breaking news
cloth merchants
-
నేడు వస్త్ర వ్యాపారుల బంద్
► వస్త్రాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మూతపడనున్న 10 వేల దుకాణాలు ► నిలిచిపోనున్న రూ.100 కోట్ల మేర లావాదేవీలు వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ) : కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై గూడ్స్, సర్వీస్ టాక్స్(జీఎస్టీ)కు వ్యతిరేకంగా గురువారం వస్త్ర వ్యాపారులు బంద్ నిర్వహించనున్నారు. వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా జీఎస్టీ సంఘర్షణ సమితి ఆధ్వర్యాన దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన వస్త్ర దుకాణాలను మూసివేసి బంద్ పాటించాలని నిర్ణయించారు. దానికి ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ ఫెడరేషన్ కూడా మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సుమారు పది వేల దుకాణాలు మూతపడనున్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలో టెక్స్టైల్, రెడీమేడ్ దుకాణాలు మొత్తం ఐదు వేల వరకు ఉంటాయని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే సుమారు వెయ్యి దుకాణాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో మరో ఐదు వేల దుకాణాలు ఉన్నట్లు అంచనా. ఒకేసారి రెండు జిల్లాల్లో వస్త్ర దుకాణాలు మూసివేయడం వల్ల సుమారు రూ.100 కోట్ల వరకు లావాదేవీలు నిలిచిపోతాయని వ్యాపార సంఘ నాయకులు తెలిపారు. కేవలం రెండు మూడు శాతం లాభాలతోనే వస్త్రాలు విక్రయిస్తామని, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినా లాభ శాతం తక్కువగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. జీఎస్టీ వల్ల 50 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉందని, వ్యాపారులతోపాటు కొనుగోలుదారులు కూడా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నేడు వస్త్ర వ్యాపారుల ప్రదర్శన వస్త్రాలపై జీఎస్టీని నిరసిస్తూ గురువారం వ్యాపారులు విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. వన్‌టౌన్ పంజా సెంటర్లోని కృష్ణవేణి హోల్‌సేల్ క్లాత్ మార్కెట్ నుంచి వ్యాపారులు ప్రదర్శనగా బయలుదేరి వస్త్రలతకు చేరుకుంటారు. అక్కడ నుంచి నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీని కలిసి వినతిపత్రాలను అందజేస్తారు. ఏ మేరకు ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్ నేతలు ఏర్పాట్లు చేశారు. -
ఆస్తులు వెల్లడిస్తే పన్నులో మినహాయింపు
హిందూపురం అర్బన్ : అప్రకటిత ఆస్తులు, నల్లధనం వెల్లడితో ఆస్తిపన్నులో మినహాయింపులు ఉంటాయని హిందూపురం ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ సంజీవయ్య అన్నారు. స్థానిక ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో హోల్‌సేల్, రిటైల్ క్లాత్ మర్చెంట్స్‌కు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌కం ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి వ్యాపారులకు ఆదాయ వెల్లడి పథకం 2016 గురించి వివరించారు. 2015–16 సంవత్సరంలో ఇన్‌కం ట్యాక్స్ రిటన్స్‌లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచిన ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి దాఖలు చేస్తే పన్నులో 45 శాతం మినహాయింపు ఉంటుందన్నారు. కర్నూలు డిప్యూటీ కమిషనర్ వద్ద ఆస్తుల డిక్లరేషన్ ఇస్తే 45 శాతం పన్నును మూడు విడతలుగా చెల్లించడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. చెల్లించని వారు అధికారులు దాడుల్లో దొరికితే 100 శాతం పన్నుతో పాటు 300 శాతం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్ సంఘం నాయకులు రాము, అశ్వర్థనారాయణ, షాహనావాజ్ పాల్గొన్నారు.