ఒకటి కాదు.. రెండు కాదు.. 42 నాగుపాములు
పెద్దపల్లి: ఎవ్వరికైనా ఒక్క పాము కనిపిస్తేనే జడుసుకుంటాం.. అలాంటిది ఒకటికాదు రెండు కాదు ఓ ఇంట్లో 42 నాగుపాములు సేదతీరాయి. పెద్దపల్లి జిల్లా యైటింక్లైన్ కాలనీలో ఓసీపీ -3లో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న మల్లేశం ఇంటి ఆవరణలో పాముపిల్లలు బయటపడ్డాయి.
ఇంట్లో రోజుకోపాము కనిపించడంతో భయాందోళన చెందిన మల్లేశం కుటుంబసభ్యులు పాములు పట్టే సతీష్ కు సమాచారం ఇవ్వడంతో అతను ఒక్కోకటి చొప్పున 42 పాములను పట్టి వకీల్‌పల్లి సమీపంలోని చెట్లపొదల్లో వదిలేశాడు. నాగుపాము మల్లేశం ఇంటి ఆవరణలో సేదతీరి ఇన్ని పిల్లలకు జన్మనిచ్చినట్లు భావిస్తున్నారు. ఇటీవల సింగరేణి ఓసీపీల్లో ఓబీ వెలికితీత పనులు చేపట్టడంతో అక్కడ ఉండే పాములు జనవాసాల్లోకి వస్తున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.