నిట్టూర్పే మిగిలింది!
శ్రీకాకుళం, కలెక్టరేట్: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పర్యటన మొక్కుబడిగా ముగిసింది. పై-లీన్ తుపాను, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారంటే తమకు ఏదైనా మేలు జరుగుతుందని ప్రజలు భావించారు. తమ గోడు వింటారు.. సమస్యలు పరిష్కరిస్తారు.. పునరావాసం, వరదల నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశించారు. పరిహారం కూడా ఎక్కువ వస్తుందని ఎదురుచూశారు. ఎంతో ఆశించిన ప్రజలు సీఎం పర్యటన తర్వాత తీవ్ర నిరాశకు గురయ్యారు. గతాంశాలే తప్ప ప్రస్తుతం వాటిల్లిన నష్టాన్ని ఎలా భర్తీ చేయనున్నారో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాలుగు చోట్ల పర్యటనలోకానీ, విలేకరుల సమావేశంలో కానీ ఏ అంశంపైనా స్పష్టమైన వాగ్దానంగానీ, పరిహారానికి సంబంధించి నిధులు గురించి కానీ ప్రస్తావించలేదు. పై-లీన్ తుపాను వల్ల సుమారు రూ.435కోట్లు జిల్లాలో నష్టం వాటిల్లిందని జిల్లా యంత్రాంగం వారం రోజుల కిందటే ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నష్టం మరింత పెరిగింది. ఈనెల 23 నుంచి 28 వరకు కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో వ్యవసాయంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిని పూడ్చేందుకు, బాధితులను ఆదుకునేందుకు రూ.529 కోట్లు కావాలని జిల్లా యంత్రాంగం మరో నివేదిక అందజేసింది. ్ల సుమారు వెయ్యి కోట్లు నష్టం జరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించినా పరిహారంపై ఏ విధమైన హామీ ఇవ్వలేదు.
‘నీలం’పైనా చర్యలేనట
2012 అక్టోబర్లో సంభవించిన నీలం తుపానుకు సంబంధించి జిల్లాకు ఇంతవరకూ ఇన్పు ట్ సబ్సిడీ రాలేదు. వారం రోజుల్లో చెల్లించేం దుకు చర్యలు తీసుకుంటామన్నరే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వలేదు. రబీకి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని కోరినా రాయితీపై తప్ప ఉచితంగా ప్రస్తావించలేదు. రుణాల మాఫీపై ప్రస్తావిస్తే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారే తప్ప ప్రభుత్వ వాటాగా కొంత మేరైనా ఆదుకుంటామని భరోసా ఇవ్వలేదు. ఒప్పంగి లో రైతాంగం బాగా నష్టపోయిందని రుణాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆత్మహత్యలే శరణ్యమన్నపుడు కూడా రుణమాఫీ ప్రస్తావించలేదు. రీషెడ్యూల్ చేస్తామన్నారు. దీనివల్ల మరింత రుణభారం పెరుగుతుంది.
విద్యార్థులకూ మొండి చేయి
ఇటీవల వచ్చిన తుపాను వల్ల జిల్లావ్యాప్తంగా పంటలు దెబ్బతినడంతో ఫీజులు చెల్లించలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ఫీజు మినహాయింపు విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై గతంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పిన ఈసారి ఈ విషయాన్నే ఆయన ప్రస్తావించలేదు.
ప్రతిపక్ష నేతల పర్యటనలతో...
ముఖ్యమంత్రి పర్యటన వెనుక ప్రతిపక్ష నేతల పర్యటనే కారణమనే విమర్శలు వస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన పూర్తైది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం జిల్లాలో పర్యటించేందుకు రావడంతో సీఎంకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజల సానుభూతి ఎక్కడ పొందుతారో అన్న భయంతో ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటనకు వచ్చారని విమర్శలు వస్తున్నాయి. ఏ విధమైన స్పష్టమైన హామీలు ఇవ్వని సీఎం పర్యటన వల్ల ఉపయోగమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.