breaking news
central power stations
-
‘ప్రైవేటు’ కొనుగోళ్లకు ఈఆర్సీ నో!
♦ విద్యుత్ అవసరాలపై డిస్కంలు సమర్పించిన లెక్కలపై అసంతృప్తి ♦ 2 వేల మెగావాట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు యత్నం ♦ మార్చిలోగా కొత్త ప్లాంట్ల నుంచి 1,800 మెగావాట్ల ఉత్పత్తి ♦ ఈ నేపథ్యంలో ‘ప్రైవేటు’ కొనుగోళ్లను ప్రశ్నించిన ఈఆర్సీ! ♦ విద్యుత్ అవసరాలపై సమగ్ర వివరాలతో రావాలని సూచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థల నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు విద్యుత్ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నుంచి అనుమతి లభించలేదు. విద్యుత్ సంస్థలు సమర్పించిన లెక్కలపై ఈఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది రాష్ట్రంలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు చేసేందుకు నెల రోజులుగా విద్యుత్ సంస్థలు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి. దీనిపై గత గురువారమే ఈఆర్సీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. దానిని పరిశీలించిన ఈఆర్సీ... ఆ విద్యుత్ కొనుగోళ్లు న్యాయోచితమైనవేనని రుజువు చేసే వివరాలతో మళ్లీ రావాలని సూచించింది. దీంతో 2016 మే 27 నుంచి 2017 మే 25 వరకు ఏడాది కాలానికి 2,000 మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్ల కోసం పిలిచిన టెండర్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంచనాలపై అనుమానం! ప్రస్తుతం జెన్కో, కేంద్ర విద్యుత్ కేంద్రాలు(సీజీఎస్), తాత్కాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 6,500 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉంది. కానీ డిమాండ్ తక్కువగా ఉండడంతో తరచూ జెన్కో ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. వచ్చే మే నెలతో 2,000 మెగావాట్ల ప్రైవేటు కొనుగోళ్ల ఒప్పందాలు ముగిసిపోనున్నాయి. ఆలోపే సింగరేణి, భూపాలపల్లిలోని కొత్త విద్యుత్ ప్లాంట్ల నుంచి 1,800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. అయితే వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ అమలు కోసం 10,500 మెగావాట్ల విద్యుత్ అవసరమని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. ‘పగటి పూట విద్యుత్’కు 6,500 మెగావాట్లు కావాలని గుడ్డిగా లెక్కలు వేశాయి. వచ్చే మార్చిలోగా ప్రైవేటు సౌర విద్యుత్ కేంద్రాల నుంచి 2,500 మెగావాట్లు అందుబాటులోకి వస్తాయని, అదనంగా 2,000 మెగావాట్లు కొనుగోలు చేస్తే 10,500 మెగావాట్ల డిమాండ్‌ను తీర్చుతామని ఈఆర్సీకి చెప్పాయి. కానీ ఈ అంచనాల్లో శాస్త్రీయత లోపించిందని ఈఆర్సీ అభిప్రాయపడింది. 9 గంటల సరఫరా కోసం.. 24 గంటల కొనుగోళ్లు! వ్యవసాయానికి పగలే 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే కేవలం ‘పీక్‌లోడ్ (విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో వినియోగం)’ మాత్రమే పెరుగుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా ఉండే పగటి వేళలోనే 6,500 మెగావాట్లు సరఫరా చేస్తారు. దీంతో సాధారణంగానే డిమాండ్ తక్కువగా ఉండే రాత్రివేళ (బేస్‌లోడ్) విద్యుత్ వినియోగం 4,000 మెగావాట్లకు పడిపోతుంది. కానీ జెన్కో, సీజీఎస్, తాత్కాలిక కొనుగోలు ఒప్పందాల నుంచి 8,000 మెగావాట్ల లభ్యత ఉంటుంది. అంటే రాత్రివేళ 4,000 మెగావాట్లను వదులుకోక తప్పదు. ‘ప్రైవేటు’ విద్యుత్‌ను వదులుకునే అవకాశం లేకపోవడంతో రాత్రిళ్లు జెన్కో ప్లాంట్లను నిలిపేసి ఉత్పత్తిని తగ్గించే అవకాశాలున్నాయి. గత ఏడాదికాలంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో.. ‘ప్రైవేటు’ కొనుగోళ్లను కొనసాగిస్తూ జెన్కో ప్లాంట్లను తరచూ ‘బ్యాక్‌డౌన్’ చేయడంతో సంస్థ ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) 74 శాతానికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రైవేటు కొనుగోళ్లకు అనుమతిస్తే జెన్కో మరింతగా నష్టపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 2 వేల మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లకు ఈఆర్సీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
విద్యుత్‌లో స్వయంసమృద్ధి!
♦ నేడు గ్రిడ్‌కు 600 మెగావాట్ల ♦ ‘కేటీపీపీ’ ప్లాంట్ అనుసంధానం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో తెలంగాణ ‘స్వయంసమృద్ధి’ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. వరంగల్జిల్లా భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ జెన్కో నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) రెండో దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం విద్యుత్ ప్రసార వ్యవస్థ(గ్రిడ్)తో అనుసంధానం(సింక్రనైజేషన్) చేయనున్నారు. వచ్చే నెలలో ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తి తేదీ(సీఓడీ)ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 2,282.50 మె.వా. ఉండగా, మరో 4,600 మె.వా.కు పైగా విద్యుత్‌ను కేంద్ర విద్యుత్ కేంద్రాలు, ఇతర ప్లాంట్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కేటీపీపీ-2 నిర్మాణం పూర్తయితే రాష్ట్ర సామర్థ్యం 2,882.5 మెగావాట్లకు పెరగనుంది. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1,200(2ఁ600) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సైతం చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చిలోగా విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ చర్యలు తీసుకుంటోంది. సింగరేణి ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్ర థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 4,082.5 మెగావాట్లకు పెరగనుంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 7 వేల మెగావాట్లకు చేరువైంది. ఈ పరిస్థితుల్లో కేటీపీపీ-2, సింగరేణి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైతే కొంత వరకు ఉపశమనం లభించనుంది. కేటీపీపీ-2 వ్యయం తడిసి మోపెడు.. కేటీపీపీ-2 విద్యుత్ కేంద్రం వ్యయం మెగావాట్‌కు రూ.7.22 కోట్లకు పెరిగింది. రూ. 2,968.64 కోట్ల అంచనాలతో 2008 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, పనుల్లో జాప్యంవల్ల 2013 నవంబర్‌లో అంచనాలను రూ. 3,652.51 కోట్లకు పెంచారు. మళ్లీ గత జూన్‌లో రూ.4,334.11 కోట్లకు వ్యయాన్ని పెంచడంతో ప్రాజెక్టు వ్యయం తడిసిమోపెడైంది.