breaking news
colonys
-
శివారుల్లో కొత్త కాలనీలు, లేఅవుట్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివారుల్లో అభివృద్ధితో కూడిన కాలనీలు, లేఅవుట్లు చేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సమాయత్తమైంది. దీనిలో భాగంగా భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) కోసం హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా ప్రాంతాల్లో 50 ఎకరాలకు తగ్గకుండా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న రైతులు నెల రోజుల్లోగా తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయం లోని భూసమీకరణ విభాగంలో సంప్రదించి.. తమ భూమి వివరాలతో కూడిన దరఖాస్తును అందించా లని పేర్కొన్నారు. ‘భూ యాజమాన్యపు హక్కు పట్టా ఉండాలి. కోర్టు కేసుల్లో ఉన్న భూములు తీసుకోరు. పట్టణాభివృద్ధి విభాగం తేదీ 1996 మార్చి 8 ప్రకారం ప్రతిపాదిత భూమి మాస్టర్ ప్లాన్ ప్రకారం బఫర్‌జోన్, చెరువు, ఫుల్ ట్యాంక్ లెవల్, ఓపెన్ స్పేస్, జీవో ఎం ఎస్ నం.111లో ఉండకూడదు. మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రణాళిక–2031 నియమనిబంధనల ప్రకారం శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’అని స్పష్టం చేశారు. సగం ప్లాట్లు రైతులకు..: భూ సమీకరణకు అంగీకరించిన రైతులతో అభివృద్ధి ఒప్పందం–జీపీఏ కుదుర్చుకుంటారు. ఇది ఆమోదం పొందిన 6 నెలల్లోగా రోడ్లు, పాఠశాలలు, పార్కులు, పచ్చదనం, రవాణా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేసిన ప్లాట్లలో సగం సంబంధిత యజమానికి అప్పగిస్తారు. మిగతా సగం ప్లాట్లను హెచ్ఎండీఏ తన వద్దే ఉంచుకుంటుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న భూముల యజమానులకు అక్కడే స్థలాన్ని ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మిగతా భూములను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ప్లాట్లు కేటాయించిన 6 నెలల్లోగా అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతను యజమానుల సంఘానికి అప్పగించేలా పథకంలో నిబంధనలు పొందుపరిచారు. మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలను కల్పించకపోతే ప్రతి నెలా భూమి మూల విలు వ(బేసిక్ వాల్యూ)పై 0.5% పరిహారాన్ని చెల్లిస్తారు. -
మునుగూరు!
lకట్టువాగుకు రివిట్మెంట్ లేక అవస్థలు lఆక్రమణలకు గురవుతున్న కాలువలు lపూడికతీత ఊసెత్తని ‘సింగరేణి’ lనరకయాతన పడుతున్న కాలనీవాసులు రివిట్మెంట్ లేని కట్టువాగు.. ఆక్రమణలకు గురవుతున్న వాగులు, కాల్వలు.. కుచించుకుపోతున్న కాల్వల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం.. ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు.. వర్షం వచ్చిందంటే మణుగూరు ప్రజల పరిస్థితి కక్కలేక.. మింగలేకుండా ఉంది. వర్షాకాలం ఎక్కువ భాగం కాలనీలు ముంపునకు గురవుతుండడంతో నరకయాతన పడాల్సి వస్తోంది. – మణుగూరు మణుగూరు: మణుగూరు ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే వణికిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల పట్టణం దాదాపు 90 శాతం జలమయం అయింది. పట్టణం మధ్య నుంచి ప్రవహిస్తున్న కట్టువాగు, ఆంధ్రా బ్యాంకు సమీపం నుంచి ప్రవహించే సింగారం అలుగు కాలువ పలుచోట్ల అక్రమణలకు గురికావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు అంటున్నారు. దాదాపు 90 శాతం వీధులు జలమయం కావడంతోపాటు కొత్తగూడెం–ఏటూరునాగారం ప్రధాన రహదారిపైకి సైతం వరద నీరు చేరడంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సుందరయ్య నగర్, శ్రీశ్రీనగర్, గాంధీ నగర్, ఆదర్శ నగర్, మేదరబస్తీ, లెనిన్ నగర్, కాళీమాత ఏరియా, చేపల మార్కెట్ ఏరియా తదితర ప్రాంతాలు వరద నీటితో నిండిపోయి.. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పలసింగారం నుంచి వచ్చే సింగారం అలుగు కాలువ అనేక చోట్ల ఆక్రమణలకు గురికావడంతో వర్షం వచ్చినప్పుడు కాలువ పొంగి.. వరద నీరు వీధులు, ఇళ్లలోకి వస్తోంది. అలాగే స్టేట్‌బ్యాంక్ పక్క నుంచి ప్రవహించే కట్టువాగు నీరు గతంలో మణుగూరు చెరువులోకి సాఫీగా వెళ్లేది. దీని పైభాగంలో ఆక్రమణలు, కిందిభాగంలో భారీగా పూడిక పేరుకుపోవడంతో వర్షం వచ్చినప్పుడు పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. కాలువల ఆక్రమణల వల్ల రివిట్మెంట్ కట్టే విషయం మరుగున పడుతోంది. ఇక పూడిక తీయకపోవడంతో మణుగూరు చెరువు అనుకున్న సమయానికి నిండే పరిస్థితి లేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. పూడిక తీతకు సహకరిస్తామని ఎమ్మెల్యేకు చెప్పిన సింగరేణి అధికారులు సైతం ముఖం చాటేయడం గమనార్హం. దీంతో సింగరేణి సహకారం అంతంతమాత్రమే అన్నట్లుగా ఉంది. పైభాగంలో ఆక్రమణలు, కిందిభాగంలో పూడిక తీయకపోవడంతో వరద నీరు నేరుగా వీధులు, ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. దీంతో కొన్ని రోజులపాటు పట్టణంలో మురుగు పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చినప్పటి నుంచి వర్షాలు తగ్గేవరకు పట్టణ ప్రజలు భయంభయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.