breaking news
chetha
-
ఊళ్లలోకి వస్తున్న గజరాజులు, చిరుతలు... ఎక్కడంటే ?
సాక్షి, తిరుపతి: శేషాచలం అడవుల్లో చిరుతపులులు.. కౌండిన్య అడవుల్లో ఏనుగుల సంతతి పెరిగింది. మరోవైపు వలస వచ్చే ఏనుగుల గుంపులు అధికమయ్యాయి. దారితెలియక కొన్ని, ఆహారం కోసం మరికొన్ని జనారణ్యంలోకి వచ్చి ఉచ్చులు, కరెంటు తీగలకు బలవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో శేషాచలం, కౌండిన్య అడవులు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ఈ అడవుల్లో చిరుతపులులు, ఏనుగులతోపాటు వివిధ రకాల వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. వాతావరణం అనుకూలించటం, ఆహారం సమృద్ధిగా దొరుకుతుండటంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అడవుల్లో నుంచి చిత్తూరు జిల్లాలోని అడవుల్లోకి వస్తున్నాయి. దీంతో చిరుతపులుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రెండేళ్ల కిందట 20 నుంచి 30 లోపున్న చిరుతపులులు ఇప్పుడు 50కి చేరినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. శేషాచలంలో జింక, దుప్పి, కణుజు, కొండగొర్రెల సంతతి భాగా పెరిగింది. వీటికోసం చిరుతపులులు నల్లమల నుంచి శేషాచలం బాట పట్టాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. చిరుతల సంచారం ఆహార అన్వేషణలో భాగంగా శేషాచలం వచ్చిన కొన్ని చిరుతపులులు దారితెలియక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల తిరుపతి పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముఖ్యంగా ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి మంగళం ప్రాంతాల్లో అనేకసార్లు చిరుతపులులు కనిపించాయి. వారం కిందట ఎర్రావారిపాలెం మండలం కోటకాడపల్లిలో స్థానికులు వేసిన ఉచ్చులో చిక్కి ఒక చిరుతపులి మృతిచెందింది. ఏడాది కిందట ఎర్రావారిపాలెంలోకి ఓ చిరుతపులి వచ్చివెళ్లింది. వలస ఏనుగులతో బెంబేలు జిల్లాలోని పడమటి ప్రాంతంలో విస్తరించి ఉన్న కౌండిన్య అభయారణ్యంలో ఇప్పటికే ఏనుగుల సంతతి అనూహ్యంగా పెరిగింది. గతంలో 30 నుంచి 40 మధ్యలో ఉన్న ఏనుగుల సంఖ్య ప్రస్తుతం 60కి చేరింది. వీటితోపాటు తమిళనాడులోని క్రిష్ణగిరి, కర్ణాటక ప్రాంతంలోని 26 ఏనుగులతో కూడిన గుంపు మైసూరు అటవీ ప్రాంతాల నుంచి కావేరిపట్నం మీదుగా వాటర్ ఫాల్స్ ఉన్న ప్రాంతంలో సేదతీరి, అక్కడినుంచి గుడుపల్లి, పలమనేరు ప్రాంతాల్లో జనావాసాల్లోకి వస్తున్నాయి. విడివిడిగా వచ్చిన ఏనుగులు ఒక్కటయ్యాయి. వీటిలో ఒక ఏనుగు గున్న ఏనుగుకు జన్మనిచ్చింది. గున్న ఏనుగు నడచి తిరిగే వరకు ఈ ఏనుగుల గుంపు తిరిగి వెళ్లదని అటవీ అధికారులు చెబుతున్నారు. తరిమినా .... ఏనుగుల గుంపు జనావాసాల్లోకి వచ్చి భయాందోళనలకు గురిచేస్తుండటంతో ఇటీవల ఆ గుంపును పక్క రాష్ట్రం సరిహద్దులోని మొర్దన అడవుల్లోకి తరిమారు. కానీ , ఆ గుంపు గున్న ఏనుగు కోసం మళ్లీ కౌండిన్య అటవీ ప్రాంతంలోకి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వలస వచ్చిన 26 ఏనుగుల గుంపు వల్లే సరిహద్దు ప్రాంతంలో అలజడి నెలకొందన్నారు. కాగా కౌండిన్య అభయారణ్యంలో గతంలో 6 మగ ఏనుగులు ఉండేవని, విద్యుత్ షాక్‌కుగురై వాటిలో 4 ఏనుగులు మృతి చెందాయని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. దారితెలియక జనారణ్యంలోకి – మదన్‌మోహన్‌రెడ్డి, ఎఫ్ఆర్వో, కుప్పం తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతంలోని ఏనుగుల గుంపు కౌండిన్య అభయారణ్యంలోకి వలస వచ్చింది. వాటికి దారి తెలియక జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. వీటిని గతంలో మొర్దన ఫారెస్ట్‌లోకి తరిమేశాం. అయితే అవి గున్న ఏనుగు కోసం తిరిగి కౌండిన్యలోకి చొరబడ్డాయి. కౌండిన్య అభయారణ్యంలోనే ఉండే ఏనుగుల వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. చిరుతపులుల సంతతి రెట్టింపైంది – సుబ్బరాయుడు, ఎఫ్ఆర్వో, తిరుపతి శేషాచలం అభయారణ్యంలో చిరుతపులల సంతతి రెట్టింపు అయింది. అడవిలో వాటికి అవసరమైన ఆహారం, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉండటమే సంతతి పెరుగుదలకు కారణం. శేషాచలంలో ఆహారం లభ్యం అవుతుండటంతో నల్లమల నుంచి కూడా కొన్ని చిరుతపులులు వచ్చినట్లు ఆనవాళ్లున్నాయి. ఆ పులులే జనారణ్యంలోకి వస్తున్నాయి. -
74 ఏళ్ల తర్వాత భారత్‌కి వస్తున్న చిరుత
భోపాల్:వేగానికి మారు పేరైన చిరుత పులులు త్వరలో ఇండియా అడవుల్లోకి రానున్నాయి. 74 ఏళ్ల క్రితమే మన దేశంలో అంతరించిపోయాయి చిరుత పులులు. అయితే ఇప్పుడు ఆఫ్రికా నుంచి చిరుత పులులను రప్పించి మన అడవుల్లో వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవవైవిధ్యాన్ని కాపాడే యత్నంలో భాగంగా ప్రాజెక్ట్ చీతాని చేపట్టింది. పది చిరుతలు దక్షిణ ఆఫ్రికా నుంచి మొత్తం పది చిరుతలను ఇండియాకు తీసుకురానున్నారు. ఇందులో ఐదు మగవి, ఐదు ఆడవి తేవాలని నిర్ణయించారు. వీటి కోసం మధ్యప్రదేశ్‌లోని చంబల్ లోయలో ఉన్న కునో నేషనల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే అక్టోబరు లేదా నవంబరులో దక్షిణాఫ్రికా నుంచి ఈ చిరుతలు ఇక్కడికి చేరుకోనున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇండియా అడవుల్లో చిరుతలను ప్రవేశ పెట్టేందుకు వైల్డ్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ముమ్మరం చేయగా ... ప్రభుత్వం అంగీకరించి రూ. 14 కోట్ల నిధులు కేటాయించింది. గతంలో చిరుతలు ఎక్కువగా నివసించిన మధ్యప్రదేశ్‌లోనే వాటికి ఆవాసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లను పరిశీలించిన సౌతాఫ్రికా అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. చివరగా జీవవైవిధ్యానికి నెలవైన భారత్‌లో పెద్ద పులులతో పాటు చిరుతలు పెద్ద ఎత్తున ఉండేవి. అయితే స్వాతంత్రానికి పూర్వం రాజులు, బ్రిటీషర్లు వేట పేరుతో వందల కొద్ది చిరుతలను సంహరించారు. దీంతో క్రమంగా చిరుతల సంఖ్య తగ్గిపోయింది. భారత్‌లో చిట్టచివరి చిరుతని 1947లో చత్తీస్‌గడ్‌లో చూసినట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఐదేళ్లపాటు దేశంలో ఎక్కడా చిరుత జాడలు కనిపించలేదు. దీంతో దేశంలో చిరుతలు అంతరించి పోయాంటూ ప్రభుత్వం 1952లో ప్రకటించింది. చదవండి: పద నాన్నా... దేశం చూద్దాం -
చిన్నంపల్లిలో చిరుత కలకలం
అనంతపురం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చిన్నంపల్లిలో చిరుత పులి కలకలం సృష్టించింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లుకు చెందిన పొలంలో చిరుత పడుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా చిరుత పులి గాయపడి ఉండటం కాని లేదా గర్భం దాల్చి ఉండవచ్చునని, అందువల్లే అక్కడి నుంచి కదలడం లేదని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. వలల ద్వారా చిరుతను పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా మండల పరిధిలో చిరుత దాడి చేసి మేకలను, గొర్రెలను తిన్న సంఘటనలు చోటుచేసుకున్నాయి.