breaking news
Chandrareddy
-
ముగ్గురి ఆత్మహత్య
∙అమలాపురంలో తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి ∙కాణిపాకంలో యువకుడు ∙పలమనేరు మండలంలో వివాహిత ∙ఉరి వేసుకుని మృతి వేర్వేరు కారణాలతో జిల్లా వాసులు ముగ్గురు ఉరి వేసుకుని బలవన్మరణం చెందారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చదువుతున్న తిరుపతికి చెందిన వైద్య విద్యార్థి, ఐరాలలో ఓ యువకుడు, పలమనేరు మండలంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అక్కడి విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అమలాపురం రూరల్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న తిరుపతికి చెందిన బండారం వివేక్ (23) కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని తోటి విద్యార్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గటానికి వివేక్ మందులు వాడుతున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు. క్రమశిక్షణతో ఉండే వివేక్ చదువులో చురుగ్గానే ఉంటాడని, మితభాషి అని స్నేహితులు చెప్పారు. వివేక్ బుధవారం కళాశాలకు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం కళాశాల నుంచి హాస్టల్‌కు వచ్చిన రూమ్మేట్స్ సాయికృష్ణ, శ్రీకాంత్ తలుపు గడియ వేసి ఉండటంతో ఎంత పిలిచినా స్పందించకపోవటంతో తలుపులు పగులగొట్టారు. వివేక్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. వివేక్‌ను కిందికి దింపి కిమ్స్ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, తాలూకా ఎస్సై ఎం.గజేంద్రకుమార్ వివేక్ మృతదేహాన్ని, హాస్టల్ గదిని పరిశీలించారు. ఈనెల 21 నుంచి నాలుగో సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉండడంతో ఎక్కువగా చదువుతున్నాడని స్నేహితులు చెబుతున్నారు. వివేక్ తండ్రి భాస్కరరెడ్డి తిరుపతిలోని ఎస్బీఐలో అధికారిగా పనిచేస్తున్నారు. డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, వివేక్ మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. వివేక్ ఆత్మహత్యకు ముందు తన వ్యక్తిగత ట్యాబ్‌లో ఉరి వేసుకోవడానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు ఆధారాలు కనిపించాయన్నారు. కిమ్స్ వైస్ చైర్మన్ మోహనరాజు వివేక్ మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. లాడ్జిలో ఉరి వేసుకుని యువకుడి మృతి కాణిపాకం: స్థానికంగా ఒక లాడ్జిలో యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ యతిరాజులు కథనం మేరకు.. తిరుపతిలోని రైల్వే కాలనీకి చెందిన చంద్రారెడ్డి (29) మంగళవారం రాత్రి ఇక్కడ లాడ్జిలో రూము తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు రూము తలుపులు తెరవకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానించారు. కిటికీలోంచి రూములోకి చూడగా ఉరి వేసుకుని ఉన్న యువకుడు కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడు ఐరాల మండలం ఎం.జంగాలపల్లెకు చెందినవాడని, ప్రస్తుతం తిరుపతిలో నివాసం ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. ఏ కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నాడో దర్యాప్తులో తేలాల్సి ఉంది. పలమనేరు మండలంలో వివాహిత.. గంగవరం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు మండలం తొప్పనపల్లెలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు..గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, ఆయన భార్య పద్మ(35) తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి వంటచేసింది. కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, 108కు సమాచారం చేరవేశారు. అయితే మృతికి కారణాలేమిటో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పెనుకొండ వద్ద కారు బోల్తా - ముగ్గురి దుర్మరణం
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దొడ్డికుంట గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు తాలూకా గొల్లపల్లికి చెందిన కుటుంబం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కొండాపురం గ్రామానికి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు పక్కనున్న బ్రిడ్జిని ఢీకొని బోల్తాపడింది. కారులో ప్రయాణిస్తున్న చంద్రారెడ్డి, హనుమంతరెడ్డి, రాజమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పెనుకొండ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్సనిమిత్తం 108లో తరలించారు.