breaking news
contract employees strike
-
ఉపాధి సిబ్బంది సమ్మె బాట
విజయనగరం పూల్‌బాగ్: ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామన్నారు... వేతనాలు పెంచుతామన్నారు.. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచింది.. పాలన ముగిసేందుకు మరో ఆరునెలలే గడువు ఉంది.. ఇప్పటికీ ఒక్క హామీ నెరవేర్చలేదు... క్రమబద్ధీకరణ ఊసేలేదు.. ఎదురు ప్రశ్నించిన ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారు... ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారంటూ ఉపాధిహామీ సిబ్బంది మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ వెలుగు సిబ్బంది బాటలోనే సమ్మెకు సిద్ధమవుతున్నారు. వచ్చేనెల 2 నుంచి సమ్మె చేస్తామని అధికారులకు నోటీసులు అందజేశారు. చాలీచాలని జీతాలతో ఎన్నో కష్టాలు పడుతున్న తమ డిమాండ్లు నెరవేర్చాలని ఎంతో కాలంగా కోరుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శిస్తున్నారు. 13 ఏళ్లుగా పనిచేస్తున్నా.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో 13 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ నేటికీ టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఓలు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, ప్లాంటేషన్ సూపర్వైజర్లు, జూనియర్ ఇంజినీర్ల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కాలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం ఇవ్వాల్సి ఉండగా అది అమలు కావడంలేదు. సమానపనికి సమానవేతనం అమలు చేయాలని, టైమ్‌స్కేల్ అమలు చేయాలని వారు కోరుతున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. టైంస్కేల్ అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2016 పీఆర్సీని అనుసరించి టైంస్కేల్ అమలు చేయాలి. సమాన పనికి సమానవేతనం నిబంధన వర్తింపజేయాలి. 13 ఏళ్లుగా పనిచేస్తున్న మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. – గర్భాపు సుందరరావు, జిల్లా అధ్యక్షుడు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది జేఎసీ, విజయనగరం -
కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
అనంతపురం కలెక్టరేట్,న్యూస్‌లైన్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బంది సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించారు. ధర్నాకు ఎమ్మెల్సీ గేయానంద్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు వేతనాలు పెరగడం లేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీఓ నంబర్ 3 విడుదల చేసినా అమలుకు నోచుకోవడం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగికి ఇస్తున్న బేసిక్ వేతనం కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందజేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కూడా లేవన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు చంద్రమోహన్, అధ్యక్షులు వహిదాబేగం, కార్యదర్శి లీలావతి, విజయవాణి, ఫరీదాబేగం, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.