breaking news
car robbery case
-
చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..!
బంజారాహిల్స్: సిటీలోనే పేరు మోసిన ఓ స్టార్ హోటల్..చుట్టూ పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు..అడుగడుగునా సెక్యూరిటీ నిఘా. లోపలికి వెళ్లినా..బయటికి వచ్చినా క్షుణ్ణంగా తనిఖీలు. అయినా పార్కింగ్‌లో పెట్టిన ఓ కారు మాయమైంది. సరే కారు పోయింది..పోలీసులు 24 గంటలు తిరిగే సరికి పట్టుకుంటారులే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ కారు పోయి 12 రోజులు గడిచినా జాడ కానరాలేదు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉన్నా ఇప్పటి వరకు పోలీసులకు మాత్రం కారు ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉండగా అసలు ఇప్పుడు కారు ఎలా కొట్టాశారనేదానిపైనే పోలీసు వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు టాస్క్‌ఫోర్స్, మరోవైపు క్రైం పోలీసులు ఈ కారును ఎలా దొంగిలించి ఉంటారన్నదానిపై స్కెచ్‌లు వేస్తున్నారు. గతంలో ఇలాంటి కారు చోరీలు జరిగినప్పుడు వాటిని ఎలా ఛేదించారన్నదానిపై ఆరా తీస్తున్నారు. అయితే పార్క్ హయత్ దొంగ మాత్రం పక్కా ప్రణాళికతో ‘సినిమా’టిక్ గా కొట్టేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలో ఇదే తరహాలో హీరో కారును రోల్‌జామ్ డివైస్‌తో కారులో ఉన్న సెన్సార్లను బయటి ఉండి రిమోట్‌తో ఆపరేట్ చేసి కారును కొట్టేస్తాడు... ఇదే తరహా ప్రయోగాన్ని ఓ దొంగ బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో గత నెల 26వ తేదీ రాత్రి జరిగిన దొంగతనంలో ప్రయోగించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వేసిన తాళం వేసినట్టే.. బెంగళూరుకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారి వి.మంజునాథ్ ఓ సినిమాకు సంబంధించిన చర్చల కోసం గత నెల 22వ తేదీన హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో బస చేశాడు. 26వ తేదీన ఉదయం డ్రైవర్ హర్షతో కలిసి బయటికి వెళ్లి పనులు ముగించుకొని రాత్రి 9.30 గంటలకు హోటల్‌కు వచ్చాడు. డ్రైవర్ హర్ష పార్కింగ్ స్థలంలో కారును నిలిపి..తాళం వేసి..బండి ‘కీ’ని జేబులో వేసుకొని పంజగుట్టలోని తనకు కేటాయించిన లాడ్జికి వెళ్ళిపోయాడు. తెల్లవారి వచ్చి చూసేసరికి పార్కింగ్‌లో ఉండాల్సిన కారు మాయం అయింది. దీంతో మంజునాథ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అదే రోజు అర్ధరాత్రి ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా వరకు వెళ్ళిన కారు తిరిగి వెనక్కి వచ్చినట్లుగా ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి టెక్‌మహీంద్ర సమీపంలో కారు పార్కింగ్ చేసినట్లుగా, 28వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అక్కడి నుంచి తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇంత వరకు ఆచూకీ దొరకలేదు. చదవండి: ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను.. -
మలుపుతిరుగుతున్న'పోలీసు అబ్బాయి' కారు కేసు
హైదరాబాద్‌లో చోరీకి గురైన కారు కేసు మలుపులు తిరుగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి కుమారుడు కావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా జిల్లాపై పడింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన ఎన్వీవీ ప్రసాద్ స్కోడా కంపెనీకి చెందిన సూపర్బ్ కారును గతేడాది మే 22న దస్పల్లా హోటల్ వద్ద పార్క్ చేసిన గంటలోపే మాయమైంది. పలు ప్రాంతాల్లో వెతికిన బాధితుడు మరునాడు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినా సరైన ఆధారాలు లభ్యం కాకపోపోవడంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసును విచారిస్తున్న క్రమంలో హోటల్ సీసీ కెమెరాలను పరిశీలించి పలువురు అనుమానితులను విచారించారు. దీనిలో జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారి కుమారుడు ‘ఆర్ ’ అక్షరంతో పేరుగల వ్యక్తితోపాటు అతడి ముగ్గురు మిత్రులు ఉన్నారు. మొదట ఎలాంటి ఆధారాలు లభ్యంకాకపోవడంతో అప్పుడు వదిలివేశారు. అయితే కేసును విచారిస్తున్న క్రమంలో కిరణ్ అనే వ్యక్తి అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. అతడిని విచారించిన సమయంలో ఈ విలువైన కారు విషయం బయటకు వచ్చింది. దీంతో మళ్లీ సీసీ కెమెరాలతోపాటు బయట ఉన్న మరిన్ని పుటేజీలు పరిశీలించిన సమయంలో జిల్లాకు చెందిన పోలీస్ అధికారి కుమారుడే ఈ కారును చోరీచేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాగా.. వారిని మళ్లీ పిలిపించి వారి పద్ధతిలోనే విచారించారు. దీంతో కారు చోరీ చేయడంతోపాటు అమ్మగా వచ్చిన డబ్బులు జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నారని సమాచారం. ప్రస్తుతం నలుగురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆ కారు జిల్లాలోనే ఉందని తెలియడంతో కరీంనగర్లో దాని ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఈ సమయంలోనే జిల్లాలోని పోలీస్ అధికారి కుమారుడి హస్తం ఉన్నట్లు బయటకు పొక్కింది. గతంలో జిల్లాలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఓ అధికారి కృషితోనే సదరు అధికారి కుమారుడు చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. కారు రికవరీ కాగానే నేడోరేపో వారిని అరెస్టు చూపే అవకాశాలున్నాయని తెలిసింది.