అజ్మీర్ దర్గాకు ఒబామా కానుక
ఏప్రిల్ 19 నుంచి 803వ ఉర్సు ఉత్సవాలు మొదలుకానున్నవేళ అజ్మీర్‌లోని ప్రఖ్యాత హజ్రత్ ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తీకి ఓ అరుదైన భక్తిపూర్వక కానుక అందింది. ఆ బహుమానాన్ని పంపింది మరెవరోకాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా! ఆయన ఆదేశాలతో ప్రత్యేకంగా రూపొందించిన ఎరుపు రంగు చాదర్‌ను అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ శుక్రవారం దర్గా అధిపతులకు అందజేశారు.
చాదర్ అందించడంతోపాటు ప్రపంచమంతా శాంతి సామరస్యాలతో వెల్లివిరియాలనే ఒబామా సందేశాన్ని వర్మ తెలియజేశారని ఖ్వాజా సాహెబ్ నషీన్, చిస్తీ ఫౌండేషన్ డైరెక్టర్ సయీద్ సల్మాన్ మీడియాకు చెప్పారు. ఒక దక్షిణాసియాయేతర దేశం అజ్మీర్ దర్గాకు చాదర్ పంపడం ఇదే తొలిసారని, సూఫీ తత్వాన్ని పాశ్చాత్యదేశాలు కూడా గౌరవించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇటీవలే అమెరికా నుంచి తిరిగొచ్చిన చిస్తీ మాట్లాడుతూ అజ్మీర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అమెరికా సహాయం కోరామని, ఆ మేరకు వాషింగ్టన్‌లోని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్తో చర్చలు జరిపామన్నారు.