breaking news
Cash deliver
-
ఇంటివద్దకే నగదు...స్నాప్‌డీల్ బంపర్ ఆఫర్
పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్‌డీల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది."Cash@Home" సర్వీసుల కింద ప్రజలకు కనీస అవసరార్థం నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. గురువారం నుంచి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద గరిష్టంగా ఒక బుకింగ్‌కు రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేయనుంది. నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్‌లో స్వైప్ చేసి స్నాప్‌డీల్‌కు ఈ నగదు చెల్లించవచ్చు. అయితే నామమాత్రపు రుసుము కింద రూ. 1ను కంపెనీ చార్జ్ చేయనుంది. బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ సర్వీసులతో గంటల కొద్దీ బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ఎలాంటి అవస్థలు పడకుండా సులభతరంగా నగదు అందేలా చేయనున్నామని కంపెనీ చెప్పింది. "Cash@Home" సర్వీసుల కింద మరే ఇతర ఆర్డర్లను స్నాప్‌డీల్ స్వీకరించదు. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సర్వీసులను కంపెనీ లైవ్‌గా ప్రారంభించింది. మిగతా మేజర్ నగరాల్లో ఈ సర్వీసులను కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. -
ఓటుకు నోటు.. సిగ్గు చేటు
* అధికారులు పక్షపాతంతో వ్యవహరించరు * రెచ్చగొట్టినా రెచ్చిపోను * వందశాతం పోలింగ్, ఫిర్యాదులు లేని ఎన్నికలు నా ఆశ, ఆశయం * మీడియాతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ ముందున్నవి ప్రధానంగా రెండే లక్ష్యాలు. ఒకటి నూరుశాతం పోలింగ్. రెండోది నగదు బట్వాడాను నూరుశాతం అరికట్టడం. అయితే మొదటి లక్ష్యానికి మరికొన్ని రోజులుండగా, రెండో లక్ష్యం మాత్రం ఎన్నికల కమిషనర్‌కు సవాలుపై సవాలు విసురుతూనే ఉంది. నగదు బట్వాడా కాకూడదని ఈసీ ఎంత పట్టుదలతో ఉందో, అంతకు మించి పట్టుదలతో నేతలు నగదును సిద్ధం చేసుకోవడం వింత గొలుపుతోంది. ప్రజలు, పార్టీ నేతలు అందరూ మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని ఆశిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో కోట్ల కొలది డబ్బు దొరుకుతుండడంపై ఒకింత ఆందోళన చెందుతున్న రాజేష్ లఖానీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావావేశాలను పంచుకున్నారు. ప్రశ్న : తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారిగా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ఈసీ : నిజమే. ఎన్నికల కమిషనర్ హోదాలో ఇవి నాకు తొలి ఎన్నికలే. అయితే 1996, 1998 లోక్‌సభ ఎన్నికలు, 2001, 2006 శాసనసభ, 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ఎన్నికల బాధ్యతలు నాకు కొత్తేమీ కాదు. ప్రశ్న : ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.? ఈసీ: ఓటర్ల జాబితాలో కొత్తపేర్లు చేర్చడం, తొలగింపు, సరిదిద్దడం ఎలాగా వంటి ఫోన్లు ఎక్కువగా వచ్చేవి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు వచ్చేవి. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత పోస్టర్లు, బ్యానర్లకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. ప్రశ్న : తమిళననాడులో ఎన్నికల కమిషన్ అంటూ ఒకటి ఉందా అని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో విమర్శిస్తునాడు? ఈసీ: ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే పోస్టర్లు, బ్యానర్ల తొలగింపు కార్యక్రమాలు చేపట్టాం. కేవలం మూడు రోజుల్లో లక్షల సంఖ్యలో బ్యానర్లు, పోస్టర్లు తొలగించగలిగాం. పూర్తిగా ముగిసేందుకు కనీసం నెలరోజులు పడుతుంది. 2,800 కేసులు పెట్టాం. అధికార పార్టీపై ఎక్కువ కేసులు నమోదైనాయి. ప్రచారానికి వస్తున్న నేతలకు హారతులు ఇచ్చేవారికి సైతం నగదు పంచుతున్నట్లు తెలుసుకుని కేసులు పెట్టాం. చెన్నైలో జయలలిత తొలి ఎన్నికల ప్రచార సభలో లెక్కకు మించి బ్యానర్లు కట్టినందుకు కేసులు నమోదు చేశాం. ఈ వివరాలంతా తమ ప్రచారం కోసం కాదు, ఎక్కువ మందికి తెలియదు అందుకే చెబుతున్నా. పార్టీలకు అతీతంగా చర్యలు చేపడుతూ ఉన్నాం. ఈసీ నేరుగా జోక్యం చేసుకోదు, సంబంధిత అధికారులతో చేయిస్తుంది. ఇక అధికారుల బదిలీ విషయానికి వస్తే, గత నెల 22వ తేదీ తరువాతనే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను విచారించి, నిర్ధారణ అయితే బదిలీలు చేస్తూనే ఉన్నాం. ఏరోజుకు ఆరోజు మా పనితీరును విశ్లేషించకుండా మే 16వ తేదీ తరువాత ఒకేసారి అన్ని రోజుల తీరును పరిశీలించండి. ప్రశ్న : ఎన్నికల కమిషన్ ఎన్నో ఆంక్షలు పెట్టినా నగదు చలామణి పెరిగిపోతూ ఉందేమిటి? ఈసీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చినపుడు ఇదే విషయాన్ని అన్ని పార్టీలు ప్రస్తావించాయి. నగదు బట్వాడాను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంటూనే ఉన్నాం. కొత్త పద్ధతుల్లో నగదు చలామణి అవుతోందని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలి. ఓటు వేసేందుకు డబ్బులు పుచ్చుకోవడం సిగ్గుపడాల్సిన విషయమని ప్రజలు గ్రహించాలి. అందుకే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. అలాగే ఓటును కొనుగోలు చేయాలని నేతలు భావించడం సిగ్గుచేటు. చెన్నైలో కొన్ని కోట్ల విలువ చేసే ఇంటిలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తనకు రూ.500 ఇచ్చారని గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. ఓటుకు నోటు పుచ్చుకోవడాన్ని అతను తప్పుగా భావించడం లేదు. ప్రజల్లో మార్పురావాలి. ప్రశ్న : గత ఎన్నికల్లో వలె ఈసారి కూడా ముందుగానే 144 సెక్షన్ విధిస్తారా ? ఈసీ: అలాంటి ఆలోచన లేదు. ప్రశ్న : ఎన్నికలను అడ్డుపెట్టుకుని చేసే పుకార్లను ఎలా అడ్డుకుంటారు? ఈసీ: వాట్సాప్‌ల ద్వారా ఎక్కువ పుకార్లు బయలుదేరుతున్నాయి. వీటికి వెంటనే బదులిస్తున్నాం. వదంతులు రే పుతున్న 50 మందిని గుర్తించి నోటీసులు పంపాం. సైబర్నెట్ ద్వారా ఫిర్యాదులపై నిఘాపెట్టాం. ప్రశ్న : ప్రజలకు డబ్బిచ్చి ప్రచారానికి తీసుకురావడాన్ని అడ్డుకోగలరా ? ఈసీ: ఇలాంటి ఫిర్యాదులు అందాయి. వాహనాలు, ప్రజలను తరలించేందుకు అయ్యే ఇతర ఖర్చులను అభ్యర్థి ఖాతాలో వేస్తున్నాం. ఒక కోటి రూపాయలు ఖర్చయి, పది మంది అభ్యర్థులు ఉన్నట్లయితే తలా రూ.10 లక్షలు ఖర్చు కింద రాస్తాం. ప్రశ్న : అధికార పార్టీ సభలకే ఎక్కువ మంది పోలీసులు బందోబస్తులో ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి ? ఈసీ: ఈ విషయంపై పోలీస్ శాఖకు సర్క్యులర్ పంపాం. అభ్యర్థులు, నేతల స్థాయిని బట్టి బందోబస్తు చేయాలని ఆదేశించాం. ప్రశ్న: వందశాతం పోలింగ్ సాధించాలనే ఉద్దేశంతో చేపట్టిన అవగాహనా ప్రచారాలు సత్ఫలితాల దిశగా సాగుతున్నాయా? ఈసీ: నూరుశాతం ఓటింగ్‌లో విజయం సాధించామా లేదా అనేది మే 16 సాయంత్రమేకదా తెలుస్తుంది. ప్రశ్న : రాజకీయ పార్టీల నేతల విమర్శలను తట్టుకోగల సహనం మీకు ఉందా ? ఈసీ: ఒక్కోసారి ఆవేశం వస్తుంది. వారువేసే ప్రశ్నలకు బదులివ్వడానికి లేదు. లోలోపల అణచుకుంటాను. నేను తప్పుచేయనపుడు ఆవేశం ఎందుకని సమాధాన పడతాను. ప్రశ్న : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా దొంగ ఓటు కొనసాగుతోందే? ఈసీ: దొంగ ఓట్లను అడ్డుకునేందుకు సీసీ కెమెరాలు అమరుస్తున్నాం. పోలింగ్ అధికారులు, ఏజెంట్లు ఉంటున్నారు. వారి మద్దతు లేనిదే దొంగ ఓటు వేయడం అసాధ్యం. వారంతా కచ్చితంగా వ్యవహరిస్తే దొంగ ఓటును పూర్తిగా నివారించవచ్చు. ప్రశ్న: ఎన్నికల అధికారులంతా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల నిబంధనల అమలు ఎలా సాధ్యం? ఈసీ: అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని గుర్తించడం ధర్మసంకటమే. 1950 నాటి ఎన్నికల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల చేతనే ఎన్నికల నిర్వహణ సాగుతోంది. పక్షపాతంతో వ్యవహరించి ఈసీ ద్వారా ‘చార్జ్’ జారీ అయిందంటే అధికారి పదోన్నతిని కోల్పోతాడు. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి అధికార పార్టీకి అండగా మెలగడం అనేది ఉండదు. ప్రశ్న : ఎన్నికల కమిషన్ అవగాహన డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించేందుకు రజనీకాంత్ వంటి ప్రముఖులు ముందుకు రాలేదేమిటి? ఈసీ: అందరినీ కోరాం. ఎందుచేతనో అందరూ జంకారు. ఎన్నికలు కదా అంటూ భయపడ్డారు. అయినా కొందరు నటీనటులు ముందుకు వచ్చి నటించారు. ప్రశ్న : ఆన్లైన్లో ఓటు వేసే విధానం వస్తుందా ? ఈసీ: విదేశాల్లో నివసించేవారు ఓటు వేసేందుకు ఒక కమిటీ వేసి, చట్టంలో మార్పులు తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రశ్న : ఫ్లయింగ్ స్క్వాడ్ విధుల్లో కేంద్ర అధికారులను నియమించడం రాష్ట్ర అధికారుల నిజాయితీని శంకించడం కాదా? ఈసీ: రాష్ట్ర అధికారులను అనుమానించడం లేదు. ఎన్నికల విధుల్లో పక్షపాతానికి తావులేదని నిరూపించేందకే కేంద్ర అధికారులను నియమించాం. ప్రశ్న : ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత తీరు ఎలా ఉంది ? ఈసీ: యువతతో ఓటు వేయించేందుకు అన్ని చర్యలు చేపట్టాం, విద్యాసంస్థల్లో భారీ ఎత్తున ప్రచారం చేశాం. యువత అంతా కదలి వచ్చి ఓటు వేస్తుందని విశ్వసిస్తున్నాం. ప్రశ్న : మీరు ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకువచ్చిన మార్పులు ఏమిటి? ఈసీః ఓటు వినియోగంలో యువతను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. సాంకేతికంగా తమిళనాడు అగ్రస్థానంలో ఉంది, దీనిని పూర్తిగా వినియోగిస్తున్నాం. పోలింగ్ బూత్‌లో క్యూ ఎంత పొడవు ఉంది అనే సమాచారాన్ని ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని పరిచయం చేశాను. మొబైల్ ఆప్స్ తీసుకువచ్చాను. ప్రత్యేక ప్రతిభావంతులు (వికలాంగులు) కోసం ఇంత వరకు ఏ ఎన్నికల్లో లేని విధంగా 13 వేల ట్రైసైకిల్స్ సిద్ధం చేశాం. ప్రశ్న : ఈ పదవీ బాధ్యతల ద్వారా మీరు కొత్తగా ఏమి సాధించాలని ఆశపడుతున్నారు? ఈసీ: నూరుశాతం ఓటు పడాలని, ఎలాంటి ఫిర్యాదులు లేని వందశాతం నిష్పాక్షికంగా ఎన్నికలు ముగించాలని ఆశిస్తున్నాను. ప్రశ్న : ప్రజలకు, పార్టీ నేతలకు మీరు ఏమి చెప్పదలిచారు.? ఈసీ: మనస్సాక్షి ప్రకారం నడుచుకోండి. ఇదే అందరికీ చె ప్పాలని భావిస్తున్నాను. ప్రశ్న : ఇటీవల ఏమైనా సినిమాలు చూశారా ? ఈసీ : విజయ్ హీరోగా నటించిన తెరి చిత్రం చూశాను. బాగుంది. ప్రశ్న : మీది ఏ ఊరు? ఈసీ : ఛత్తీస్‌ఘడ్ ప్రశ్న : తమిళ ప్రజలపై మీ అభిప్రాయం? ఈసీ : తమిళనాడు ప్రజలు ఎంతో మంచి వారు. ప్రేమపూర్వకంగా మెలగుతారు. నేను చెన్నైలోనే కొనసాగుతాను, నివసిస్తాను. ఇక నా సొంతూరు చెన్నై.