breaking news
Cell Kon
-
తెలుగు రాష్ట్రాల్లో సెల్కాన్ హవా
♦ రూ.4 వేల లోపు విభాగంలో టాప్ ♦ 41.5 శాతం వాటా దీనిదే: జేఎఫ్‌కే ♦ జూలైలో మార్కెట్లోకి టీవీలు! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల మార్కెట్లో సుస్థిర వాటా దిశగా సెల్కాన్ అడుగులేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 వేల లోపు మొబైల్ఫోన్ల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. మార్కెట్ పరిశోధన సంస్థ జీఎఫ్కే గణాంకాల ప్రకారం జనవరి-మార్చి కాలంలో సెల్కాన్ 41.5 శాతం వాటాతో టాప్-1 స్థానం సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4 వేలలోపు విభాగంలో తొలి త్రైమాసికంలో 7 లక్షలకుపైగా స్మార్ట్ఫోన్లు, బేసిక్ ఫోన్లను విక్రయించామని సంస్థ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నాణ్యమైన ఫోన్లను ఆధునిక ఫీచర్లతో అందుబాటు ధరలో తీసుకురావడం కస్టమర్ల ఆదరణకు కారణమని చెప్పారు. ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో.. కంపెనీ కొద్ది రోజుల్లో ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. మెటాలిక్ బాడీతో రానున్న ఈ మోడల్ ధర రూ.7 వేల శ్రేణిలో ఉండనుంది. ఇక 5 అంగుళాల స్క్రీన్‌తో తయారైన డైమండ్ 4జీ ప్లస్ మోడల్‌ను తాజాగా 2.5డీ కర్వ్డ్ ఎడ్జ్ గ్లాస్ డిజైన్‌తో ప్రవేశపెట్టారు. ధర రూ.6,333 ఉంది. కస్టమర్లు వినూత్న అనుభూతికి లోనయ్యేలా సెల్కాన్ సొంతంగా అభివృద్ధి చేసిన ఫ్లో సాఫ్ట్‌వేర్‌ను దీనికి జోడించారు. ఇంగ్లీషు వాక్యాలు 22 భాషల్లోకి ఇట్టే తర్జుమా చేసుకోవచ్చు. 4.5 అంగుళాల స్క్రీన్‌తో రూ.5 వేలకే మరో వేరియంట్‌ను తీసుకొస్తోంది. వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో 4జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది. విద్యార్థులకు రూ.1,000 డిస్కౌంట్.. సెల్కాన్ 8 అంగుళాల 4జీ హెచ్డీ ట్యాబ్లెట్ పీసీని విద్యార్థులకు రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.7,333లకు విక్రయిస్తోంది. కొద్ది రోజుల్లో 7 అంగుళాల ట్యాబ్లెట్పైన రూ.500 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించనుంది. సెల్కాన్ టీవీలు జూలైలో అందుబాటులోకి వస్తాయని గురు వెల్లడించారు. 24 నుంచి 50 అంగుళాల శ్రేణిలో వీటిని తీసుకొస్తున్నట్టు చెప్పారు. మేడ్చల్ వద్ద ఉన్న ప్లాంటులో కంపెనీ వీటిని రూపొందిస్తోంది. డీవీడీలు, సెట్ టాప్ బాక్స్‌ల తయారీని రానున్న రోజుల్లో చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్, తిరుపతి ప్లాంట్లను తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు. -
హైదరాబాద్ లో మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్..
♦ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు ♦ సెల్కాన్తోసహా నాలుగు కంపెనీలు ♦ 2,000 మందికి ఉపాధి అవకాశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో తెలంగాణ మరో మైలు రాయిని అధిగమించనుంది. సెల్కాన్, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్లు సంయుక్తంగా మొబైల్స్ పరిశోధన అభివృద్ధి హబ్‌ను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. కంపెనీలు కలసి ఇలా హబ్ నెలకొల్పనుండడం భారత్‌లో ఇదే తొలిసారి. ఇక తెలంగాణలో ఇప్పటికే సెల్కాన్ హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ వద్ద మొబైల్స్ అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసి కార్యకలాపాలు సాగిస్తోంది. అలాగే సెల్కాన్, మైక్రోమ్యాక్స్లు రంగారెడ్డి జిల్లాలో మొబైల్ ఫోన్ల ప్లాంట్లను నెలకొల్పుతున్నాయి. తాజాగా భాగ్యనగరిలో ఆర్అండ్డీ హబ్‌కు శ్రీకారం చుట్టాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఇప్పటికే పలు దఫాలుగా మొబైల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు సాగించారు. చర్చలు విజయవంతం అయ్యాయి కూడా. కంపెనీలకు కావాల్సిన అనుమతులను సత్వరం ఇచ్చేందుకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే 2016లోనే హబ్ సాకారం కానుందని సమాచారం. 2,000 మందికి ఉపాధి.. ఆర్అండ్డీ హబ్‌కు 5 ఎకరాలు కావాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరాయి. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గచ్చిబౌలి సమీపంలో ఇది వచ్చే అవకాశం ఉంది. ఇక హబ్‌లో కంపెనీలు వేటికవే తమ సొంత ఆర్అండ్డీ కేంద్రాలను స్థాపిస్తాయి. ఒక్కో కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టేది త్వరలోనే వెల్లడి కానుంది. ఆర్అండ్డీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల లావా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి బెంగళూరులో 400 మందితో కూడిన ఆర్అండ్డీ సెంటర్ ఉంది. వచ్చే మూడేళ్లలో పరిశోధన, అభివృద్ధిపై రూ.200 కోట్లు ఖర్చు చేస్తామని లావా వైస్ ప్రెసిడెంట్ సందీప్ డోంగ్రె తెలిపారు. ఇక చైనాలోని షెంజెన్‌లో ఉన్న ఆర్అండ్డీ సెంటర్‌ను భారత్‌కు తరలించాలని సెల్కాన్ భావిస్తోంది. దీనికితోడు డిజైన్ హౌజ్‌ను నెలకొల్పాలన్నది కంపెనీ ఆలోచన. పీసీబీ, చిప్సెట్ తదితర విభాగాల తయారీదారులను మొబైళ్ల పరిశోధన, అభివృద్ధిలో భాగస్వాములను చేయడంతోపాటు వారితో కలిసి డిజైన్ హౌజ్‌లో మోడళ్లకు రూపకల్పన చేస్తారు. మొత్తంగా హబ్ రాకతో 2,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని సెల్కాన్ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఖర్చూ తగ్గుతుంది.. కంపెనీలకు ఒక్కో మోడల్ అభివృద్ధికి ఎంత కాదన్నా రూ.30 లక్షల దాకా వ్యయం అవుతోంది. సొంత ఆర్అండ్డీ, డిజైన్ హౌజ్ ఉంటే ఈ ఖర్చులను పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చు. ఇతర ఖర్చులైన మధ్యవర్తుల ఫీజులు, రవాణా, ప్యాకింగ్ వంటివి ఆదా అవుతాయి. ప్రధానంగా త్వరితగతిన మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు కంపెనీలకు వీలవుతుంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారత మొబైల్ ఫోన్ల రంగంలో పోటీలో నిలవాలంటే ఇది తప్పదు. ఇక భారత్ లో సెల్కాన్, మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్లు తమ మార్కెట్ వాటాను పెంచుకుంటూ పోతున్నాయి. అలాగే ఎగుమతులతో వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియా బాట పట్టి భారత్‌లో అసెంబ్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్అండ్డీ కేంద్రాల విస్తరణతో కంపెనీలు మరింత వేగంగా వృద్ధిని సాధిస్తాయి.