breaking news
CM peshi
-
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా అజేయ కల్లం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం కేబినెట్ హోదాతో తాజాగా సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎం పేషీ) అధిపతిగా ఆయన వ్యవహరిస్తారు. సీఎంవో కార్యదర్శులకు శాఖలను కేటాయించే బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు. ప్రభుత్వ సలహాదారులతోపాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. అందరూ ఆయనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ కాకముందు ఉన్న టీఏ, డీఏలు వర్తిస్తాయి. ప్రభుత్వ వాహనంతోపాటు నివాస వసతి సౌకర్యం కల్పిస్తారు. లేదంటే ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. డిప్యుటేషన్‌పై సిబ్బంది నియామకానికి ఆదేశాలు కల్లంకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)తోపాటు పేషీలో ప్రైవేట్ కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, నలుగురు ఆఫీసు సబార్డినేట్లు ఉంటారు. ఈ పోస్టులను ఆన్ డ్యూటీ పద్ధతిలో కేటాయిస్తారు. వారికి మాతృసంస్థల్లో వచ్చే వేతనాలతో పాటు పేషీలో పనిచేసినందుకు ప్రత్యేక అలవెన్సులు పొందడానికి అర్హత ఉంటుంది. డ్రైవర్లు, సబార్డినేట్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవచ్చు. డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమించేందుకు సాధారణ పరిపాలన శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ఎక్కడ పనిచేసినా మన్ననలే అజేయ కల్లం తిరుమల – తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్‌గా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎస్‌గా పనిచేసిన సమయంలో తన అభిప్రాయాలను ఫైళ్లపై నిర్మొహమాటంగా రాశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండగా రాజధాని అమరావతిలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తప్పుబడుతూ ఫైలులో కుండబద్దలు కొట్టినట్లు రాశారు. ‘స్విస్ ఛాలెంజ్ లోపభూయిష్టంగా ఉంది. ఇది పనికిమాలిన విధానం. దీనివల్ల నష్టం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవడం ఉత్తమం..’ అని ఫైలులో మూడు పేరాలు పొందుపరిచారు. ఆయన ఎక్కడ ఏ స్థాయిలో పనిచేసినా మంచి అధికారిగా, మానవతావాదిగా మన్ననలు పొందారు. -
సీఎం కేసీఆర్ పేషీలోకి గోపాలరెడ్డి రావట్లేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీలోకి మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన గోపాలరెడ్డి వస్తారని అనుకున్నా.. ఆయన ఇప్పుడు రావడం లేదని సమాచారం. 1985 బ్యాచ్‌కు చెందిన గోపాలరెడ్డి ప్రస్తుతం కేంద్ర హోం శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో (కేంద్ర పాలిత ప్రాంతాలు) బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనను కేసీఆర్ తన పేషీలో నియమించుకోవాలని నిర్ణయించి, ఆయనను అక్కడ నుంచి డెప్యుటేషన్‌పై కేటాయించాలని కోరారు. అయితే గోపాలరెడ్డి కంటే ఒక ఏడాది జూనియర్ అయిన నర్సింగరావు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ముఖ్యకార్యదర్శి హోదాలో పనిచేస్తున్నందున.. ఆయన దగ్గర పనిచేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే గోపాలరెడ్డి రావడానికి ఇప్పుడు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి.