breaking news
Colgate case
-
కోల్గేట్కు షాక్.. రూ.65 వేల జరిమానా
సంగారెడ్డి: కోల్గేట్ సంస్థ పేస్టును అధిక ధరకు విక్రయిస్తున్నారని చెప్పి ఓ వినియోగదారుడు పిటిషన్ వేయగా విచారించిన వినియోగదారుల ఫోరం రూ.65 వేల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అధిక ధరకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తోందని సంగారెడ్డికి చెందిన ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను విచారించి శుక్రవారం ఫోరం తీర్పునిచ్చింది. న్యాయవాదిగా పనిచేస్తున్న సీహెచ్ నాగేందర్ 2019 ఏప్రిల్ 7వ తేదీన సంగారెడ్డిలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ.92కు కొన్నారు. దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్‌పేస్ట్ రూ.10కి కొనుగోలు చేశారు. అయితే రూ.పదికి 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకోవడంపై నాగేందర్ సందేహం వ్యక్తం చేశారు. అంటే రూ.17 అధికంగా తీసుకుంటున్నారని గుర్తించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారంటూ ఆయన కోల్గేట్ సంస్థ వారికి నోటీసులు పంపించారు. అతడి నోటీసులకు కోల్గేట్ సంస్థ స్పందించకపోవడంతో ఆయన సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ను విచారించి కోల్గేట్ సంస్థ అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు ఇచ్చారు. దాంతోపాటు ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ. 5వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థను ఆదేశించారు. అయితే ఇవన్నీ కూడా నెల రోజుల్లోపు వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ విధంగా వినియోగదారుల ఫోరం వినియోగదారుల కోసం పని చేస్తుంటుంది. మీరు కూడా ఎక్కడైనా.. ఏం సంస్థ వస్తువు విషయంలో మోసపోతే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. -
రంజిత్ సిన్హాపై సీవీసీ దర్యాప్తు
‘కోల్గేట్’ నిందితులను కలవడాన్ని తప్పుబట్టిన సుప్రీం సీబీఐ మాజీ డెరైక్టర్ తీరుపై ఆక్షేపణ జూలై 6లోగా నివేదిక ఇవ్వాలని సీవీసీకి ఆదేశం న్యూఢిల్లీ: కోల్గేట్ కేసులో సీబీఐ మాజీ డెరైక్టర్ రంజిత్‌కుమార్ సిన్హా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసులో నిందితుడిని ఆయన కలుసుకోవడం సమంజసం కాదని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. సిన్హా వ్యవహరించిన తీరుతో కేసు ఎంతమేరకు ప్రభావితమైందన్న దానిపై విచారణ చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు సూచించింది. పలు కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను దర్యాప్తు అధికారుల పరోక్షంలో రంజిత్‌కుమార్ కలవడం ఆక్షేపణీయమని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి జూలై 6లోగా నివేదిక అందించాలని సీవీసీని ఆదేశించింది. ఆ సమావేశాల తర్వాత సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లు, దర్యాప్తు నివేదికల్లో ఏమైనా తేడాలున్నాయా గుర్తించాలని సూచించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇలాంటి సమావేశాలు జరిగినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ భేటీలు అధికారిక రహస్యాల చట్టం పరిధిలోకి రావని, సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను సేకరించడం ప్రజాప్రయోజనాల కిందకే వస్తుందని స్పష్టం చేసింది. కాగా, తనపై పిటిషన్ వేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్‌భూషణ్ అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై ఆయన్ని విచారించాలని సీబీఐ మాజీ చీఫ్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బొగ్గు స్కాంకు సంబంధించిన కేసులను బలహీనపరిచేందుకు రంజిత్‌కుమార్ అధికార దుర్వినియోగం చేశారంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బొగ్గు స్కాంలో నిందితులుగా ఉన్న అప్పటి రాజ్యసభ ఎంపీ విజయ్ దర్దా సహా పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో రంజిత్‌కుమార్ సమావేశమైనట్లు ఆయన నివాసంలో ఉండే సందర్శకుల పుస్తకంలోని పేర్ల ద్వారా తెలుస్తోందని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని కోరారు.