breaking news
channel 4 news
-
బయటపెట్టిన బ్రిటీష్ ఛానల్-అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు
బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల సానుభూతిపరుడైన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్(24)ను గత రాత్రి ఐటి(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మస్రూర్ కు నేరుగా ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో సంబంధంలేదని పోలీసులు తెలిపారు. అతనిని సొంతంగా తీవ్రవాద భావాలు ఉన్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మస్రూర్ కుటుంబం బెంగాల్‌లోని బీమాన్నగర్లో ఉంటుంది. అతని తండ్రి హోమియోపతి వైద్యుడు. బహుళజాతి కంపెనీలో పని చేస్తున్న మస్రూర్ బెంగాల్లోనే చదువుకున్నాడు. వారం రోజుల క్రితం వరకు మన్సూర్ తల్లి అతనితోనే బెంగళూరులో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వాడుతున్న సామాజిక మాధ్యమం ట్వీటర్లో దాని ఖాతాను బెంగళూరుకు చెందిన వ్యక్తే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. బ్రిటన్‌కు చెందిన చానల్ '4 న్యూస్' ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిహాదీలకు అనుకూలంగా 'షామీ విట్నెస్' పేరుతో మెహది అనే వ్యక్తి ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు బ్రిటిష్ చానల్ వెల్లడించింది. అయితే అతని జీవితం ప్రమాదంలో పడే అవకాశమున్నందున పూర్తి పేరును వెల్లడించడం లేదని పేర్కొంది. బెంగళూరులోని ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నట్లు తెలిపింది. షామీ విట్నెస్ పేరుతో ఐఎస్‌కు అనుకూలంగా అతను తన మొబైల్ ద్వారా ఇచ్చే ట్వీట్లను ప్రతి నెలా 20 లక్షల మంది చూస్తున్నారు. దీనికి 17,700 మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. వీరిలో మూడు వంతుల మంది విదేశీయులే. దీంతో ఐఎస్ ఖాతాల్లోకెల్లా ఇదే అత్యంత ప్రచారం జరుగుతున్న ఖాతాగా గుర్తింపు పొందింది. ఐఎస్‌లో చేరే వారి కోసం సమాచారం అందించడం, బందీల తలల నరికివేత వీడియోలు వంటివి ఈ ఖాతాలో ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కిన వెంటనే ఆ ఖాతా స్తంభించిపోయింది. కుటుంబం ఆర్థికంగా తనపైనే ఆధారపడటంతో ఖాతాదారుడు ఇంకా ఉగ్రవాద సంస్థలో చేరలేదని ఆ చానల్ తెలిపింది. ** -
'షమీ విట్నెస్' పేరుతో ట్వీట్స్...!
బెంగళూరు : ఐఎస్ఐఎస్ ట్విట్టర్ అకౌంట్ వెనుక బెంగళూరుకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ హస్తం ఉన్నట్లు బ్రిటన్ ఛానల్ 4 న్యూస్‌లో ప్రత్యేక కథనం వెలువడింది. 'షమీ విట్నెస్' పేరుతో ట్వీట్స్, తీవ్రవాద సంస్థలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు పేర్కొంది. 'షమీ విట్నెస్' పేరిట ఆతను నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను 17,700 మంది ఫాలో అవుతున్నట్లు ఆ ఛానల్ వెల్లడించింది. అలాగే జిహాదీలు, ఉగ్రవాద మద్దతుదారులు, నియామకాలు జరిపే వారికి ఈ ఖాతా ఒక వారధిగా మారిందని ఛానల్ 4 పేర్కొంది. అయితే ఈ కథనంపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.