breaking news
the chairman of the
-
శాప్ చైర్మన్‌గా పీఆర్ మోహన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్‌గా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన పీఆర్ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శి శశాంక్ గోయల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోహన్ గతంలో ఎన్టీఆర్ హయాంలో శాప్, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. శాప్ సభ్యులుగా వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి (శ్రీకాకుళం), ఎస్.గీత (గుంటూరు), కేఎం షకీల్ షఫీ (అనంతపురం), దుద్యాల జయచంద్ర (వైఎస్సార్ జిల్లా), బండారు హనుమంతురావు (కృష్ణా), ఎం.రవీంద్రబాబు (నెల్లూరు)లను నియమించారు. -
రచ్చ.. రచ్చ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చ రచ్చగా సాగింది. పాలక పక్షం రాజ్యాంగానికి.. చట్టానికి లోబడి వ్యవహరించక అధికారదర్పం ప్రదర్శించగా... నియంత్రించాల్సిన జిల్లా కలెక్టర్ ఏకపక్ష చర్యలకు పాల్పడుతున్నారు.. జెడ్పీకి సుప్రీం అయిన ఛైర్మన్‌ను కూడా నియంత్రించే దిశగా వ్యవహరిస్తున్నారు.. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ విషయంలో మోసపు మాటలు చెబుతున్నారు అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పరిషత్ వైఎస్సార్ సమావేశం మందిరంలో ఛైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం సభ్యులు వ్యవహరిస్తున్న తీరు, వారికి అధికారులు వంత పాడుతున్న వైనంపై సమావేశంలో తీవ్రస్థాయిలో దుమారం రేగింది. మధ్యాహ్నం 12 గంటలకు ఛైర్మన్ గూడూరు రవి సమావేశాన్ని అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ తీవ్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో 2.30 గంటలకు మరోమారు వాయిదా వేశారు. ఆపై ప్రారంభమైన సభలో జిల్లా గ్రామీణాభివృద్ధిపై చర్చసాగింది. ఆర్‌డబ్ల్యుఎస్, ఎలక్ట్రిసిటీ మినహా ఇతర అధికారులు వెళ్లిపోవాలని ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్ ఉన్నందున అధికారులంతా వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు అలా వెళ్లవద్దని జెడ్పీ ఛైర్మన్ కోరుతున్నా వారు ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. అధికారంలో ఉన్నాం... ఏమైనా చేయగలం: ఎంపీ రమేష్ మేము అధికారంలో ఉన్నాం.. తల్చుకుంటే ఏమైనా చేయగలం.. ఇకపై సమావేశానికే రాలేరు.. చెప్పినట్లు వినండి అంటూ ఓదశలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ హుంకరించారు. ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అంజాద్బాష, రవీంద్రనాథరెడ్డితోపాటు జెడ్పీటీసీలు దీనిపై తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. ఇష్టసానుసారం మాట్లాడుతానంటే కుదురదని తే ల్చిచెప్పారు. తెలంగాణ ఓటరుగా నామినేషన్ అఫడవిట్లో ధ్రువీకరించిన సీఎం రమేష్ చట్టానికి అనుగుణంగా సభ్యుడైతే తనకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. సీఎం రమేష్ తనకు చిన్ననాటి స్నేహితుడని.. కలిసి చదువుకున్నామని.. అతనిపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని.. ఈ విషయాన్ని అధికారులు గుర్తించాలని రాచమల్లు కోరారు. జెడ్పీ సీఈఓ మాల్యాద్రి నారద పాత్రను విరమించుకోవాలని ధ్వజమెత్తారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జోక్యం చేసుకుని తెలంగాణలో ఓటు లేదు.. పోట్లదుర్తిలోనే ఓటు ఉందని ఆత్మసాక్షిగా ఎంపీ రమేష్ ప్రకటిస్తే సభలో ఉండడానికి అభ్యంతరం లేదని తెలిపారు. లేదంటే ఆయన బెదిరింపులకు ‘పుచ్చకాయ’ కూడ బెదరదు అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. మరోమారు నిర్వహించే సమావేశానికి అన్ని ఆధారాలు జెడ్పీకి అందజేస్తానని ఎంపీ రమేష్ ప్రకటించారు. ప్రజాప్రతినిధులు చట్టానికి లోబడి వ్యవహరించాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు హితవు పలికారు. సమావేశంలో విప్ మల్లికార్జునరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, సీఎం రమేష్ ఎమ్మెల్యేలు జయరాములు, కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయడు, జెడ్పీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఛైర్మన్ పట్ల చిన్నచూపు.. జిల్లా ప్రథమ పౌరుడు, కేబినేట్ ర్యాంకు హోదా ఉన్న జెడ్పీ ఛైర్మన్ గూడూరు రవి పట్ల సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కేవీ రమణ చిన్నచూపు ప్రదర్శించారు. తొలిత రాజ్యసభ సభ్యుడు రమేష్ అఫడవిట్ ధ్రువీకరణలో హైదరాబాద్ వాసిగా పొందుపర్చారు. జెడ్పీ ఛైర్మన్ అనుమతి ఏ మాత్రం లేకుండానే జెడ్పీ మీటింగ్‌కు అర్హత కల్గిన మెంబర్ అంటూ ఆర్డర్ ఇచ్చామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధుల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేవీ రమణ, సీఈఓ మాల్యాద్రి ఎమ్మెల్యేల వైపు వేళ్లు చూపిస్తూ ఆవేశంగా మాట్లాడారు. ఈ పరిణామాన్ని ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. అధికారులు అన్న స్పృహను మర్చిపోవద్దని హెచ్చరించారు. ఆదే అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రఘురామిరెడ్డి వ్యక్తం చేస్తూ, ఛైర్మన్‌ను నియంత్రించడం సరైంది కాదని తెలిపారు. చట్టాన్ని వివరించేంతవరకే మీరు.. నిర్ణయం తీసుకోవాల్సింది జెడ్పీ ఛైర్మన్ అని వివరించారు. ఈదశలో శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య కల్పించుకుని లెజిస్ట్రేచర్కు సెక్రెటరీ మాత్రమే అన్న విషయాన్ని గుర్తెరగాలని కలెక్టర్‌కు సూచించారు. జెడ్పీకి ఛైర్మన్ సుప్రీం అనే విషయాన్ని మరవద్దన్నారు. దీంతో కలెక్టర్, సీఈఓలు వెనక్కి తగ్గారు. సాయంత్రం సమావేశం ప్రారంభం అయ్యాక ఇప్పటికే ఆలస్యం అయింది.. వీడియో కాన్ఫరెన్స్ ఉంది.. అధికారులు వెళ్లిపోవాలంటూ కలెక్టర్ ఆదేశించడం మరో వివాదానికి దారి తీసింది. అధికారులంతా కూర్చోవాలని, సమావేశాన్ని కొనసాగించాలని ఛైర్మన్ రవి కోరుతుండగా అందుకు ప్రతిగా కలెక్టర్ అధికారులు వెళ్లిపోవాలంటూ మైకులో ఆదేశించారు.