంతో శతాబ్దాలనాటి గొల్లమండపం మరికొంతకాలం పాటు తమకు కనువిందు చేయనుందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరి తగతిన పూర్తిచేయాలని కోరుతున్నారు.