breaking news
CNN - Ibn survey
-
అదో దగాకోరు సర్వే
సీఎన్ఎన్-ఐబీఎన్ ఎన్నికల సర్వేపై మండిపడ్డ మైసూరారెడ్డి హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సీఎన్ఎన్-ఐబీఎన్ టీవీ చానల్ ప్రసారం చేసిన సర్వే ఒక దగాకోరు సర్వే అని, ఏప్రిల్ ఫస్ట్‌న ప్రజలను ఏప్రిల్ ఫూల్స్‌ను చేయడానికే ఆ చానల్ ఇలా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పతనమైపోతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును పైకి లేపడానికి చేసిన ప్రయత్నంగా సీఎన్ఎన్-ఐబీఎన్ ఈ సర్వేను చేసినట్లుగా ఉందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 23 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేవలం 1,300 మంది అభిప్రాయాలను సేకరించి చేసిన సర్వేకు అసలు విలువుంటుందా? ఇది గదుల్లో కూర్చుని చేసిన అంకెల గారడీ మాదిరిగా ఉందని విమర్శించారు. ఆయనేమన్నారంటే... సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ సర్వేలో సీమాంధ్రలో 14 శాతం ఇతర పార్టీలకు వస్తాయని చెప్పింది. అయితే ఆ ఇతర పార్టీలేమిటో కూడా చెప్పాలి కదా? అసలు వీళ్లు ఎన్నికల సర్వే నిర్వహించే సెఫాలజిస్టులేనా? రాష్ట్రంపై వీరికి అవగాహన ఉందా? వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ కాక ఇతర పార్టీలంటే లోక్‌సత్తా, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. జనసేన ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ. గత ఎన్నికల్లో లోక్‌సత్తాకు 1.2, ఉభయ కమ్యూనిస్టులకు 4.4 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అలాంటిది 14శాతం ఇతర పార్టీలకు వస్తాయని అంచనా వేయడం మోసపూరితం కాక మరేమిటి? ఇదే చానల్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్‌కు 45 శాతం, టీడీపీకి 33 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనాలు వేసి, లోక్‌సభ సీట్లు వస్తాయనే విషయానికి వచ్చేటప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11 నుంచి 17, టీడీపీకి 10 నుంచి 16 సీట్లు వస్తాయని చెప్పింది. సాధారణంగా 1 లేదా 2 శాతం ఓట్లు అధిక శాతం వచ్చే పార్టీకే భారీ విజయాలు ఎన్నికల్లో లభిస్తాయి. అలాంటిది సీఎన్ఎన్-ఐబీఎన్ చానల్ అంచనా ప్రకారమే టీడీపీ కన్నా 12 శాతం ఓట్లు అధికంగా పొందే వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం తక్కువ సీట్లు వస్తాయా? ఇదెక్కడి విశ్లేషణ? వీళ్లేం సర్వేల నిర్వాహకులు? సీఎన్ఎన్-ఐబీఎన్, ఈనాడు సంస్థల్లో పెట్టుబడులు ఒకరివే , వారికి చంద్రబాబుతో ఉన్న సంబంధాలు అందరికీ తెలిసినవే. పతనస్థాయిలో ఉన్న చంద్రబాబును పెకైత్తడానికి ఈ సర్వే చేసినట్లుగా ఉంది. ఈ సర్వేపై మంగళవారం రాత్రి చానల్లో చర్చ సందర్భంగా పాల్గొన్న ప్యానలిస్టులు హిందూ ఎడిటర్ (రూరల్ అఫైర్స్) పాలగుమ్మి సాయినాథ్, ప్రధానమంత్రి మాజీ మీడియా సలహాదారు సంజయ్‌బారులు ఈ సర్వేను తప్పులతడక అని చెప్పారు. సీమాంధ్రలో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు ఈ సర్వే అద్దం పట్టడం లేదని దుమ్మెత్తి పోశారు. -
మీ సర్వేతో ఏకీభవించలేం
ఐబీఎన్ సర్వేపై సాయినాధ్, సంజయ్‌బారు అసంతృప్తి వైఎస్సార్సీపీకే విజయావకాశాలున్నాయని స్పష్టీకరణ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఆధిక్యం ప్రదర్శిస్తుందన్న సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ సర్వేతో తాను ఏకీభవించలేనని, సీమాంధ్రలోని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీయే అత్యధిక స్థానాలు సాధిస్తుందని చర్చలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయుడు, హిందూ రూరల్ అఫైర్స్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాధ్ తెగేసి చెప్పారు. ప్రధాని మాజీ మీడియా సలహాదారు సంజయ్‌బారు కూడా సీమాంధ్రలో వైఎస్సార్సీపీకే విజయావకాశాలు ఎక్కువని అభిప్రాయపడ్డారు. సీఎస్డీఎస్-లోక్‌నీతి ఎలక్షన్ ట్రాకర్‌తో కలిసి సీఎన్ఎన్-ఐబీఎన్ నిర్వహించిన సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ సీట్లలో టీడీపీ 13-19, వైఎస్సార్సీపీ 9-15, టీఆర్ఎస్ 4-8, కాంగ్రెస్ 4-8 సీట్లు చేజిక్కించుకుంటాయని అంచనా వేశారు. వైఎస్సార్సీపీకే విజయావకాశాలు: సాయినాధ్ సీమాంధ్రలో 39శాతం ఓట్లతో టీడీపీ ముందంజలో ఉంటుందని, వైఎస్సార్సీపీ 33శాతం ఓట్లు సాధిస్తుందన్న సర్వే ఫలితాలతో సాయినాధ్ ఏకీభవించలేదు. ముఖ్యంగా కోస్తాలో టీడీపీ 43శాతం సాధిస్తుందని, వైఎస్సార్సీపీకి కేవలం 23శాతం ఓట్లు వస్తాయని, రాయలసీమలో వైఎస్సార్సీపీకి 41శాతం, టీడీపీకి 31శాతం ఓట్లు వస్తాయని ప్రకటించారు. దీనిపై సాయినాధ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘ఈ సర్వేతో నేను అంగీకరించలేను. నెల, రెండు నెలల కంటే ఇప్పుడు టీడీపీ పరిస్థితి మెరుగుపడిందనడంపై నేను ఏకీభవించను. గత దశాబ్దంగా సీఎన్ఎన్తోసహా వివిధ సర్వేలు చంద్రబాబు నాయుడు బలాన్ని ఎక్కువగా అంచనా వేశాయి. మళ్లీ ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించడంవల్ల సీమాంధ్రలో పూర్తిగా కనుమరుగవుతోంది. ఆ పార్టీ నేతలు వైఎస్సార్సీపీ, టీడీపీవైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరుతున్నారు. దీనివల్ల ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి నెలకొంటోంది. ముఖ్యంగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. 30, 40 ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్నవారు ఒకే పార్టీలో, ఒకే వేదికను పంచుకోవాల్సి వస్తుంది. ఇది అంత సులభంకాదు. నేతలు మారినా కేడర్ మారదు. బీజేపీతో పొత్తు తెలంగాణలో లాభించవచ్చేమోగాని సీమాంధ్రలో టీడీపీకి ఎలాంటి మేలు చేకూరదు. విభజన విషయంలో బీజేపీకూడా తమను మోసం చేసింది సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీయే విజయం సాధిస్తుందని భావిస్తున్నా’’ అని సాయినాధ్ స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో వైఎస్సార్సీపీకే విజయావకాశాలు ఎక్కువని సంజయ్‌బారు కూడా అభిప్రాయపడ్డారు. నెలరోజుల్లో ఇంతమార్పా? సీఎన్ఎన్-ఐబీఎన్ నెల రోజుల వ్యవధిలోనే విభిన్న సర్వే ఫలితాలను ప్రకటించడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ సంస్థ ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో సీమాంధ్రలో వైఎస్సార్సీపీ 45శాతం ఓట్లు సాధిస్తుందని చెప్పగా, తాజా సర్వేలో 33 శాతానికే పరిమితం చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెలరోజుల్లో 12శాతం ఓట్లు చేజారేంత రాజకీయ పరిణామాలు ఏం జరిగాయని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే రాష్ర్ట విభజనకు లేఖనిచ్చిన టీడీపీకి 33నుంచి 39శాతానికి ఓట్లెలా పెరిగాయని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఏడుశాతం ఓట్లు రాగా, ఇతరులకు 14శాతం ఓట్లు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మార్చి 18-23 మధ్య నిర్వహించిన ఈ సర్వేకోసం రాష్ట్రంలో కేవలం 1308 మంది అభిప్రాయాలను మాత్రమే సేకరించి ఈ అంచనాకు రావడం గమనార్హం.