breaking news
contractors neglect
-
ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?
సాక్షి, బెంగళూరు: ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా 775 కోట్ల రూపాయల ఖర్చు పదేళ్లకే వృథా అయ్యేలా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల ఓ వంతెన మట్టిలో కలిసిపోయేలా ఉంది. రాజధాని బెంగళూరు నగరం నుంచి సుమారు 20 జిల్లాలకు వెళ్లే మార్గంలో ఎంతో ప్రధానభూమిక పోషిస్తున్న గోరుగుంటపాళ్య ఫ్లై ఓవర్ వంతెన దశాబ్దానికే పాడైపోయింది. సుమారు 56 రోజుల మరమ్మతుల తర్వాత పెద్ద పెద్ద వాహనాలను కాదని, చిన్న వాహనాలకే అనుమతిస్తున్నారు. బెంగళూరు నుంచి తుమకూరు వెళ్లే మార్గంలో గోరుగుంటపాళ్య నుంచి నాగసంద్ర వరకు ఉండే వంతెనను పడగొట్టాలని బెంగళూరులోని ఐఐఎస్సీ విద్యాసంస్థ నిపుణులు సూచిస్తున్నారు. 2010లో రూ.775.70 కోట్ల ఖర్చుతో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ 5 కిలోమీటర్ల వంతెనను వంతెన నిర్మించారు. చదవండి: (సైన్యం ఆధునికీకరణ సరే! నిధులెక్కడ?) డిసెంబరు నుంచి సమస్యలు మొదలు.. వంతెన కింది భాగంలో ఉన్న 102, 103 నంబరు పిల్లర్ల వద్ద కేబుల్ కట్ కావడంతో సమస్య తలెత్తింది. ఈ క్రమంలో గత డిసెంబరు 25వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను నిషేధించారు. ఎన్హెచ్ఏఐ మరమ్మతులు చేపట్టింది. వంతెన పొడవునా కేబుల్‌ను అమర్చాల్సి రావడంతో మరమ్మతులు రెండువారాలకు బదులు సుమారు రెండు నెలల పాటు కొనసాగాయి. ఇటీవలే పూర్తి చేశాక నిపుణులు తనిఖీలు చేస్తే ... వంతెన మొత్తం పాడైపోయేందుకు సిద్ధంగా ఉందని గమనించారు. దీంతో ఫ్లై ఓవర్‌ను నేలమట్టం చేయాల్సిందేనని తేల్చారు. దీంతో కొత్త వంతెన కోసం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ కూడా రాసినట్లు సీఎం బసవరాజ్ బొమ్మై అసెంబ్లీలో వివరించారు. వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆటోలు, బైక్‌లకే అనుమతి.. రెండు పిల్లర్లకు మరమ్మతుల తర్వాత వంతెనను గత బుధవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి తెచ్చారు. బైక్‌లు, ఆటోలు, కార్లు, మినీ లారీలు వంటి చిన్న వాహనాలను మాత్రమే అనుమతించారు. భారీ వాహనాలు వెళ్లరాదని, వంతెన ప్రమాదకర స్థితిలో ఉందని బోర్డు పెట్టారు. వంతెన బాగున్న రోజుల్లో రోజు సుమారు 60 వేల వాహనాలు సంచరించేవి. మరమ్మతులు, మళ్లీ ఆంక్షల వల్ల వంతెన కింద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. కిలోమీటరు ప్రయాణానికి గంటల కొద్దీ పడుతోంది. ఈ కష్టాలకు ఎవరు కారణమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
నత్తనడకన ‘గోదావరి’
మేడ్చల్, న్యూస్‌లైన్ : జిల్లాకు సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టినప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రాణ హిత నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు గోదావరి జలాలను తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అలాగే గోదావరి జలాలను మేడ్చల్ మీదుగా నగరానికి కూడా తరలించనున్నారు. ఇందుకోసం మండలంలోని గుండ్లపోచంపల్లి పరిధిలోని అయోధ్య చౌరస్తా వద్ద నెల రోజుల క్రితం పైపులైన్ నిర్మాణం పనులు చేపట్టారు. శామీర్‌పేట్ మండ లం మీదుగా పైపులైన్ రావాల్సి ఉన్నా అక్కడ నిర్మాణం పనులు చేపట్టకుండా అయోధ్య చౌరస్తా నుంచి దూలపల్లి మీదుగా నగరానికి గోదావరి జలాలు తరలించేలా పైపులైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే రోడ్డును తవ్వేయడంతో అయోధ్య చౌరస్తా మీదుగా రాకపోకలు సాగించాల్సిన 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ దారి లేదు... పైపులైన్ నిర్మాణం కోసం అయోధ్య చౌరస్తా వద్ద ఆర్అండ్బీ రోడ్డు తవ్వి ఒకపక్కనుంచి పైపులైన్ వేయాలి. అయితే సదరు కాంట్రాక్టర్ ఎలాంటి ప్రత్యామ్నాయ రోడ్డు వేయకుండా చౌరస్తా వద్ద మొత్తం రోడ్డు తవ్వేసి పైపులైన్ నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. దీంతో మేడ్చల్ నుంచి గుండ్లపోచంపల్లికి అలాగే కండ్లకోయ, గౌడవెళ్లి, సుతారిగూడలతో పాటు నగరం నుంచి బాసిరేగడి, జ్ఞానాపూర్, నూతన్‌కల్, బండమాదారం, శ్రీరంగవరం, రాయిలాపూర్, గిర్మాపూర్, మేడ్చల్ నుంచి కుత్బుల్లాపూర్‌లకు వెళ్లేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సుదూర ప్రాంంతాల నుంచి వచ్చిన భారీ వాహనాలవారు చౌరస్తా నుంచి దారి లేకపోవడంతో తిరిగి వేరే మార్గాల ద్వారా మేడ్చల్ మీదుగా వెళ్లే జాతీయ రహదారిపైకి రావాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.