breaking news
concentration camp
-
హోమోసెక్సువల్స్ కోసం కాన్సంట్రేషన్ క్యాంపులు
- ప్రపంచంలోనే తొలిసారి ప్రారంభించిన చెచెన్యా రిపబ్లిక్ - దారుణ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున్న వ్యతిరేకత గ్రోజ్నీ: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను హింసించేందుకు జర్మన్ నియంత హిట్లర్ ప్రత్యేకంగా ఏర్పాటుచేయించిన కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి చాలానే చదివాం. 'కాన్సంట్రేషన్ క్యాంపులో ఉండటంకంటే చచ్చి నరకానికి వెళ్లడమే నయం' అనుకునేంత స్థాయిలో క్రూరహింసలు అమలయ్యేవక్కడ! సరిగ్గా అలాంటి క్యాంపులనే, స్వలింగ సంపర్కుల(హోమోసెక్సువల్స్)ను శిక్షించేందుకు ప్రారంభించింది చెచెన్యా సర్కారు. అధికారిక ఉత్తర్వులతో మంగళవారం ప్రారంభమైన ఈతరహా కాన్సంట్రేషన్ క్యాంపుల ఏర్పాటు ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతోన్న స్వలింగసంపర్కులను నిరోధించేందుకు, వారిని సంస్కరించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అర్గూన్ సహా పలు నగరాల్లో ఈ క్యాంపులు ఏర్పాటయ్యాయి. గతవారం దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 100 మంది స్వలింగ సంపర్కులు పట్టుబడ్డారు. వారిలో పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం. అలా పట్టుబడిన స్వలింగ సంపర్కులను కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించి తీవ్రంగా హింసిస్తున్నారని, కరెంట్ షాకులు ఇచ్చి చంపేస్తున్నారని ఎల్.జి.బి.టి హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. 'ఈ దేశంలో హోమోసెక్సువల్స్ ఉండటానికి వీల్లేదని, అలవాట్లు మార్చుకోనివారు దేశం విడిచి వెళ్లాలని పోలీసులు బెదిరిస్తున్నారు'అని ఓ కార్యకర్త ఆరోపించాడు. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్,గే,బైసెక్సువల్,ట్రాన్స్ జెండర్(ఎల్.జి.బి.టి) హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వలింగ సంపర్కం అంశం చుట్టూ తిరిగే 'మూన్ లైట్' సినిమా ఈ ఏటి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలవడం ఎల్.జి.బి.టి హక్కుల పోరాటానికి మరింత ఊపునిచ్చినట్లయింది. ఈ తరుణంలోనే చెచెన్యా రిపబ్లిక్ తీసుకున్న తీవ్రనిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతానికి రష్యాలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ఇస్లాం సంప్రదాయాలు అధికంగా పాటించే చెచెన్యా ప్రాంతం.. చెచెన్యా రిపబ్లిక్ పేరుతో ప్రత్యేక గుర్తింపు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. -
రిసార్ట్‌గా మారనున్న కాన్సెంట్రేషన్ క్యాంప్
పోడ్కోరికా: రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి ‘కాన్సెంట్రేషన్’ క్యాంప్ గల మోంటోనిగ్రొ తీరంలోని మాముల దీవిని ఇప్పుడు అందమైన లగ్జరీ రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మోంటోనిగ్రొ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటలీకి చెందిన అప్పటి నాజీ నియంత బెనిటో ముస్సోలిని శత్రు ఖైదీలను నిర్భంధించేందుకు మాముల దీవిలో ‘కాన్సెంట్రేషన్’ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో 2,300 మంది ఖైదీలను నిర్బంధించగా వారిలో 130 మంది ఆకలితో చనిపోవడంగానీ, చంపేయడంగానీ జరిగింది. చారిత్రక గుర్తుగా ఈ దీవిని అలాగే ఉంచాలంటూ స్థానిక ప్రజలతోపాటు పలు ప్రపంచ దేశాలు చేసిన సూచనలను ఖాతరు చేయకుండా అక్కడ సుందరమైన రిసార్ట్‌ను నిర్మించి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిసార్ట్‌ను నిర్మించేందుకు 1150 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కూడా అంచనా వేసింది. ‘మాముల క్యాంప్’ పేరుతో 1950లో ఓ హాలివుడ్ సినిమా కూడా వచ్చింది. మాముల దీవి దానంతట అదే శిథిలమయ్యేలా వదిలేయడం లేదా దాన్ని అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్డడం అనే రెండే ప్రత్యామ్నాయాలు తమకు ఉన్నాయని జాతీయ పర్యాటక శాఖ డెరైక్టర్ ఆలివెరా బ్రజోవిక్ తెలిపారు. రెండో ప్రత్యామ్నాయమే ఉత్తమమైనదని భావించామని, ఎందుకంటే స్థానికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఇది దోహదపడుతుందని ఆయన వివరించారు. ఈ కాన్స్ట్రేషన్ క్యాంప్‌లో స్థానికులే ఎక్కువ మంది మరణించడం వల్ల రిసార్ట్‌గా తీర్చిదిద్దడం వారికి ఇష్టం లేదు. క్యాంప్‌ను మ్యూజియంగానే ఉంచడం ఉత్తమమన్నది వారి వాదన. వారి వాదనకు తగ్గట్టుగా అవసరమైతే క్యాంప్ ఉన్న ప్రాంతంలో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆలివెరా అన్నారు. రిసార్ట్ నిర్మాణం కోసం స్విస్-ఈజిప్షియన్ కంపెనీ ‘ఓరస్కామ్’కు ఈ దీవిని 49 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. చదరపు మీటరుకు 150 రూపాయల చొప్పున ఈ కంపెనీ లీజు దక్కించుకుంది.