నెలరోజులుగా ఇందిరమ్మలబ్ధిదారులకు శూన్యహస్తం
ఫొటోలోని మహిళ పేరు రాజమ్మ. రాజుపాళెం మండలం టంగుటూరు ఎస్సీ కాలనీ వాసి. ఈమెకు ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరైంది. ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చే డబ్బు సరిపోకపోవడంతోపాటు బిల్లులు సక్రమంగా రాకపోవడంతో ఇంటి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీనికి తోడు మరో అడ్డంకి ఏర్పడింది. సిమెంటు ఇవ్వం.. డబ్బులిస్తాం.. మీరే తెచ్చుకోండని చెబుతున్నారు. అదనంగా డబ్బులు చెల్లించి ఎక్కడ సిమెంటు తెచ్చుకోవాలని రాజమ్మ ఆవేదన వ్యక్తంచేస్తోంది. మొత్తానికి ఆమె ఇంటి నిర్మాణం ఆగిపోయింది.
సాక్షి, కడప/రాజుపాలెం, న్యూస్‌లైన్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సరిపోక అల్లాడుతున్నారు. కూలీలు, ఇసుక, ఇనుప కడ్డీలు, ఇటుకల ధరలు అమాంతం పెరగడంతో కొన్నిచోట్ల ఇందిరమ్మ గృహాలు ఆగిపోయాయి.
దీనికితోడు ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు’ ఇందిరమ్మ గృహాలకు ఇచ్చే సిమెంటును లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. బస్తాకు రూ.184 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో బస్తా ధర రూ.284 పలుకుతోంది. బస్తాకు అదనంగా రూ.100 చెల్లించాల్సివస్తోంది. ఒక్కో లబ్ధిదారునికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 60బస్తాల సిమెంటు ఇస్తుంది. అంటే రూ.6వేలు వీరికి అదనపు భారంగా పడుతోంది. ముందే అంతంతమాత్రంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సిమెంటు కొరతతో మరింత నత్తనడకన సాగుతున్నాయి.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతోందిలా.. :
జిల్లావ్యాప్తంగా అన్ని దశల్లో ప్రభుత్వం ఇప్పటివరకు 2,47,007 ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 7,800 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమేకాలేదు. 46వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిపై ప్రధానంగా సిమెంటు ప్రభావం చూపుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఓసీలకు 80వేలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో 20వేలు ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఓసీలకు రూ.70వేలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.25వేలు ఇస్తారు. అయితే ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఇంటి నిర్మాణానికి సరిపోవడంలేదు. ఇనుము, ఇసుక, కూలీల ధరలతోపాటు మిగతావి అమాంతం పెరిగాయి. ఓ ఇంటి నిర్మాణానికి అదనంగా 70వేల నుంచి రూ. లక్ష ఖర్చవుతోంది. దీనికితోడు రూ.6వేలు అదనంగా సిమెంట్ భారం పడుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిమెంటు సరఫరా చేయాలని కోరాం :
జిల్లాకు 11,400 మెట్రిక్ టన్నుల సిమెంటును సరఫరా చేయాలని ఇప్పటికే సిమెంటు ఫ్యాక్టరీలను కోరాం. వారు సిమెంటును సరఫరా చేయడం లేదు. ధరల్లో వ్యత్యాసం ఉండటమే ప్రధాన కారణం. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సిమెంటు బస్తాల బదులు నగదును చెల్లిస్తున్నాం. త్వరలో సిమెంటు అందించేలా చర్యలు తీసుకుంటాం.
-సాయినాథ్, హౌసింగ్ పీడీ.