breaking news
chalivendralu
-
నీళ్లిచ్చే దిక్కేది..?!
41.26, 43.00, 44.56 ఇవి కొలతలు కావు. జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సెగలు పుట్టిస్తున్నాడు. మధ్యాహ్నమైతే బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. రోడ్లపై ప్రయాణికులు, పాదచారులు, కూలీలు అల్లాడిపోతున్నారు. గొంతు తడుపుకుందామని చలివేంద్రాలకు వెళితే కొన్నిచోట్ల బోర్డులు ఉంటున్నాయే కానీ కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల కుండలు కనిపిస్తున్నా అందులో నీళ్లు ఉండటం లేదు. చిత్తూరు అర్బన్: వేసవిలో ప్రజల దాహం తీర్చడంలో జిల్లాలోని పలువురు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లా మొత్తం చలివేంద్రాలు పెట్టాలని కలెక్టర్ పీఎస్.ప్రద్యుమ్న ఆదేశించినా పాటించడంలో అలసత్వం చూపుతున్నారు. జిల్లా వ్యా ప్తంగా 1,372 పంచాయతీలు, ఆరు మున్సి పాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. రెండు కార్పొరేషన్లతో పాటు మూడు మున్సిపాలిటీలతో కలిపి దాదాపు 600 ప్రాంతాల్లో మాత్రమే చలివేంద్రాలు ఏర్పా టు చేశారు. వాస్తవానికి జిల్లాలో 5 వేల చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి చలివేంద్రం వద్ద చలువ పందిళ్లు వేసి, శుద్ధి నీటిని అందుబాటులో ఉంచాలి. కానీ కొందరు అధికారులు పుస్తకాల్లో వీటిని బా గా రాసుకుంటూ ప్రతినెలా రూ.లక్షల్లో బిల్లులు చేసుకుని వారి జేబుల్లో వేసుకుం టున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే ఒకటి, రెండుచోట్ల మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో నామమాత్రంగా రెండు రోజులు ట్యాంకు నీళ్లు అందుబాటులో ఉంచి చేతులు దులుపుకున్నారు. బిల్లులు రాలేదని చలివేంద్రాల ఏర్పాటుపై అనాసక్తి చూపడానికి అధికారులు బలమైన వాదన వినిపిస్తున్నారు. గతంలో వేసవి ఉపశమన కోసం ఖర్చుచేసిన నిధులే ఇంకా జమ కాలేదని ఇలాంటి సమయంలో చలివేంద్రాల ఏర్పాటుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. పైగా ఈసారి చలివేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేకంగా బడ్జె ట్ కేటాయించకపోవడంతో తామేమీ చేయలేమని ఖరాకండిగా చెబుతున్నారు. మున్సి పాలిటీల్లో మాత్రం కొందరు కమిషనర్లు సొంతంగా చొరవ తీసుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు తాగునీరు అందుబాటులో పెడుతున్నారు. దీంతో ఈ ఏడాది చలివేంద్రాల నిర్వహణ కంటితుడుపుగానే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రజలు దాహం తీర్చుకోవడానికి వాటర్ ప్యాకెట్లు, మరికొన్ని చోట్ల దాతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాల వైపు వెళుతున్నారు. ఆరోగ్య శాఖ అంతంతే వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ఉన్నతాధికారులు చాం బర్ల నుంచి కదలకుండా పోగ్రాం అధికారులను పిలిపించుకోవడం.. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి చేతులు దులుపుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల కు అందుతున్న సౌకర్యాలు, వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలను పట్టించుకున్న పాపానపోలేదు. చలివేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి బస్టాపుల్లో ప్రయాణికులకు పంపిణీ చేయాలి. జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించదు. కేవలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. మజ్జిగ కనిపించదు జిల్లాలో రెండేళ్ల క్రితం వరకు వేసవిలో చాలాచోట్ల చలివేంద్రాల వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. ఇందుకు కలెక్టర్ ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఇది సాధ్యమయ్యింది. రోజూ ప్రతి చలివేంద్రం వద్ద పది లీటర్ల పెరుగును ఉపయోగించి 150 మందికి మజ్జిగ అందేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఈసారి ఎండాకాలం ముగిసిపోతున్నా మజ్జిగ ఊసే కనిపించలేదు. మరోవైపు చాలా చలివేంద్రాల్లోని కుండల్లో నీళ్లు నింపడంలేదు. కొన్నిచోట్ల మధ్యాహ్నానికే అయిపోతున్నాయి. అయినా సరే పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. -
ఇదో ‘చల్లని’ మాయ
- గత ఏడాది సుమారు రూ.2 కోట్ల మజ్జిగ ఖర్చు - హెరిటేజీ మజ్జిగతో ‘మమ’ అనిపించారు - ఈ ఏడాది అంతకు తగ్గకుండా వ్యయం - ఆచరణలో కానరాని చలివేంద్రాలు - స్వచ్ఛంద సంస్థల కేంద్రాలూ అధికారిక రికార్డుల్లో... - ఉపాధి కూలీల మజ్జిగ సొమ్ములోనూ కక్కుర్తే...! ఏ రూపంలో నిధులు మంజూరైనా సరే ఏదో విధంగా స్వాహా చేయడానికి సిద్ధం...భారీ పథకంలోనే కాదు ... చలి వేంద్రాల చిల్లరను కూడా ఏరుకోడానికి కాచుక్కూర్చున్నారు అధికారపార్టీకి చెందిన చిల్లర నేతలు. గత ఏడాది మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సేవలో మునిగిన నేతలు ఈ సారి ఆ మజ్జిగ వాసన కూడా చూపించలేదు. దాహం కేకలు వేసే వారికి గుక్కెడు నీరు అందించే పథకంలో నిధులను పక్కదారి పట్టించి తమ జేబులు నింపుకున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : వేసవిలో జనం సేద తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రభుత్వం మొక్కుబడి తంతుగా మార్చేస్తోంది. గతేడాది వేసవిలో సొంత బ్రాండ్ హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీని ఆర్భాటంగా నిర్వహించింది. గత వేసవిలో జిల్లాలో మజ్జిగను మొక్కుబడిగా చేసి మంచినీళ్లు సరఫరా చేశారు. ఆ ప్రక్రియ మొత్తానికి సుమారు రూ.2 కోట్లు ఖర్చు చూపించారనే విమర్శలు వచ్చాయి. అసలు మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే చేసినట్టుగా కాగితాలపై చూపించి సొమ్ములు కాజేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ వేసవిలో కూడా ప్రతి చలివేంద్రంలో మజ్జిగ, చల్లటి నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మే ఒకటి నుంచి 31 తేదీ వరకు మజ్జిగ, కూలింగ్ వాటర్, జూన్ ఒకటి నుంచి మంచినీరు సరఫరా చేశామని అధికారులు చెబుతున్నారు. మే నెలలో మజ్జిగ అనేది తూతూమంత్రంగా సరఫరా చేశారంటున్నారు. అదనంగా పదివేల చలివేంద్రాలేవీ... రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయని ఇస్రో హెచ్చరికలతోపాటు జిల్లాను డేంజర్ జోన్‌గా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి ప్రజలను బయటకు వెళ్లవద్దని కూడా ఆయన సూచించారు. ఆ హెచ్చరికలతో జిల్లావాసులు నాలుగైదు రోజులు భయంతో వణికిపోయారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు నిర్వహిస్తున్న చలివేంద్రాలకు అదనంగా జిల్లాలో మరో పది వేల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆ సందర్భంలో సూచించారు. కానీ ఆయన ఆదేశాల మేరకు అదనంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు మాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించ లేదు. మండలానికి రూ.2 లక్షలు మంజూరు ప్రకటనతో హడావుడి... ఉన్న చలివేంద్రాలకే దిక్కుమొక్కు లేదు, అదనంగా ఎక్కడ ఏర్పాటుచేసేదంటూ మండల స్థాయిలో అధికారులు చేతులెత్తేశారు. చలివేంద్రాల నిర్వహణ కోసం మండలానికి రూ.2 లక్షలు వంతున బడ్జెట్ మంజూరవుతుందనే సమాచారంతో కొందరు ఏర్పాటు చేయగా, మరికొందరు ఏర్పాటు చేయకుండానే చేసినట్టు రికార్డు చేశారంటున్నారు. గ్రామ పంచాయతీల్లో విధిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలతో చేతిలో పైసా లేకున్నా స్వచ్ఛంద సంస్థలు, దాతల సాయంతో ఏర్పాటు చేశామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. పైసా ఇవ్వకున్నా ప్రభుత్వం చలివేంద్రాల ఏర్పాటును కూడా డాబుసరి కార్యక్రమంగా ప్రచారం చేసుకుంది. అధికార పార్టీ అయితే పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలతో చలివేంద్రాలకు రిబ్బన్ కటింగులతో చాలా ఆర్భాటమే చేయించారు. కానీ ప్రారంభించిన నాలుగైదు రోజులకే మొక్కుబడి తంతుగా మూసేశారు. మొదట్లో మండలానికి రెండు లక్షలు వంతున చలివేంద్రాల నిర్వహణకు మంజూరు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ ఊసే లేదంటున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో చలివేంద్రాలు మొక్కుబడిగానే కొనసాగాయి. అసలు స్వచ్ఛంద సంస్థలంటూ ముందుకు రావడంతోనే కాస్తోకూస్తో ప్రజలకు దాహం తీరింది. జిల్లా కేంద్రంలోనే కనికట్టు... వాస్తవానికి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చల్లని నీళ్లు, మే ఒకటి నుంచి 31 తేదీ వరకు మజ్జిగ. జూన్ ఒకటి నుంచి మంచినీరు జిల్లా అంతటా సరఫరా చేసినట్టు చెబుతున్నారు. ఇందుకోసం ఒక్క కాకినాడ నగరపాలక సంస్థకు రూ.22 లక్షలు బడ్జెట్ కేటాయించారు. కానీ ఈ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 16 చలి వేంద్రాల్లో రెండు, మూడు మినహాయిస్తే మరెక్కడా మే నెలలో మజ్జిగ సరఫరా చేసినట్టుగా కనిపించ లేదు. కేవలం మంచినీరు మాత్రమే సరఫరా చేశారంటున్నారు. నగరంలో రోజుకు 300 లీటర్ల పెరుగు కొనుగోలుచేసి మజ్జిగ చేసి 16 చలివేంద్రాలకు సరఫరా చేశామని చెబుతున్నారు. ఇందుకోసం రూ.20 లక్షలు ఖర్చయిందని లెక్క లేస్తున్నారు. ఈ విషయమై కార్పొరేషన్ వాటర్ వర్క్స్ ఏఈ సూర్యారావును ‘సాక్షి’ సంప్రదించగా కలెక్టర్ ఆదేశాల మేరకు రూ.22 లక్షలు కేటాయించిన మాట వాస్తవమేనని, ఇంకా నగదు మాత్రం చెల్లింపులు జరపలేదని చెబుతున్నారు. దాదాపు ఇదే పరిస్థితి మండలాల్లో కూడా కనిపిస్తోంది. మండలానికి రెండు లక్షలు మంజూరవుతాయనే ముందస్తు సమాచారంతో దాతల సాయంతో ఏర్పాటుచేసిన వాటిని కూడా తమ ఖాతాలో వేసేసుకొని రికార్డుల్లో లెక్కలు చూపించుకోవడం గమనార్హం. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు 1,56,448 పంపిణీ చేసినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఉపాధి కూలీల మజ్జిగ సొమ్మూ స్వాహా... ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు మజ్జిగ సరఫరా చేయాలని రోజుకు రూ.5 విడుదల చేసినట్టు డ్వామా అధికారులు చెబుతున్నారు. రోజుకు 2 లక్షల 70 వేల మంది కూలీలు జిల్లాలో పనిచేస్తున్నారు. కనీసంగా వారంలో ఒకటి, రెండు రోజులు కూడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. కొన్ని మండలాల్లో అయితే మజ్జిగ వాసనే లేదు. ఇటీవల కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ పర్యటనకు వెళ్లిన డీపీఓ కుమార్ ఉపాధి కూలీలను అడిగితే అసలు మజ్జిగే ఇవ్వడం లేదని చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ నుంచే మజ్జిగ ఇస్తున్నట్టుగా రికార్డుల్లో రాసేసుకున్నారు. కూలీకి వచ్చిన ఐదు రూపాయలు వంతున మేట్ల ఖాతాలకు వేసేశామని డ్వామా అధికారులు చెబుతున్నారు. రోజుకు పది లక్షల రూపాయలకు పైగానే పక్కతోవ పట్టినట్టు తెలుస్తోంది. అధికారిక లెక్కలివీ... జిల్లాలో 5,801 చలి వేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ప్రభుత్వశాఖల ఆధ్వర్యంలో 1,323 చలి వేంద్రాలు, స్థానిక సంస్థలు ద్వారా 1,497 చలి వేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కలిపి 2,981 కలిపితే మొత్తంగా 5,801 చలి వేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా చెబుతున్నారు. వీటిలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించినవి మాత్రమే పూర్తిస్థాయిలో మజ్జిగ, మంచినీరు చిత్త శుద్ధిగా సరఫరా చేశారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినవన్నీ మొక్కుబడిగా కొనసాగాయనే విమరశ ఉంది.