breaking news
Contract basic
-
కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్
* చట్టంలో మార్పుకు క్యాబినెట్ సబ్‌కమిటీ అంగీకారం * వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లు * మంత్రి ఆంజనేయ వెల్లడి సాక్షి, బెంగళూరు : కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టే నియామకాల్లోనూ ఇకపై రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పు చేయడానికి తన అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మంగళవారం అంగీకరించిందన్నారు. బ్యాక్లాగ్పోస్టుల భర్తీ, అవుట్సోర్స్ నియమకాల్లో రిజర్వేషన్ల విషయమై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ మంగళవారం ఇక్కడి విధానసౌధలో సమావేశమై సుధీర్ఘంగా చర్చింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆంజనేయ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు పొందిన లక్ష మంది రాష్ట్రం లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ నియమకాలు ఏవీ రిజర్వేషన్లు అనుసరించి జరగలేదన్నారు. ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగే నియామకాల్లోనూ రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుందన్నా రు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బాక్వర్డ్ క్లాస్ అపాయింట్మెంట్-1990 చట్టంలో మా ర్పులు తీసుకువస్తున్నట్లు తెలి పారు. ఈ మేరకు రూపొం దించిన ముసాయిదా బిల్లుకు రానున్న అసెంబ్లీ సమా వేశాల్లో అనుమతి పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. తను నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖలో ఇకపై కాంట్రాక్ట్ పద్ధతిన నియామకాలు చేపట్టడానికి అంగీకరించబోమని, శాశ్వత ప్రతిపాదికనే నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖతోపాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టే నియామకాల్లో అనేక లోపాలు ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మిగిలిన విభాగాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ కాని బ్యాక్లాగ్ పోస్టుల వివరాలను అందజేయడానికి సంబంధిత అధికారులకు రెండు నెలలు గడువు ఇచ్చామన్నారు. వివరాలు అందిన వెంటనే నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని వివరించారు. -
ఉద్యోగ భద్రత లేదని కండక్టర్ ఆత్మహత్య
మహ్మదాపురం(దుగ్గొండి) : కుటుంబ పోషణ భారం కావడంతోపాటు చేస్తున్న ఉద్యో గానికి భద్రత లేదని మనోవేదనకు గురైన ఓ కండక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన చింత రమేష్(33)కు మూడేళ్ల క్రితం ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిలో కండక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. మొదట నర్సంపేట డిపోలో పనిచేశాడు. ఇటీవల జనగామ డిపోకు బదిలీ అయ్యాడు. ఉద్యోగం తప్ప మరేలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వచ్చిన జీతం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో తరచూ ఇంట్లో మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన భార్య హారికను ఆమె పుట్టినూరైన ద్వారకపేటలో దింపి వచ్చాడు. నాలుగు రోజులపాటు తాను జనగామలోనే ఉంటానని ఆమెకు చెప్పి తిరిగి మహ్మదాపురం చేరుకున్నాడు. రాత్రి తన ఇంట్లోనే క్లచ్‌వైర్‌తో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు అతడిని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి చొక్కా జేబులో మాత్రం ‘నా చావుకు ఎవరూ కారణం కాదని’ అని రాసి ఉన్న చిన్నకాగితం లభించదని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య హారిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. మృతుడికి రెండేళ్ల కుమారుడు. ఏడు నెలల పాప ఉన్నారు. చిన్నారులిద్దరిని చూసిన గ్రామస్తులు కంటతడిపెట్టారు. మృతుడి భార్య, బంధువులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.