breaking news
cock bettings
-
డబ్బు కోసం మాత్రం కాదు.. ఆనందం కోసం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్ శివార్లలో మూడు రోజుల పాటు కోడి పందేలు జోరుగా సాగాయి. ఈ సంక్రాంతికి అనేక కారణాల నేపథ్యంలో నగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కరోనా ప్రభావంతో పాటు ఏపీ హైకోర్టు ఆదేశాలు, కోడి కత్తుల తయారీ కేంద్రాలు, విక్రేతలపై దాడులు.. వెరసి అక్కడకు వెళ్లే వారి సంఖ్య 20 శాతానికి పడిపోయింది. దీంతో రాష్ట్రంలోనే పందేల నిర్వహణకు కొందరు నడుంకట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ అర్బన్, రూరల్, భూపాలపల్లి, ములుగు... ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలైన భద్రాచలం ఏజెన్సీ, దుమ్ముగూడెం, మారాయిగూడెం, హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా బిర్రులు పుట్టుకొచ్చాయి. ఆయా చోట్ల కోడి పందేల నిర్వహణకు బిర్రులు ఏర్పాటు చేసిన నిర్వాహకులు పార్కింగ్, ఎంట్రీ ఫీజులు నిర్ణయించారు. పబ్బుల్లో మాదిరిగా ఫీజు చెల్లించిన వారికి చేతిపై ప్రత్యేక మార్కులు వేస్తూ బిర్రుల్లోకి అనుమతించారు. కొన్ని రహదారుల్లో ఈ పందెం రాయుళ్లు, సందర్శకుల తాకిడితో ట్రాఫిక్ జామ్ కూడా అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చెక్ పోస్టులకు దీటుగా ‘పోర్టర్లు’... ఈ పరిస్థితిని గమనించిన పోలీసులు రాష్ట్రంలో కోడి పందేలకు ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించారు. వీటిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా బిర్రులకు దారితీసే మార్గాల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నుంచి వాహనాలను తనిఖీ చేస్తూ కోడి పుంజులు, నగదుతో వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే వీరి తనిఖీలకు ఇతర ప్రాంతాల వారు చిక్కకుండా ఉండేందుకు స్థానికుల్లో కొందరు ‘పోర్టర్ల’అవతారమెత్తారు. ఒక్కో పుంజుకు రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తూ దొడ్డిదారిన బిర్రుల వద్దకు చేర్చారు. చెక్ పాయింట్లకు కాస్త దూరంలో కాపుకాసిన ఈ పోర్టర్లు ఆ దారిలో వస్తున్న వాహనాల నంబర్ల ఆధారంగా గుర్తిస్తారు. ఆయా వాహనాల్లోని వారికి చెక్ పాయింట్ విషయం చెప్పి.. వారి నుంచి నగదు, పుంజును తీసుకుని బిర్రు వద్దకు చేర్చారు. మొత్తానికి ఈసారి రాష్ట్రంలోని అనేక బిర్రుల్లో నగరవాసుల సందడి కనిపించింది. ఛత్తీస్‌గఢ్‌లోని మారాయిగూడెం సమీపంలో పందేల స్థావరం వద్ద పార్కింగ్ చేసిన కార్లు పలువురి అరెస్టు... గురువారం దుమ్ముగూడెం పరిధిలోని పెద్ద బండిరేవు గ్రామంలో దాడి చేసిన పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్‌లో పోలీసులు ఏడుగురు పందెంరాయుళ్లను పట్టుకున్నారు. కోడి పందేల జాతర.. భద్రాచలం/అశ్వారావుపేట: ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు జాతరలా మారాయి. భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం, సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని మారాయిగూడెంలో దర్జాగా పందేలు నిర్వహించారు. పందేలు భద్రాచలం, చుట్టుపక్కల ప్రాంతాల సూత్రధారుల కనుసన్నల్లోనే జరిగాయి. దుమ్ముగూడెం మండలంలో పోలీసులకు తెలియకుండా కొన్ని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. బిర్రుల చుట్టు పక్కల ఏర్పాటు చేసిన, పేకాట, మూడు ముక్కలాట, గుండ్రాట, బొమ్మా బొరుసు ఆటల్లో వేల రూపాయల్లో డబ్బు పోగొట్టుకుని జేబులు గుల్లచేసుకుంటున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు ఆనుకుని ఏపీ లోని జీలుగుమిల్లి, చింతలపూడి, కుక్కునూ రు, వేలేరుపాడు మండలాలు ఉండటంతో ఎక్కడివారు అక్కడే సరిహద్దు మండలాలను దాటేసి జోరుగా కోడిపందేల్లో పాల్గొన్నారు. వినోదం, ఆహ్లాదం కోసమే.. ‘పందేలు ఏ స్థాయిలో కాసినా అది డబ్బు కోసం మాత్రంకాదు.. ఆనందం కోసం మాత్రమే. నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. ఈసారి కరోనాతో ఎటూ వెళ్లలేకపోయాం. సంక్రాంతికి ప్రతి ఏడాది ఆంధ్రాకు వెళ్లేవాళ్లం. ఈసారి ఆ అవకాశం లేకపోవడంతో కోడి పందేల కోసం కుటుంబంతో సహా భూపాలపల్లికి వెళ్లాం. పుంజుల్ని పాతబస్తీలోని బార్కస్ ప్రాంతంలో కొనుగోలు చేశాం. పోలీసుల దృష్టిలో పడకుండా ఉండేందుకు స్థానిక యువకులు సహకరించారు’. – నగరానికి చెందిన ఓ పందెం రాయుడు -
కోడి పందేల ముఠా అరెస్ట్
విశాఖ క్రైం: నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుట్టుగా కోడి పందేలు నిర్వహిస్తున్న ముఠాని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాటిచెట్లపాలెం దరి లెప్రసీ కాలనీలోని బహిరంగ ప్రదేశంలో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో టాస్క్ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు ఆనంద్ పరారయ్యాడు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే 18 పందెం కోళ్లు, రూ.5వేలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ చిట్టిబాబు మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేశామన్నారు. దాడుల్లో ఎస్ఐలు సతీష్, మూర్తి సిబ్బంది పాల్గొన్నారు. -
తొలిరోజే రూ.100 కోట్లకు పైగా కోడిపందాలు
రాజమండ్రి/ఏలూరు: సంక్రాంతి వచ్చిందంటే భారీ ఎత్తున జూదానికి తెర తొలగిందన్నమాటే. సంకాంత్రి పండగ పర్వదినాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఇష్టారాజ్యంగా కోడిపందాలు శ్రుతి మించిపోతున్నాయి. సంకాంత్రి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెలం, జీలుగుమిల్లిలో ఇప్పటికే కోడిపందాలు ప్రారంభమైయ్యాయి. గోదావరి జిల్లాల్లో తొలిరోజే 100 కోట్లకు పైగా పందాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోడిపందాలపై ఎలాంటి ఆంక్షలు, నియంత్రణ గానీ విధించినా వాతావరణం కనిపించటలేదు. దాంతో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు దగ్గర ఉండి మరీ పందాలు ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. ఆ రెండు జిల్లాల్లో కోడిపందాలను నియంత్రణ చేయలేక ఆఖరికి పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఈ పందాలను అరికట్టడానికి అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకునేందుకు యత్నించినప్పటికీ వీటిని అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. -
తొలిరోజే రూ.100 కోట్లకు పైగా కోడిపందాలు
-
కోడి పందాల నిర్వహణపై లోకాయుక్త ఆదేశాలు
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, బెట్టింగ్‌లు నిర్వహించకుండా జంతుహింస నిరోధక చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయాలని తూర్పు, పశ్చిమ గోదావరి, కష్ణా జిల్లాల ఎస్పీలను లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి శుక్రవారం ఆదేశించారు. దీనిపై ఈనెల 27 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోడిపందాలు, బెట్టింగ్‌లు బహిరంగంగా జరుగుతున్నా పోలీసులు చర్యలు చేపట్టడం లేదంటూ హైకోర్టు న్యాయవాది జి.రోనాల్డ్‌రాజ్, పీడీ రాయులు దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పందేల ద్వారా ఏటా రూ.300 కోట్లు చేతులు మారుతున్నాయని, ఈ వైనాన్ని మీడియా ప్రత్యక్షంగా చూపుతున్నా పోలీసులు స్పందించడం లేదని పిటిషనర్లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ఎక్కువ సమయం లేనందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని లోకాయుక్తను కోరారు.