మరుగుదొడ్ల నిర్మాణం అందరి బాధ్యత
చెరుకుమిల్లి (ఆకివీడు): జిల్లా మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ కోరారు. స్థానిక పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ, రోడ్డు, వర్మీ కంపోస్టు పథకం ప్రారంభం, స్మార్ట్ విలేజ్ ఏర్పాటు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగిన సభలో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. జిల్లాలో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీంతోపాటు డంపింగ్ యార్డుల నిర్మాణంలో కూడా ముందుండాలన్నారు.
జిల్లాలో ఉంyì నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచేందుకు మరో ఐదు వేల మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని చెప్పారు. గ్రామంలో దాతల ఔదార్యం అమోఘమన్నారు. స్మార్టు విలేజ్‌కి రూ.60 లక్షలు కేటాయించి, మొదటి విడతగా రూ.30 లక్షలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే వీవీ శివరామరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రథమంగా స్మార్ విలేజ్‌ని చెరుకుమిల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
దాతల విరాళం
గ్రామంలో అభివద్ధి పనుల నిమిత్తం దాట్ల పద్మ సుందరి చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ దాట్ల సత్యనారాయణరాజు రూ.16 లక్షలు, దాట్ల రామరాజు రూ.5 లక్షలు, ఎంఎస్ దుర్గరాజు రూ.5 లక్షలు, దాట్ల బాబ్జీరాజు రూ.5 లక్షలు, దాట్ల రంగరాజు రూ.8 లక్షలు విరాళంగా అందజేశారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు మన్నే లలితాదేవి, ఏఎంసీ చైర్మన్ మోటుపల్లి ప్రసాద్, సర్పంచ్ బొర్రా సుజాత, ఎంపీడీవో నాయిని శ్రీనాథ్, పంచాయతీరాజ్ డీఈఈ బీహెచ్ రఘుపతిరాజు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ వి.గిరి, ఏఈఈ మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.