breaking news
Chai p Discussion
-
BJP: కాఫీ విత్ యూత్
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్ యూత్’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ మోర్చా నేతలు కొత్త ఓటర్లను అడుగుతున్నారు. ముంబైలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో వీటిని దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. యువ ఓటర్ల నాడి తెలుసుకుని, వారిని బీజేపీ వైపు మళ్లించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి... ముంబైలో ఇటీవల పలుచోట్ల దాదాపు 300 మంది యువ ఓటర్లతో బీజేపీ యువ మోర్చా నేతలు ‘కాఫీ పే చర్చ’ నిర్వహించారు. పదేళ్ల్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని వారికి వివరించారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఈ చర్చలను విస్తరిస్తున్నారు. ప్రతి భేటీలో కనీసం 150 నుంచి 200 మంది యువ ఓటర్లుండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘కాఫీ పే చర్చ’లో బూత్ స్థాయి కార్యకర్త మొదలు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుని దాకా పాల్గొంటారు. ప్రతి కార్యకర్త తమ పరిధిలోని కనీసం 10 మంది కొత్త, యువ ఓటర్లను ఈ చర్చకు తీసుకొస్తున్నారు. రెస్టారెంట్లు, పార్కులు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వినూత్నంగా దీన్ని నిర్వహిస్తున్నారు. మోదీ పేర్కొన్న ‘విజన్ 2047’ లక్ష్యంతో చర్చ సాగుతోంది. ‘రాబోయే ఐదేళ్లలో దేశంలో యువత పాత్ర ఎలా ఉండాలి? ప్రభుత్వం ఏం చేస్తే యువతకు దగ్గరవుతుంది? అన్ని రంగాల్లోనూ ప్రపంచంలో భారత్ అగ్ర స్థానానికి చేరాలంటే ఏం చేయాలి? అవినీతి నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, పేదరికం లేని ఇళ్లు’ తదితర అంశాలపై రెండు నుంచి మూడు గంటల పాటు కార్యక్రమం జరుగుతోంది. యువ ఓటర్ల సలహాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. -
కదిలిన కమల దండు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో హైదరాబాద్ నగరంలో బీజేపీ పక్కా వ్యూహంతో ముందస్తు ప్రచారానికి తెర లేపింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ పార్టీ క్యాడర్లో కొత్త ఊపు తెచ్చేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ‘చాయ్ పే చర్చా’ కార్యక్రమంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిన నాయకులు.. ఇకపై ప్రచారంలో మరింత వేగం పెంచేందుకు సిద్ధమయ్యారు. నగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఈ నెల 11న జరిగే ‘తెలంగాణ ఆవిర్భావ సభ’కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతుండటంతో ఈ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డి శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగా నగరంలోని అన్ని మున్సిపల్ డివిజన్లలో ఆ పార్టీ నాయకులు ఆదివారం పాదయాత్రలు నిర్వహించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్రను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. ‘మాట ఇచ్చాం.. మద్దతిచ్చాం.. తెలంగాణ తెచ్చాం..’ అన్న నినాదంతో బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అంబర్‌పేట డివిజన్లో ఆదివారం భారీ ఎత్తున పాదయాత్రలు నిర్వహించారు. ‘తెలంగాణ ఆవిర్భావ సభ’కు జన సమీకరణ చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పనిలో పనిగా ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ మద్దతు వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటుతో పాటు సీమాంధ్రకు కూడా న్యాయం చేయాలని రాజ్యసభలో ఒత్తిడి తేవడం వల్లే కొన్ని సవరణలు చేశారన్నారు. బీజేపీ వల్లే మేం తెలంగాణ ఇవ్వలేకపోయామని కాంగ్రెస్ చెప్పే ఎత్తులను రాజ్‌నాథ్‌సింగ్ చాకచక్యంగా తిప్పికొట్టారని తెలిపారు. భాగ్యనగరంలోని సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బంది కలగని విధంగా బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నారు. కృతజ్ఞతగానే... ప్రత్యేక తెలంగాణకు తాము అనుకూలమని బీజేపీ నేత రాజ్‌నాథ్ సింగ్ చేసిన వాగ్దానం మేరకు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ బిల్లును సమర్థించారని, దీనికి కృతజ్ఞతగా హైదరాబాద్‌లో సభను ఏర్పాటు చేస్తున్నామని వెంకటరెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రతిపక్ష పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన హైదరాబాద్ వస్తున్నారని.. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీ నాయకులు, కార్మిక, వ్యాపార వర్గాలన్నీ ఈ సభకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అసెంబ్లీ, మున్సిపల్ డివిజన్ల వారీగా ఇప్పటికే సమావేశాలు నిర్వహించాం. డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ పరిధిలో పాదయాత్రలు చేసి కరపత్రాలు పంచాం. రాజ్‌నాథ్ సింగ్ సభకు వచ్చేందుకు అనేకమంది ఉత్సుకత చూపుతున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఏం మార్గదర్శకత్వం చేస్తోరోనని నగరవాసులు ఆతృతతో ఉన్నారు. బీజేపీ సహకారంతోనే తెలంగాణ వచ్చిందన్న వాస్తవం ఇప్పటికే ప్రజ ల్లోకి వెళ్లింది. తోక పార్టీలు ఏం చెప్పినా... ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితిలో లేరు. తెలంగాణ కృతజ్ఞతతో పాటు స్థానిక సంస్థల సమరానికి కూడా ఇక్కడి నుంచే రాజ్‌నాథ్‌సింగ్ మార్గనిర్దేశం చేస్తారు’ అని ఆయన వివరించారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో సభా వేదిక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని, అలాగే ప్రధాన కూడళ్లలో, సభా ప్రాంగణంలో రాజ్‌నాథ్‌సింగ్, మోడీ, సుష్మాస్వరాజ్‌ల ప్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని వెంకటరెడ్డి తెలిపారు. ఈ సభకు సుమారు 70-80వేల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు.