breaking news
Co-operative system
-
AP: సహకారంతో పాడి పంట..
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార వ్యవస్థ తిరిగి బలోపేతం కావాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాలను అందిపుచ్చుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్లో భాగంగా చాలా మంది మహిళలు పాడి పశువులను కొనుగోలు చేశారని చెప్పారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు మరింత మేలు చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించి సబ్సిడీలు వారికి నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. ఆక్వా హబ్‌ల్లో భవిష్యత్తులో చిన్న సైజు రెస్టారెంట్ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సూచించారు. జగనన్న పాలవెల్లువ, మత్స్య శాఖలపై ముఖ్యమం‘త్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన పాలవెల్లువ మార్గదర్శకాలు, శిక్షణ కరదీపిక పుస్తకాలను ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. ‘ఫిష్ ఆంధ్రా’ లోగోను విడుదల చేశారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. అమూల్ రాకతో పాడి రైతులకు ప్రయోజనం అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలు తప్పనిసరిగా సేకరణ ధరలు పెంచాల్సి వచ్చిందని, అమూల్ రాకతో పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి రూ.15 వరకూ అదనపు ఆదాయం సమకూరుతోందని సీఎం పేర్కొన్నారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడి రైతులకు మరింత మేలు జరుగుతుందన్నారు. బీఎంసీయూల కీలక పాత్ర మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధి కోసం వైఎస్సార్ ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పాడి పశువులను కొనుగోలు చేసిన మహిళలకు మరింత చేయూతనిచ్చేందుకు బీఎంసీయూలను (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు) నిర్మిస్తున్నామని, పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. బీఎంసీయూల ఏర్పాటు ద్వారా మరింత పారదర్శకత వస్తుందన్నారు. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం పెంపు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఆక్వాహబ్‌లు, మత్స్యసాగులో నూతన విధానాలు, రైతులకు మేలు చేకూర్చే అంశాలపైనా సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేలా ఆక్వాహబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తెస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. సరిగ్గా పంట చేతికి వచ్చే నాటికి దళారులు సిండికేట్ అయి రేట్లు తగ్గిస్తున్నారని సీఎం గుర్తు చేశారు. ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్‌దారులు కుమ్మక్కవుతున్నట్లు పలు దఫాలు ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనికి పరిష్కారంగా ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్, రిటైల్ రంగాల్లోకి ప్రభుత్వం అడుగుపెడుతోందని తెలిపారు. ఎగుమతి మత్స్య ఉత్పత్తులపై అవగాహన ఎగుమతులకు అవకాశం ఉన్న మత్స్య ఉత్పత్తుల పెంపకంపై అవగాహన, ప్రచారం, శిక్షణ కల్పించి రైతులను ఆ దిశగా ప్రోత్సహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆక్వా రైతులకు మేలు చేసేలా నాణ్యమైన ఫీడ్, సీడ్ అందించడంతోపాటు దోపిడీ వి«ధానాలను అడ్డుకునేందుకే కొత్త చట్టాన్ని తెచ్చామని, దీన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి ఆక్వా హబ్‌లు, అనుబంధ రిటైల్ దుకాణాల ద్వారా దాదాపు 40 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. జనవరి 26 నాటికి 75 – 80 హబ్‌లు, 14 వేల రిటైల్ ఔట్లెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్ యూనిట్లను సిద్ధం చేస్తామని వివరించారు. 10 ప్రాసెసింగ్ ప్లాంట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల మార్కెట్లో సిండికేట్‌కు అడ్డుకట్ట పడి రైతులకు మంచి ధరలు వస్తాయని తెలిపారు. పురోగతిలో ఫిషింగ్ హార్బర్ల పనులు రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పనులు మొదలైనట్లు అధికారులు తెలిపారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో తొలివిడతగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది జూన్ – జూలై నాటికి ఈ నాలుగు ప్రారంభానికి సిద్ధమవుతాయని వెల్లడించారు. మిగిలిన ఐదు ఫిషింగ్ హార్బర్ల పనులు ఈ డిసెంబర్లో ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఏపీ మారిటైం బోర్డు సీఈవో కే.మురళీధరన్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఏ.బాబు, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్రకుమార్, అమూల్ ప్రతినిధులు తదితరులు సమీక్షకు హాజరయ్యారు. జగనన్న పాలవెల్లువ ఇలా.. – 2020 నవంబర్‌లో పాడి రైతుల నుంచి 71,373 లీటర్ల పాలు అమూల్ ద్వారా కొనుగోలు –2021 ఆగస్టులో 14,46,979 లీటర్ల పాలు కొనుగోలు – ఇప్పటివరకూ మొత్తం 1,10,06,770 లీటర్ల పాలు కొనుగోలు – రోజూ సగటున అమూల్ కొనుగోలు చేస్తున్న పాలు 6,780 లీటర్ల నుంచి 51,502 లీటర్లకు పెంపు వ్యవస్థీకృతంగా ధ్వంసం.. ‘‘గత పాలకులు సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారు. వారి కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఏ సహకార సంస్థనూ సరిగా నడవనివ్వని పరిస్థితులను సృష్టించారు. సహకార రంగ డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించడంతో పాటు ప్రైవేట్ సంస్థలుగా మార్చుకున్నారు’’ – సీఎం జగన్ -
సొసైటీల్లో సంస్కరణలకు బ్రేక్
సాక్షి, మచిలీపట్నం : సహకార వ్యవస్థను ‘భక్షి’ంచే సంస్కరణలకు బ్రేక్ పడింది. ప్రకాష్ బక్షి సిఫారసులు సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయని, వాటిని అమలు చేయరాదని పేర్కొంటూ రైతులు, సొసైటీల పాలకవర్గాలు కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దీంతో వెనకడుగు వేసిన నాబార్డు బక్షి సిఫారసులను కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదంటూ సడలింపు ఇచ్చింది. తాజాగా సహకార సంఘాల పాలకవర్గాలు, రైతులకు ఇష్టమైతేనే బక్షి సిఫారసులు అమలు చేసుకోవచ్చని సవరణ తెచ్చింది. నాబార్డు తాజా ఉత్తర్వులపై రైతు ప్రతినిధులు, సొసైటీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిబంధకంగా ప్రతిపాదనలు.. సహకార సొసైటీల్లో సంస్కరణలు తెస్తూ నాబార్డు చైర్మన్ ప్రకాష్ బక్షి అధ్యక్షతన రిజర్వ్ బ్యాంక్ నిపుణుల కమిటీ ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. సహకార సంఘాలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులకు వ్యాపార కార్యకర్తలు (బిజినెస్ కరస్పాండెంట్)గా ఉండాలన్నది ప్రధాన ప్రతిపాదన. గ్రామీణ స్థాయిలో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగించేలా ఉండే సొసైటీలకు ఈ ప్రతిపాదన ప్రతిబంధకమేనన్న వాదన ఉంది. బక్షి ప్రతిపాదనలు అమలు చేస్తే వందేళ్ల చరిత్ర కలిగిన సహకార వ్యవస్థ నిర్వీర్యమవుతుందన్న విమర్శలు వచ్చాయి. సొసైటీలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి ఆన్లైన్ పద్ధతి ద్వారా జిల్లా, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులను అనుసంధానం చేయాలన్న సూచన అమలు చేయాలంటే ఇప్పట్లో సాధ్యం కాదని ఆయా పాలకవర్గాలు, ఉద్యోగ సంఘాలు చేతులెత్తేశాయి. ఇదే విషయమై జిల్లాలో రైతులు, రైతు సంఘాలు, సొసైటీల పాలకవర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాయి. బక్షి సూచనలు ఏమిటంటే.. బక్షి చేసిన సూచనల ప్రకారం ప్రధానంగా జిల్లాలోని 425 సహకార సంఘాలను కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు అజమాయిషీలోకి తేవాల్సి ఉంటుంది. కేడీసీసీ బ్యాంకుకు అవి వ్యాపార కార్యకర్తలుగానే ఉంటాయి. దీంతో జిల్లాలో ఉన్న కేడీసీసీ బ్యాంక్ 50 బ్రాంచిలకు 425 సొసైటీలు బిజినెస్ కరస్పాండెంట్లుగా మారితే వాటి స్వయంప్రతిపత్తిని కోల్పోయినట్టే. జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు ఉన్న ఆస్తులు, అప్పులను సెంట్రల్ బ్యాంకుకు బదలాయించాల్సి ఉంటుంది. సొసైటీల్లో సేకరించిన డిపాజిట్లు సైతం జిల్లా, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకుల రికార్డులకు బదలాయించాల్సి ఉంటుంది. ఇకపై సొసైటీలు సొంతంగా డిపాజిట్లు సేకరించడానికి వీలుండదు. దీనికితోడు అన్ని సొసైటీల్లో కంప్యూటరీకరణ చేసి సభ్యులు, రైతులు, రుణాలు తదితర అన్ని వివరాలను ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఇకపై రైతుల రుణాలు, రుణాల చెల్లింపు, వడ్డీ రాయితీ, సబ్సిడీ తదితర వివరాలను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఇలా సుమారు 13 సూచనలు చేసిన ప్రకాష్ బక్షి ఇవి కేవలం ఆర్థికపరమైన అంశాలపై మార్పులు మాత్రమేనని, సొసైటీలు, బాధ్యతలు యథావిధిగా కొనసాగుతాయని ప్రస్తావించారు. సూచనలపై అభ్యంతరాలు.. బక్షి సూచనలపై కేడీసీసీ బ్యాంక్, సొసైటీల పాలకవర్గాలు అభ్యంతరం తెలుపుతూ ఇటీవల పలు తీర్మానాలు చేశాయి. ఈ నెల తొలి వారంలో జరిగిన కేడీసీసీ బ్యాంక్ పాలకవర్గ సమావేశంలో చేసిన సుమారు తొమ్మిది తీర్మానాల ప్రతులను రాష్ట్ర ముఖ్యమంత్రి, సహకార మంత్రి, ఆప్కాబ్ చైర్మన్, కోఆపరేటివ్ రిజిస్ట్రార్లకు అందించారు. కేడీసీసీ బ్యాంక్ పాలకవర్గ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానాలివీ.. బక్షి సిఫారసులు అమలుచేస్తే వందేళ్ల చరిత్ర కలిగిన సహకార వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. సొసైటీల్లోని డిపాజిట్లు, అప్పులు డీసీసీ బ్యాంకులకు బదలాయిస్తే దూరప్రాంతాల నుంచి రైతులు, ఖాతాదారులు డీసీసీబీ బ్రాంచిలకు రావడం కష్టమవుతుంది. తద్వారా ఎవరికివారే తమ డిపాజిట్లు తీసేసుకునే ప్రమాదం ఉంది. సొసైటీల్లో ఆస్తులు, అప్పులు, షేర్ ధనం బదలాయిస్తే సంఘాల్లో నిధుల కొరత తీవ్రమవుతుంది. జిల్లా రుణ ప్రణాళికలో కేవలం 22 శాతం ఉన్న వ్యవసాయ రుణాలు ఈ సంస్కరణలతో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. బక్షి సిఫారసులు అమలు చేయాలంటే 1964 సహకార చట్టాన్ని సవరణ చేయాలన్న ప్రతిపాదన సరికాదు. ఆన్లైన్ ద్వారా రైతులు, సొసైటీల్లో సభ్యులకు సేవలు మంచిదే, రుణాలు తీసుకున్న వారికి ఏటీఎం ద్వారా డబ్బు తీసుకునే వెసులుబాటు కల్పించడం స్వాగతించదగినదే. అయితే ఇవి ఎటువంటి ఇబ్బందీలేకుండా అమలు జరగాలంటే పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ, ఆన్లైన్ పద్ధతి అమలు చేయడం ఇప్పట్లో కష్టమే అని సొసైటీల పాలకవర్గాలు తేల్చిచెబుతున్నాయి.