ఆక్వాపార్క్ నిర్మాణం వద్దే వద్దు
ఏలూరు (సెంట్రల్) : భీమవరం మండలం తుందుర్రులో ఆక్వా ఫుడ్‌పార్క్ విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకుని వ్యవహరించడాన్ని నిరసిస్తూ గురువారం వామపక్షాల నాయకులు కళ్లకు గంతాలు కట్టుకుని నిరసన తెలిపారు. స్థానిక ఫైర్‌స్టేçÙన్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం గురువారం కొనసాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ వేలాది మంది ప్రజలు ఫుడ్ పార్కు నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసు పహారాలో నిర్మాణ పను లు చేయించడం దారుణమన్నారు.
సబ్ కలెక్టర్ 144 సెక్షన్ విధించగా పోలీసులు దానిని యాజమాన్యానికి అనుకూలంగా అమలు చేస్తున్నారని, సీఎం చంద్రబాబు ప్రజలపై అక్రమ కేసులు పెట్టించి పారిశ్రామికవేత్తలకు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించారు. జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే నిమ్మ, మామిడి పండ్ల రసాలు, కొబ్బరి ఉప ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటుచేయాలని, వెంటనే పుడ్‌పార్క్ నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నాయకులు నేతల రమేష్, పి,కిషోర్, వైఎస్ కనకారావు, గొట్టాపు మురళీ, జి. విజయలక్ష్మీ, కె.కృష్ణమాచార్యులు, సీహెచ్.రాజలక్ష్మీ, ఆదిశేషులు పాల్గొన్నారు.