Cancellation of contracts
-
యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల్లో 90 శాతం రద్దు!
వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ విదేశీ సహాయ నిధి (యూఎస్ ఎయిడ్)కు ఇప్పటికే మంగళం పాడిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 90 శాతానికి పైగా కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ దెబ్బతో 6,200 కాంట్రాక్టుల్లో 54 బిలియన్ డాలర్ల విలువైన 5,800 పై చిలుకు ఒక్కసారిగా బుట్టదాఖలయ్యాయి. యూఎస్ ఎయిడ్ కాంట్రాక్టుల మొత్తం విలువ 60 బిలియన్ డాలర్లని సర్కారు వెల్లడించింది. యూఎస్ ఎయిడ్ రద్దును సవాలు చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే కోర్టుల తలుపులు తట్టాయి. సదరు కాంట్రాక్టులకు సంబంధించి నిలిపేసిన బిలియన్ల కొద్దీ డాలర్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఒకరు మంగళవారం తీర్పు ఇచ్చారు. కానీ దానిపై ట్రంప్ యంత్రాంగం బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు దన్నుగా నిలిచే యూఎస్ ఎయిడ్ కార్యక్రమాన్ని అమెరికా 60 ఏళ్లకు పైగా కొనసాగిçస్తున్న సంగతి తెలిసిందే.ఖాళీకి పావుగంటఉద్వాసన పలికిన, దీర్ఘకాలిక సెలవులపై పంపిన యూఎస్ ఎయిడ్ సిబ్బందికి తమ డెస్కులను ఖాళీ చేసేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం కేవలం 15 నిమిషాల గడువిచ్చింది. దాంతో సిబ్బంది ఒక్కొక్కరుగా సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమ కార్యాలయాన్ని, డెస్కును చివరిసారిగా చూసుకుంటూ భారమైన మనసుతో నిట్టూర్చారు. ఇది తమను మరింతగా అవమానించడమేనని వాపోయారు. -
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్‌వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
దుమ్ముగూడెం కాంట్రాక్టులన్నీ రద్దు
హైదరాబాద్: రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదంటూ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసుకున్న దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పరిధిలోని 10 ప్యాకేజీలలో పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు టెర్మినేట్ ఉత్తర్వులు పంపింది. తద్వారా ఈ విషయంలో కాంట్రాక్టు సంస్థలతో నలుగుతున్న వివాదానికి రాష్ట్ర నీటిపారుదలశాఖ స్వస్తి పలికింది. అయితే కాంట్రాక్టు సంస్థలకు పంపిన ఉత్తర్వుల్లో ‘ప్రాజెక్టును ఇకపై చేపట్టరాదని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మీరు ఊహించుకుంటున్నారు. మీ ఊహలకు ఎలాంటి అర్థం లేదు’ అని పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై పలు కాంట్రాక్టు సంస్థలు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.