breaking news
Chandra Rajeswara rao
-
తరమెళ్లిపోయింది
గాంధీజీ హత్య జరిగినప్పుడు దేశమంతా కుప్పకూలి ఏడుస్తోంది. కాని చాలా నగరాల్లో పట్టణాల్లో కొన్ని గుంపులు లడ్డూలు పంచుకుని పండగ చేసుకున్నాయి. అలాంటి పట్నాల్లో విజయవాడ ఒకటి. అప్పుడో యువ హీరో పాతికమందినేసుకుని కర్రసాము చేస్తూ లడ్డూల్నీ మనుషుల్నీ చచ్చేట్టు కొట్టి కకావికలై పరుగులు పెట్టేట్టు చేశాడనీ పేరు చండ్ర రాజేశ్వరరావనీ చిన్నప్పుడు విన్నప్పుడు ఎవరీ రాబిన్‌హుడ్ బతుకులో ఎప్పుడేనా ఎక్కడేనా చూడగలమా అనిపించేది. తర్వాత సభల్లో ప్రదర్శనల్లో ఈ ఆరున్నర అడుగుల బుల్లెట్టూ కమ్ రాకెట్టుని దూరంగా ఆరాధనతో చూశాం. 1970 నుంచి మూడు దశాబ్దాలు ఆయన చంకలో బిడ్డల్లా తిరిగాం. ఆయన అచ్చు రైతులా విరగబడి అమాయకంగా నవ్వడం, తీక్షణమైన చూపుల్తో ఆగ్రహించడం, పార్టీకి కష్టమొచ్చినపుడు గ్రేట్వాల్లా చేతులు చాచి అడ్డం పడటం అన్నిటికీ సాక్షులం. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా జీవిత కథ వచ్చింది. ఆయన స్వగ్రామం మంగళాపురానికి చెందిన డాక్టర్ పూర్ణచంద్రరావు రాశారు. ఆ గ్రామానికి చండ్ర రాజేశ్వరరావు పూర్వీకులు రావడం దగ్గర నుండి విలువైన వివరాలున్నాయి. విద్యార్థి గాయకుడిగా, పార్టీ నిర్మాతగా, రాష్ట్రం నుండి జాతీయ అంతర్జాతీయ నేతగా ఆయన ఎదిగిన తీరును చారిత్రక నేపథ్యంతో చూపడం రచయిత చేసిన గొప్ప కృషి. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన సంవత్సరంలో పుట్టిన ఆయన రష్యాలో అక్టోబర్ విప్లవంతో స్ఫూర్తిపొంది, భారత స్వాతంత్ర పోరాటంలో దూకి, తర్వాత పార్టీని స్థాపించి విస్తరించిన తీరును వరుసగా చెప్తుందీ పుస్తకం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో గెరిల్లా యుద్ధ శిక్షణలో ఆయన పాత్ర వివరంగా ఉంది. మాస్కో వెళ్లి స్టాలిన్‌ని కలిసి వచ్చాక ఆయన చావుకి ఎదురెళ్లి అడవుల్లో గెరిల్లాలను కలిసే దృశ్యాలు ఇన్స్పైరింగ్గా ఉంటాయి. రెండవ భాగమంతా ఆయన పర్యటనలూ ప్రసంగాలూ ప్రకటనలతో నింపడం వల్ల వ్యక్తిగా ఆయనకు సంబంధించి హ్యూమన్ యాంగిల్ మరింతగా తెలిసే అవకాశం తగ్గింది. చరిత్రలో పుట్టి పెరిగి చరిత్ర సృష్టించిన నిండు మనిషి గాథ ఇది. చివరికి పుస్తకాలూ రెండు మూడు జతల పంచెలూ లాల్చీలు తప్ప పైసా మిగుల్చుకోకుండా చనిపోయిన చండ్ర గురించి చదువుతుంటే ఆదర్శం, త్యాగాల తరం అంతరించిందా అనిపిస్తుంది. కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు- రచన: కిలారు పూర్ణ చంద్రరావు వెల: రూ.350 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు - మోహన్ గమనిక: మీ రచనలు, సమీక్ష కొరకు రెండు కాపీలు, ఈ పేజీపై అభిప్రాయాలు అందవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. -
ఆడంబరమెరుగని ఆదర్శ నేత
నేడు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి కామ్రేడ్ సీఆర్ పార్టీ అత్యున్నత స్థానంలో ఉన్నా తానొక గొప్ప సిద్ధాంతవేత్తననే బడాయిని ప్రదర్శించక సాదాసీదాగా ఉండేవారు. తన రైతు పుట్టుకకు, రైతు సహజాతానికి గర్వపడేవారు. ఆ సహజ ఆలోచన తరచు వాస్తవికతకు దగ్గరగా ఉండేది. అది కొన్ని సందర్భాల్లో సిద్ధాంతీకరణ సామర్థ్యం లేని కామ్రేడ్స్ పట్ల కొంత పక్షపాతానికి కారణమయ్యేది. నేడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు శత జయంతి. ఆయన జీవితాన్ని, భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన ఆందించిన సేవలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమిది. నాకంటే సన్నిహితంగా ఆయనను ఎరిగిన వారు ఎందరో ఉన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో, ప్రత్యేకించి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన నిర్వహించిన పాత్రను నాకంటే వారే బాగా వివరించగలరు. దశాబ్దాల తరబడి సన్నిహితంగా ఆయనను గమనించే భాగ్యం నాకు కలిగింది. ఆ అనుభవాల ఆధారంగా ఒక మనిషిగా, దేశభక్తునిగా, సీనియర్ సహచరునిగా, పార్టీ నాయకునిగా సీఆర్ బహుముఖ వ్యక్తిత్వం గురించి నేను చెబుతాను. కామ్రేడ్ సీఆర్ 25 ఏళ్లపాటు సీపీఐ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ అధినేతగా అంత సుదీర్ఘ కాలం పనిచేయడం అటు పార్టీపైనా, ఆయనపైనా కూడా సానుకూల, ప్రతికూల ప్రభావాలను నెరపే ఉంటుంది. అయితే ఆ అంశాన్ని రాగద్వేషాలకు అతీతమైన వస్తుగత దృక్పథంతో అంచనా వేయాల్సింది కాలమే. నన్ను 1982లో కేంద్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యునిగా తీసుకున్న తదుపరి నేను ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరాను. అటుపిమ్మట దాదాపు పదేళ్ల పాటూ ఆయనతో సన్నిహితంగా కలసి పనిచేసిన కాలంలో నా మనఃఫలకంపై ఆయన గురించి ముద్రితమైన కొన్ని అభిప్రాయాలను మాత్రమే చెబుతాను. ఆ కాలమంతటా మేం ఇద్దరం అజయ్ భవన్లో ఒకే అంతస్తులో ఉండేవాళ్లం. పని సమయాల్లోను, ఖాళీ సమయాల్లోనూ, అధికారిక హోదాలోను, వ్యక్తిగతంగానూ కూడా నేనాయనను అతి తరచుగా కలుస్తుండేవాడిని. సీఆర్‌ను చూసిన వెంటనే స్ఫురించేది ఆయన భారీ విగ్రహం. పొడవుగా, విశాలమైన భుజాలతో, దృఢంగా నిండుగా కనిపించేవారు. దృఢమైన దవడలు, పెద్దమొహంతో ఆయన ఎదుటివారి మొహంలోకి సూటిగా చూసేవారు. ఖంగున మోగే గొంతుతో బిగ్గరగా మాట్లాడేవారు. రూపం మొరటు-మనసు మెత్తన ఆయన భారీ కాయానికి మించి విశాలమైనది ఆయన హృదయం. మొరటు రూపం మాటున సుతిమెత్తని, దయార్ద్ర హృదయం దాగి ఉండేది. ఎవరికి బాధకలిగినా ఆయనకు నొప్పి. తన చుట్టుపక్కలున్న కామ్రేడ్లలో ఎవరు జబ్బుపడి ఆసుపత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా సీఆర్ అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. ఆదుర్దాగా యోగక్షేమాలు విచారించి, డబ్బు అవసరమేమో వాకబు చేసేవారు. నా భార్య కోమాలో ఉండగా ఆమెను చూడటం కోసమే పనిగట్టుకుని ఆయన నాగపూర్ వచ్చారు. డబ్బు పట్టుకుని వచ్చి మరీ డబ్బు అవసరమేమోనని విచారించడం నేనెన్నటికీ మరువలేను. ఒక వేళ ఆయన వల్ల నాకు నిజంగానో, ఊహాజనితంగానో ఏమైనా బాధ కలిగినా గానీ ఆయన చూపిన దయా, సానుభూతులకు దాన్ని మరచిపోవాల్సిందే. నాయకుడినన్న అహంకారం ఇసుమంతైనా లేకుండా క్యాడర్లు, సభ్యులందరికీ ఆయన అందుబాటులోఉండేవారు. భౌతికంగానే కాదు, ఆత్మికంగానూ, కామ్రేడ్లీగానూ కూడా ఆయన అందరికీ సన్నిహితంగా మెలిగేవారు. పార్టీ కార్యాలయం గేటు వద్ద ఉన్న రెడ్గార్డ్స్తో, స్వీపర్ పనిచేసే కుర్రాళ్లతో, క్యాంటీన్ సిబ్బందితో కూచుని గంటల తరబడి ముచ్చట్లాడేవారు. నాయకత్వ సహచరులతో, ఇతర పార్టీలలోని పరిచయస్తులతో మాట్లాడినట్టే వారితో కూడా. ఆయన అందరినీ తన సహచర కార్యకర్తలుగానే గౌరవించేవారు, వారి గౌరవాన్ని చూరగొనేవారు. ఆయనకంటే నేను చాలా జూనియర్ని. మామధ్య తీవ్ర విభేదాలు చెలరేగి నేనాయన ఆగ్రహానికి గురైన సందర్భాలున్నాయి. అయితే ఆ మరుసటి రోజు ఉదయం నేనింకా నిద్రలేవకముందే ఆయన నా గదిలో ప్రత్యక్షమై వార్తలు, మంచీచెడ్డా మాట్లాడేవారు. నిన్నటి కోపతాపాలిక చెల్లు. ఇది మరో రోజు, అంతే. ఆయనకు ఎవరన్నా ఎలాంటి ద్వేష భావమూ ఉండేదే కాదు కాబట్టే అలా ఉండటం సాధ్యమైంది. మనిషి నడవడికలో, సామాజికంగా కలిసిమెలిసి ఉండటంలో కనిపించే చిన్న చిన్న విషయాలే మనిషిని విలక్షణంగా నిలుపుతాయి, ప్రత్యేకించి నాయకుని విషయంలో అది మరింత నిజం. కామ్రేడ్ సీఆర్ పార్టీ అత్యున్నత స్థానంలో ఉన్నా తానొక గొప్ప సిద్ధాంతవేత్తనంటూ బడాయిని ప్రదర్శించక సాదాసీదాగా ఉండేవారు. ఆయన తన రైతు పుట్టుకకు, రైతు సహజాతానికి గర్వపడేవారు. రైతు సహజమైన ఆయన ఆలోచన తరచు సరిగ్గానూ, వాస్తవికతకు దగ్గరగానూ ఉండేది. అయితే పలు సందర్భాల్లో అది... సిద్ధాంతీకరించే సామర్థ్యం కొరవడినవారి పట్ల కొంత పక్షపాతం చూపడానికి కూడా కారణమయ్యేది. అత్యున్నత స్థాయిలో అది తీవ్రమైన పొరపాట్లకు దారి తీయవచ్చు. అది కొనసాగితే తీవ్రమైన తప్పిదాలకు సైతం దారితీయవచ్చు. ఆయన నాయకత్వంలో పార్టీ చేసిన... అత్యవసర పరిస్థితికి మద్దతునివ్వడం వంటి తీవ్రమైన వ్యూహాత్మక, ఎత్తుగడల తప్పిదాలను ఎవరూ కప్పిపుచ్చలేరు. నరనరాన నిండిన లౌకికతత్వం కామ్రేడ్ సీఆర్‌లో కొట్టవచ్చినట్టుగా కనిపించే లక్షణం దృఢమైన లౌకికవాద దృక్పథం. మన రిపబ్లిక్ లౌకికవాద-ప్రజాస్వామిక పునాదులపైనా, రాజకీయ వ్యవస్థపైనా విశ్వాసం. అందువల్లనే ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు మన లౌకికవాద పునాదులకు తూట్లు పొడుస్తూ, మతోన్మాద విషాన్ని వ్యాపింపజేసే కార్యకలాపాలను సాగించడం పట్ల కటువుగా ఉండేవారు. మైనారిటీలందరి హక్కులపట్ల, సంక్షేమంపట్ల ఆయన అత్యంత పట్టింపును ప్రదర్శించేవారు. దూకుడుగా వస్తున్న మిలిటెంటు ఆధిక్యతావాదం పట్ల వారి భయాందోళనలను పంచుకునేవారు. ప్రజాస్వామ్యమంటే అధిక సంఖ్యాకుల అధికారం, ఆధిపత్యం కాదని నమ్మిన నిజమైన లౌకికవాద ప్రజాస్వామికవాది ఆయన. బాబ్రీ మసీదును కూలగొట్టి ‘అక్కడే మందిరం నిర్మిస్తాం’ అంటూ అద్వానీ తదితరులు మాట్లాడుతున్నప్పుడే ఆయన మోగుతున్న ప్రమాద ఘంటికను గుర్తించారు. లౌకికవాదులుగా చెప్పుకునే నేతలు చాలామంది సమయం మించిపోయే వరకు అది గ్రహించలేకపోయారు. ‘మసీదు’ కేవలం సంకేతం మాత్రమేననీ, దాన్ని ధ్వంసం చేయాలని పిలుపునివ్వడమంటే ఆ మైనారిటీ మతానికి వ్యతిరేకంగా పూర్తిస్థాయి దాడికి పిలుపునివ్వడమేననీ, మన లౌకికవాద పునాదుల శిథిలాలపై ‘హిందూ రాష్ట్రా’న్ని నిర్మించడమేననీ సీఆర్ గ్రహించారు. అయితే భారత ప్రజలకు, ప్రత్యేకించి హిందువులకు ఆ ప్రమాదాన్ని నివారించగల అంతర్నిహిత శక్తి ఉన్నదని ఆయనకు ప్రగాఢ విశ్వాసం. అందుకే మైనారిటీలకు, మసీదుకు మద్దతుగా సమీకృతం కావాలని పిలుపునిచ్చి, స్వయంగా ముందు నిలిచారు. మొట్ట్టమొదటగా అయోధ్యకు ఆ సందేశాన్ని తీసుకుపోయారు. మతతత్వ వ్యతిరేక పోరాట చరిత్రలో సీఆర్ కృషి నిలిచిపోతుంది. కమ్యూనిస్టు... దేశభక్తుడు కామ్రేడ్ సీఆర్ కమ్యూనిస్టు. కాబట్టే నిజమైన దేశభక్తుడు. జాతీయ ఐక్యత, సమగ్రతలను ఎత్తిపట్టారు. అది లేనిదే భారత ప్రజాస్వామ్యం, భవిష్యత్తు నిలవడానికి పునాదే లేకుండా పోతుందని భావించారు. కాశ్మీర్, పంజాబ్, అస్సాం, మణిపూర్లలో రేగుతున్న ఉద్రిక్తతలు జాతీయ ఐక్యత, సమగ్రతలకు ముప్పును కలిగిస్తాయని పసిగట్టారు. ఆ సమస్యలపై పైపై విశ్లేషణలతో సంతృప్తి చెందలేదు. పైకి కనిపించే లక్ష ణాలు పలు సందర్భాల్లో వ్యవస్థ లోపల లోతుగా వేళ్లూనుకున్న రోగాన్ని కప్పిపుచ్చుతుంటాయి. సీఆర్ ఆ మూల సమస్యలను లోలోతుల్లోకి వెళ్లి పరిశీలించారు. ఆయన సిక్కు చరిత్ర, మత గ్రంథాలను అధ్యయనం చేశారు. అస్సాం భౌగోళికత, బహుళ జాతుల మూలాల గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. అలాగే హిందూ పురాణాలు, తత్వశాస్త్రం వగైరా కూడా. సిక్కులలోని ఒక చిన్న విభాగం డిమాండయిన ఖలిస్థాన్ సిక్కులందరి మనోభావాల్లోకి ఎలా చొరబడిగలిగిందో తెలుసుకోవాలని తాపత్రయపడ్డారు. గంటల తరబడి ఆ విషయాలను పార్టీకి చెందినవారి కంటే ఎక్కువగా పార్టీకి చెందని పంజాబీ మేధావులతో, నేతలతో చర్చించేవారు. ఢిల్లీ సిక్కు వ్యతిరేక అల్లర్ల వల్ల వారికి కలిగిన తీవ్ర వేదనను ఆయన కంటే ఎక్కువగా అర్థం చేసుకున్నవారు లేరు. కాశ్మీర్, అస్సాం లేదా మణిపూర్ తిరుగుబాటు సమస్యలపైన ఆయనది అదే వైఖరి. ఆ ప్రాంతాలన్నిట్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. మూరుమూల ‘సున్నిత ప్రాంతాల’ సాధారణ ప్రజలను కలుసుకుని వారిని అర్థం చేసుకోవాలని తహతహలాడే వారు. డెబైయ్యేళ్లు పైబడినా, ఆస్త్మా వ్యాధితో బాధపడుతున్నా ఆయనలో ఆ ఓపిక మాత్రం కొరవడింది లేదు. ‘భవిష్యత్తులోకి ముందుకు’ రోజులు గడిచే కొద్దీ సీఆర్ కులం, మతం పేరిట పెరుగుతున్న వేర్పాటువాద విచ్ఛిన్నకర శక్తులపట్ల అసంతృప్తితో ఉండేవారు. భారత దేశ వైవిధ్యంలోని ఏకత్వాన్ని అర్థం చేసుకోడానికి అన్ని మతాలను, సంస్కృతులను అధ్యయనం చేయసాగారు. పార్సీ వంటి చిన్న మతం సైతం ఆయన దృష్టి నుంచి తప్పిపోయింది లేదు. మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని భారతదేశపు సుసంపన్నమైన సామాజిక, సాంస్కృతిక వారసత్వంతో సమ్మిళితం చేయాల్సిన అవసరం పట్ల ఆయన విశ్వాసం రోజురోజుకు బలపడింది. కాలం చెల్లిన ప్రతీఘాతుక అంశాలను తిరస్కరించి, ప్రగతిశీలమైన ప్రతి అంశాన్ని స్వీకరించాల్సిందేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఆయన తన జీవిత చరమాంకానికి చేరి ఆ రంగంలో మరింతగా కృషి చేయలేకపోవడం దురదృష్టకరం. సీపీఐ రెండుగా చీలిపోయిన సమయంలో కామ్రేడ్ సీఆర్ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. పలు వివాదాలతో చర్చలతో కూడిన ఆ అంశాన్ని చర్చించే సందర్భం ఇది కాదు. అయితే ైచె నా పార్టీతో సౌభ్రాతృత్వ సంబంధాలను నెలకొల్పుకోడానికి వెళ్లిన మొట్టమొదటి పార్టీ ప్రతినిధి బృందంలో సీఆర్‌తో పాటు నేను కూడా ఉన్నాను. ‘‘గతాన్ని మరచిపోదాం. భవిష్యత్తులోకి ముందుకు చూద్దాం. గతం ఇప్పుడు చరిత్ర లో భాగం’’ అని సీఆర్ చైనా కామ్రేడ్స్‌తో అనడం గుర్తుకు వస్తోంది. పార్టీ చీలికకు కూడా అదే వర్తిస్తుంది. గతంపై చరిత్ర తీర్పు చెబుతుంది. సూత్రబద్ధమైన కమ్యూనిస్టు ఐక్యతతో ‘‘భవిష్యత్తులోకి ముందుకు చూడడడమే’’ ముందు భారతదేశ విముక్తికి, సోషలిజానికి ముందు షరతు అవుతుంది. చీలిక సమయంలో తిరిగి ఐక్యతను సాధించగలిగినంత సమర్థవంతమైన రీతిలో నాయకత్వం కృషి చేయలేకపోవడం విచారకరం. కామ్రేడ్ సీఆర్ ఆ కర్తవ్యాన్ని పరిపూర్తి చేసే బాధ్యతను వదిలి వెళ్లారు. కమ్యూనిస్టు నాయకులు అలా ఆశావహంగా భవిష్యత్తులోకి చూడాలి. (వ్యాసకర్త సీపీఐ అగ్రనేత) - ఎ.బి. బర్ధన్