breaking news
cease
-
నోటు పాట్లు
– నేటి నుంచి రూ.500, వెయ్యి నోట్లు చిత్తుకాగితాలే – ఈ నెల 11 వరకూ ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లు, పెట్రోలు బంకుల్లో చెల్లుబాటు – నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు మూసివేత – డిసెంబర్ ఆఖరు వరకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్లు మార్చుకునే అవకాశం – మంగళవారం రాత్రి నుంచే నోట్లు తీసుకునేందుకు నిరాకరించిన వ్యాపారులు – నేటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడనున్న సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సాక్షిప్రతినిధి, అనంతపురం : ఏంటి? రూ. 500, రూ.వెయ్యి నోట్లు నేటి నుంచి చెల్లవని చెబుతున్నారనుకుంటున్నారా? అవునండి! నిజం! ఇది సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటన! రూ.500, వెయ్యినోట్లను మంగళవారం అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ప్రకటన టీవీల్లో వస్తుండగనే...వ్యాపారులు వినియోగదారుల నుంచి రూ.500, వెయ్యినోట్లు తీసుకునేందుకు నిరాకరించారు. జేబులో వందనోట్లు లేకపోవడం, ఉన్ననోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరించడంతో 'అనంత' ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే శుక్రవారం వరకూ ఉన్ననోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్పు చేసుకునేందుకు కూడా అవకాశం ఉండదు. దీంతో ఇంట్లో వంద నోట్లు లేకుండా కేవలం పెద్దనోట్లు మాత్రమే ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. కేంద్రం ప్రభుత్వం రూ.500, వెయ్యినోట్లు రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి 8.30గంటల నుంచే టీవీల్లో ప్రకటనలు వచ్చాయి. ఇది దావానలంలా నగరం మొత్తం వ్యాపించింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే వినియోగదారులు కొన్ని బేకరీలు, సూపర్మార్కెట్లలో రూ.500, వెయ్యినోట్లు ఇస్తే చెల్లవనే మాట చెప్పకుండా 'చిల్లర లేదు' అని సింపుల్‌గా తప్పించుకున్నారు. దీంతో మంగవారం రాత్రి నుంచే పెద్దనోట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. ఎందుకు అందరూ ఇలా చెబుతున్నారో అర్థం కాక వినియోగదారులు తలలు పట్టుకున్నారు. చివరకు పక్కన ఉన్నవారు 'ఈరోజు రాత్రి నుంచి నోట్లు చెల్లవండి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే ఇలా అంటున్నారు' అని వివరించే ప్రయత్నం చేశారు. కొంతమంది వ్యాపారులతో వాదులాటకు దిగారు. కొన్ని దుకాణాలు ఎందుకొచ్చిన గొడవ అని మూసేశారు. దీంతో అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి గందరగోళం నెలకొంది. బ్యాంకుల మూసివేతతో ఇక్కట్లు: నెల ప్రారంభమై వారమే అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల జీతాలు వచ్చి ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగులకు కాస్త ఆలస్యంగా వేతనాలు ఇస్తారు. నెల ఆరంభం కావడంతో ఇంట్లోకి కావల్సిన కిరణా, పాలవారికి డబ్బులు, తదితర ఖర్చులు ఉంటాయి. నేడు, రేపు బ్యాంకులు, ఏటీఎంలు బంద్ కావడంతో ఇంట్లో వందనోట్లు లేకపోతే రెండురోజుల పాటు ఇబ్బందులు పడాల్సిందే! పెద్దనోట్లు తీసుకుని చిల్లర ఇవ్వండని ఇరుగు, పొరుగును అడిగినా ఎవ్వరూ స్పందించి ఇచ్చే ప్రసక్తి ఉండదు. దీంతో ఇబ్బందులు పడక తప్పదు. పెట్రోలు బంకులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు, పాలకేంద్రాల్లో ఈ నెల 11 వరకూ పెద్దనోట్లు చెల్లుబాటు అవుతాయి. కానీ పెట్రోలు బంకులు, ఆస్పత్రుల్లో కూడా తీసుకోలేదు. దీంతో వాహనదారులు, రోగులు మరింత ఇబ్బందులు పడ్డారు. సామాన్య, మధ్యతరగతి కుటంబాల్లో కల్లోలం రూ.500, వెయ్యినోట్ల రద్దు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఆస్తులు కొనేందుకు, పిల్లల వివాహాల కోసం నెలనెలా వచ్చే జీతాల్లో తినీతినక, పొదుపుగా సంసారం చేసుకుంటూ డబ్బులు దాచుకున్నారు చాలామంది ఉన్నారు. ఇలా రూ.5లక్షల నుంచి 15 లక్షలు 20లక్షల వరకూ దాచుకున్నవారు ఇప్పుడు నోట్లు చెల్లుబాటు కావంటే, వాటిని బ్యాంకుల్లో మార్చుకోవాలి. అంత మొత్తం మార్చుకోవాలంటే ఆదాయమార్గాలు చూపించాలి. ప్రతి నెలా దాచామంటే బ్యాంకులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి వారు భారీగా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ దెబ్బ మధ్యతరగతి కుటుంబాల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. డిపాజిట్ సెంటర్లు కిటకిట: అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి నోట్లు చెల్లవనే ప్రకటనతో రెండు గంటల్లోనే డిపాజిట్ చేయాలనే ఆతృతతో పలువురు డిపాజిట్సెంటర్లకు చేరుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో తోపులాట జరిగింది. ఒకరికొకరు వాదనలకు దిగారు. నోట్ల ప్రకటనతో పెద్దనోట్లు భారీగా నిల్వ ఉన్నవారంతా నిద్రలే కుండా మంగళవారం గడిపారు. -
30 క్వింటాళ్ల బెల్లం పట్టివేత
కురవి : డీసీఎం వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటా ళ్ల నల్లబెల్లాన్ని ఎక్సైజ్ పోలీసులు కురవిలో శనివారం తెల్లవారుజామున స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకా రం.. మానుకోట డీఎస్పీ రాజమహేంద్రనాయక్ ఇచ్చిన సమాచారంతో కురవిలోని నేరడ క్రాస్‌రోడ్‌లో తెల్లవారుజామున పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో ఖమ్మం నుంచి మహబూబాబాద్ మండలంలోని మల్యాలకు వెళ్తున్న డీసీఎం వాహనంలో 30 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న వ్యాపారి, మల్యాలకు చెందిన పుల్లూరి నాగేశ్వర్రావు, డీసీఎం డ్రైవర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రానికి చెందిన నిసార్ అహ్మద్‌లను అరెస్టు చేశారు. -
భారీగా ఎర్రచందనం డంప్ స్వాధీనం
వెలుగొండ అడవుల్లో భారీఎత్తున నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగల డంప్‌ను స్పెషల్ పార్టీ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగలను నెల్లూరు జిల్లాకు తరలించినట్లు తెలిసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు సమీప వెలుగొండ అడవుల్లో గత రెండురోజులుగా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ కూంబింగ్‌లో సుమారు రూ.50 లక్షల విలువ చేసే 50 ఎర్రచందనం దుంగలు దొరికినట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ పోలీసు అధికారి పర్యవేక్షణలో డంప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఎర్రచందనం దుంగలు స్వాధీనం విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. వెలుగొండల్లో ఇంకా ఎర్రచందనం దుంగలు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారంతో ముమ్మరంగా గాలింపుచర్యలు చేపడుతున్నారు. -
రూ.40లక్షల ఖైనీ పట్టివేత
భవానీపురం (విజయవాడ): గొల్లపూడి మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రగతి రోడ్డు క్యారియర్స్ గోడౌన్లో సుమారు కోటి రూపాయల విలువైన గుట్కాలను పట్టుకున్న కొద్ది రోజుల్లోనే గట్టు వెనుక సుమారు రూ.40 లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్లను శనివారం భవానీపురం పోలీసులు పట్టుకున్నారు. మళ్లీ అదే ట్రాన్స్పోర్ట్కు చెందిన గోడౌన్లోనే ఈ సరుకు కూడా పట్టుబడడం విశేషం. గట్టు వెనుక ప్రాంతంలోని ఆర్టీసీ వర్క్షాపుదగ్గరగల బీరువాల కంపెనీ రోడ్డులో తెల్లవారు జామున 6.30కు ఒక గోడౌన్లో గుట్కాలను దిగుమతి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లేసరికే ఒక లారీ దిగుమతి చేసి వెళ్లగా మరోలారీని పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు వెళ్లిన లారీనుంచి 200 ఖైనీ బస్తాలను దిగుమతి చేయగా, పోలీసులు పట్టుకున్న లారీలో మరో 100 బస్తాలు ఉన్నాయి. ఈ మొత్తం సరుకు దిగుమతి కాకముందే 30 బస్తాలు గోడౌన్లో ఉన్నాయి. మొత్తంమ్మీద రూ.40లక్షల విలువ చేసే 330 ఖైనీ బస్తాలను పట్టుకున్నారు. భవానీపురం ఎస్సై రామకృష్ణుడు జిల్లా ఫుడ్ ఇనస్పెక్టర్లు ఎ. శ్రీనివాస్, సుందరరామయ్యలకు, విద్యాధరపురం, భవానీపురం వీఆర్వోలు బి. శ్రీనివాస్, కామయ్యశాస్త్రిలకు సమాచారం అందించటంతో వారు అక్కడికి చేరుకున్నారు.సరుకును పరిశీలించి పంచనామా చేశారు. అనంతరం సరుకును గోడౌన్లోనే ఉంచి సీజ్ చేశారు. జేసీకి నివేదిక సమర్పిస్తాం ఫుడ్ ఇనస్పెక్టర్లు మాట్లాడుతూ కేసును నమోదు చేసి చార్జిషీట్‌ను ఫైల్‌చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్‌కు నివేదికను సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల పట్టుబడిన కోటి రూపాయల సరుకుకూడా ఇదే ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో పట్టుకున్న నేపథ్యంలో ఆ సంస్థపై క్రిమినల్ కేసులు పెడతారా అన్న ప్రశ్నకు అది జేసీ నిర్ణయం మేరకు ఉంటుందన్నారు. ఢిల్లీ నుంచి ఒరిస్సాకు.. పోలీసులు పట్టుకున్న ఖైనీ లారీకి సంబంధించి డ్రైవర్ అందించిన వే బిల్లులో ఢిల్లీ నుంచి ఒడిశాకు లోడు వెళుతున్నట్లు ఉంది. జమ్మూ-కశ్మీర్ ఖతార్‌లోని ఎస్కే ఎంటర్‌ప్రజైస్ నుంచి ఒరిస్సాకు చెందిన గణేష్ ఎంటర్‌ప్రజైస్ అధినేత గణేష్ 200 బస్తాలు కొనుగోలు చేసినట్లు బిల్లులో ఉంది.