breaking news
Butta Renuka
-
ఏం ప్యాకేజీ తీసుకొని వెళ్తున్నారు?
విజయవాడ: కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఏం ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే ఉంటానని చెప్పిన ఆమె ఇప్పుడు టీడీపీలోకి ప్రాణంతోనే వెళుతున్నారా? లేక మరే విధంగానైనా వెళుతున్నారా? అని ప్రశ్నించారు. అత్యున్నతమైన చట్టసభలో ఎంపీగా కూర్చోబెట్టిన పార్టీకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళగా పేద ప్రజల బాగు కోసం పోరాడాల్సిన ఎంపీ తన సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సబబు కాదన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుట్టా రేణుక కర్నూలు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు వివరణ ఇచ్చుకోవాలని డిమాండ్ చేశారు. రూ.70 కోట్లు ఆశించి వెళ్తున్నారా? బలహీన వర్గాలకు చెందిన మహిళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ ఇచ్చి గెలిపిస్తే బుట్టా రేణుక కొంచెమైన విశ్వాసం లేకుండా పార్టీ మారారని ధ్వజమెత్తారు. పార్టీ మారితే దాదాపు రూ.70 కోట్లు ఇచ్చేలా ఒప్పందాలు జరిగినట్లు జనం చెప్పుకుంటున్నారని, డబ్బులు ఆశించే వెళ్లారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజ్యాంగం, చట్టాలపై గౌరవం లేదని పార్థసారధి మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు నెలకొల్పాలనే ఉద్దేశంతో టీడీపీ ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించి తమ పార్టీలో జగన్ చేర్చుకున్నారని గుర్తు చేశారు. అది చూసిన తరువాతైనా చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కలగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రతో అసలు రంగు బయటపడుతుందనే భయంతోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి ప్రతిపక్ష నేత వైఎస్ వైఎస్ అ«ధ్యక్షతన జరిగిన బీసీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం విజయవంతమైందని పార్థసారధి తెలిపారు. టీడీపీ సర్కారు కుల వృత్తులను తొక్కేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని బీసీ సంఘాల నేతలు ప్రతిపక్ష నేత దృష్టికి తెచ్చారన్నారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపై చాలెంజ్‌లు విసరటం సిగ్గు చేటన్నారు. ఇన్నేళ్ల చంద్రబాబు పరిపాలనలో ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ఎద్దేవా చేశారు. బీసీలకు చేసిన అభివృద్ధిపై కేబినెట్ మంత్రులంతా బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో కలిసి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌కు రావాలన్నారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్థి చెందాలని అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు. బీసీ మంత్రులకు అధికారాలేవీ? రాజధాని డిజైన్ల కోసం సినీ దర్శకుడు రాజమౌళిని లండన్‌కు పంపించడం చూస్తుంటే చంద్రబాబు మానసిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. విపక్ష ప్రజాప్రతినిధులను చేర్చుకుంటూ చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. బలహీన వర్గాలకు ఇచ్చిన మంత్రి పదవులను అలంకారప్రాయంగా మార్చి అధికారాలన్నీ లోకేష్‌కు అప్పజెప్పారన్నారు. కనీసం వీఆర్వో, వీఆర్ఏలను కూడా బదిలీ చేసే అధికారం లేని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విపక్ష నేత జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బోయలను ఎస్టీల్లోకి చేరుస్తామన్న హామీని నెరవేర్చాలని చంద్రబాబును మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం బోయలను మోసగించిన ఆయనకు విపక్ష నేతను విమర్శించే హక్కు లేదన్నారు. -
ఇంకా 56 మంది ఉన్నారు!
ఈ ఐదుగురు ఎంపీలు శాంపిల్! లోక్‌సభలో ఇంకా 56 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. వాళ్లందరికీ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అవకాశం వస్తే ఎలా మాట్లాడతారో.. వీళ్లైదుగురూ మాట్లాడి చూపించారు! ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. ముఖం ఇంతైంది! ‘అరె..వా!’ అన్నారు. బడ్జెట్లో మగ ఎంపీలు రాజకీయాలు చూస్తే..మహిళా ఎంపీలు లెక్కలు సరి చూశారు. సరి చేశారు. ఒకటి నిజం. ముగ్గేసి, దీపం పెట్టిన ఇల్లు.. గర్భగుడి. మహిళలు మాట్లాడని సభ.. మొక్కుబడి. కల్వకుంట్ల కవిత, బుట్టా రేణుక, పూనమ్ మహాజన్, సాధ్వి సావిత్రిబాయి ఫూలే, హీనా గవిట్... ఈ అయిదుగురు ఎంపీలు... ఆర్థికాంశాల మీద మహిళలకు ఎంత అవగాహన ఉంటుందో, భావ వ్యక్తీకరణలో ఎంతటి స్పష్టత ఉంటుందో, ఎంత నిర్దిష్టమైన అభిప్రాయాలను కలిగి ఉంటారో నిరూపించారు. మొన్న లోకసభలో సాధారణ బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఈ అయిదుగురు ఎంపీలు చేసిన ప్రసంగం తోటి సభ్యులను, ముఖ్యంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని చాలా ఆకట్టుకుందట. ఈ విషయాన్ని జైట్లీనే స్వయంగా పార్లమెంటులో అందరి ముందూ చెప్పారు. ‘పురుషులు రాజకీయపరమైన ప్రసంగాలకు ప్రాధాన్యమిస్తే మహిళా ఎంపీలు మాత్రం తగు గణాంకాలను ఉటంకిస్తూ సరైన అంశాల మీద స్పందించారు. సమస్యలను ప్రస్తావించారు’ అంటూ ఈ అయిదుగురు ఎంపీలను జైట్లీ ప్రశంసించారు. అరుణ్జైట్లిని అంతగా అబ్బురపరిచిన ఈ అయిదుగురి నేపథ్యం కూడా సామాన్యమైనదేమీ కాదు. ఆయన చెప్పినట్టు రాజకీయాలంటే అవగాహన, ప్రజల సమస్యల మీద లోతైన అధ్యయనం చేసే పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. వీళ్ల వెనక రాజనీతిజ్ఞులైన వాళ్ల తండ్రులున్నప్పటికీ ఈ తనయలు తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీళ్ల వివరాలు.. సంక్షిప్తంగా.. బుట్టా రేణుక (44) బుట్టా రేణుక కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రతినిధి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. ఇంటర్ వరకు చదివిన రేణుక... దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికన్నా ధనవంతురాలు. ఈమె ఆస్తి విలువ మొత్తం 300 కోట్ల రూపాయలు. రేణుక భర్త బుట్టా నీలకంఠం తెలుగుదేశం పార్టీ సభ్యుడు. రేణుక రాజకీయాల్లోకి రాకముందు సామాజిక కార్యకర్తగా ఉన్నారు. మెరిడియన్ స్కూల్ నిర్వహణా బాధ్యతలూ ఆమెవే. హోటల్స్, రిటైల్ వ్యాపారరంగంలోనూ భర్తకు చేదోడువాదోడుగా ఉన్నారు. సమాజానికి మరిన్ని సేవలందించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అంటారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి ప్రాధాన్యం ఇవ్వాలని రేణుక అంటారు. కల్వకుంట్ల కవిత (38) నిజామాబాద్ నియోజకవర్గ ఎంపి, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, తెలంగాణరాష్ట్రసమితి సభ్యురాలు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. 2015లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి చీఫ్ కమిషనర్‌గా ఎన్నికయ్యారు. కరీంనగర్లో జన్మించారు. ప్లస్ టూ వరకు హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో చదివిన కవిత తన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ను విఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పూర్తి చేశారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ మిసిసిప్పిలో మాస్టర్స్ చేయడానికి చేరారు కానీ మధ్యలోనే ఆపేశారు. ఎప్పటికైనా ఎమ్మెఎస్ పూర్తిచేయాలనేది ఆమె లక్ష్యం. అంతేకాదు కెమిస్ట్రీ అంటే అమితాసక్తి ఉన్న కవిత కెమిస్ట్రీలో కూడా మాస్టర్స్ చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. తెలంగాణ, జమ్ముకశ్మీర్ ప్రజల సమస్యల సాధనలో తనూ భాగం పంచుకోవాలనే ఆశతో ఉన్నారు. లోక్‌సభలో తెలంగాణ సమస్యల మీద తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. హీనా గవిట్ (28) వృత్తిరీత్యా డాక్టర్ అయిన హీనా ప్రముఖ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, నండుర్బార్ అసెంబ్లీ అభ్యర్థి విజయ్‌కుమార్ గవిట్ కూతురు. 28 ఏళ్ల హీనా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున నండూర్‌బార్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ప్రత్యర్థి అభ్యర్థి, ఇండియన్ నేషనల్‌కాంగ్రెస్ నుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన మాణిక్‌రావు హోడ్ల్యాను ఓడించారు. సాధ్వి సావిత్రిబాయి ఫూలే (35) బహారైచ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు. సావిత్రి బాల్యవివాహ బాధితురాలు. ఆరేళ్లకే ఆమెకు పెళ్లిచేశారు. 1995, డిసెంబర్ 16న జరిగిన ఓ ధర్నాలో పాల్గొని బుల్లెట్ గాయానికి గురయ్యారు. లక్నో జైలుకీ వెళ్లారు. అప్పుడే నిర్ణయించుకున్నారు తన జీవితాన్ని సమాజ సేవకే అంకితం చేయాలని. జైలు నుంచి బయటకు వచ్చాక... తన తండ్రిని, అత్తమామలను పిలిచి చెప్పారు.. వైవాహిక బంధం నుంచి తాను బయటపడి సామాజికసేవా కార్యకర్తగా బతకాలనుకుంటున్నానని. అంతా షాక్ అయ్యారు. అయినా నిర్ణయాన్ని మార్చుకోలేదు ఆమె. వెంటనే ఆమె కుటుంబసభ్యులు సావిత్రి చెల్లెలిని ఆమె భర్తకిచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి సావిత్రి సాధ్వి సావిత్రిబాయి ఫూలేగా మారారు. బహరైచ్లోని జన్ సేవా ఆశ్రమంలో చేరారు. ఆమె రాజకీయ జీవితం కూడా అంతే నాటకీయంగా మొదలైంది. తను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు 480 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది. కానీ పాఠశాల సిబ్బంది ఆ మొత్తాన్ని తమ దగ్గరే పెట్టుకున్నారు సావిత్రికి ఇవ్వకుండా. విషయం తెలిసిన సావిత్రి నిలదీస్తే సహించని పాఠశాల యాజమాన్యం 3 ఏళ్లు ఆమెను స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. 480 రూపాయల స్కాలర్ షిప్ మీద, చదువుకునే తన హక్కు మీద తను చేసిన పోరాటమే తనలో నేతను, రాజకీయ మహిళను మేల్కొపింది అంటారు సావిత్రి. తన నియోజకవర్గంలో సరైన రహదారులు, మంచినీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు కల్పించడమే ఎంపీగా తన తక్షణ కర్తవ్యం అంటారు. ప్రజలందరికీ ఉద్యోగవకాశాలు రావాలంటే పారిశ్రామికీకరణ ఒక్కటే మార్గం అంటారు. 2012లో ఉత్తరప్రదేశ్‌లోని బహరైచ్ జిల్లా బాల్హ అసెంబ్లీస్థానానికి భారతీయ జనతాపార్టీ తరపున మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు సావిత్రి. ఆ తర్వాత 2014 లోకసభ ఎన్నికల్లో బహరైచ్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడి గెలిచారు. సావిత్రి ఎమ్మే చదువుకున్నారు. పూనమ్ మహాజన్ (35) దివంగత నేత ప్రమోద్ మహాజన్ కూతురు. ముంబై నార్త్ సెంట్రల్ పార్లమెంట్ నియోజక అభ్యర్థి. భారతీయజనతాపార్టీ సభ్యురాలు. 2006లో తన తండ్రి హత్యకు గురవడంతో ఆయన వారసత్వంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. మేనమామ గోపీనాథ్‌ముండే ప్రోత్సాహంతో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. బ్రైట్ఆన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.