breaking news
chine snatchers
-
వామ్మో.. గొలుసు దొంగలు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో గొలుసు దొంగలు హడలెత్తిస్తున్నారు. తాజాగా బీవీనగర్, చంద్రమౌళినగర్లో ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు సరుడులను తెంపుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. భక్తవత్సలనగర్ పోస్టాఫీసు వీధిలో పి.వాణి, వెంకటరమేష్‌బాబు దంపతులు నివాసం ఉంటున్నారు. ఈనెల 3వ తేదీ రాత్రి వాణి తన ఇంటిముందు నిలబడి పక్కింటివారితో మాట్లాడుతోంది. ఈక్రమంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని 9 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న బాధితురాలు కుప్పకూలిపోయింది. కొద్దిసేపటికి తేరుకుని దొంగా.. దొంగా అని అరిచేలోపు దుండగులు బైక్ వేగం పెంచి పరారయ్యారు. దీంతో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి వెళుతుండగా.. చంద్రమౌళినగర్ 10వ వీధిలో పి.నాగమణి, వెంకటేశ్వర్లు దంపతులు నివాసం ఉంటున్నారు. ఈనెల 3వ తేదీ రాత్రి నాగమణి, పక్కవీధికి చెందిన ప్రసన్నలు మోర్ మార్కెట్ సమీపంలోని వినాయక విగ్రహం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు చేసి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరారు. ఈక్రమంలో ఇద్దరు గుర్తుతెలియని దుండుగులు బైక్‌పై వారిని వెంబడించారు. నాగమణి ఇంటివద్దకు వచ్చేసరికి దుండగులు ఆమెకు ఎదురుగా వచ్చి మెడలోని ఐదు సవర్ల బంగారు సరుడును తెంచుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ ఆగ్రహం రెండురోజుల వ్యవధిలో వేదాయపాళెం పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగుచోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. సుమారు రూ.8 లక్షలు విలువచేసే 32 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు తెంపుకెళ్లారు. వరుస ఘటనపై జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తీవ్రంగా మండిపడ్డారు. తీరు మార్చుకుని గస్తీని ముమ్మరం చేసి గొలుసు దొంగలను పట్టుకోవాలని, లేనిపక్షంలో వేటు తప్పదని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని, వాహన తనిఖీలు పెంచాలని బుధవారం ఆదేశించారు. -
మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
చాదర్‌ఘాట్ (హైదరాబాద్ సిటీ) : హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉస్మానియా లా కాలేజ్ వద్ద గత నెల 17న చైన్‌స్నాచర్ దాడిలో సునీత ( 40 ) అనే మహిళ తీవ్రంగా గాయపడి మరణించిన ఉదంతం మరువకముందే అలాంటి సంఘటనే మలక్‌పేటలో చోటు చేసుకుంది. మలక్‌పేట ఫ్లైఓవర్‌పై మంగళవారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. మలక్‌పేటకు చెందిన భార్యాభర్తలు నాంపల్లిలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు దుండగులు వారిని బైక్ పై వెంబడించారు. మహిళ మెడలోని నాలుగు తులాల గొలుసును బలంగా లాక్కుని ఉడాయించారు. ఈ ఘటనలో వర్థనమ్మ అనే మహిళ బైక్‌పై నుంచి కిందపడిపోయింది. ఆమె తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అమెను యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చాదర్‌ఘాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.