కోల్‌కతా, చెన్నైయిన్ మ్యాచ్ డ్రా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో పటిష్ట జట్లుగా పేరు తెచ్చుకున్న అట్లెటికో డి కోల్‌కతా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్లు తమ స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాయి. ఫలితంగా మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఇరు జట్ల నుంచి నమోదైన గోల్స్ పెనాల్టీ కిక్ ద్వారానే రావడం విశేషం. మ్యాచ్ ఆద్యంతం కోల్‌కతా ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ చెన్నైయిన్ ఆటగాళ్లు మాత్రం పట్టు వీడకుండా పోరాడారు.
పరాజయం ఖాయమనుకున్న దశలో చెన్నైయిన్ స్టార్ స్ట్రయికర్ ఎలనో బ్లూమర్ (90+3 నిమిషంలో) పెనాల్టీ కిక్‌తో స్కోరును సమయం చేశాడు. అంతకుముందు కోల్‌కతా తరఫున 35వ నిమిషంలో లూయిస్ గ్రేసియా కూడా పెనాల్టీ కిక్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రస్తుతం 12 పాయింట్లతో కోల్‌కతా అగ్రస్థానంలో ఉండగా చెన్నైయిన్ 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.