breaking news
Business rules
-
బిజినెస్ రూల్స్ మార్చేద్దాం!
- రాయితీల అంశాలు - ఆర్థిక శాఖకు వెళ్లకుండా మార్పులు - కేబినెట్ నిర్ణయం తర్వాత మూడు రోజుల్లోనే ఉత్తర్వులు - ప్రభుత్వ పెద్దల ప్రతిపాదనలు.. ఉన్నతాధికారుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక శాఖ చికాకులు సృష్టిస్తోంది.. ఆర్థిక ఫైళ్లపై నిబంధనల పేరుతో అడ్డంగా రాస్తోంది.. దీంతో కావాల్సిన వారికి రాయితీలు ఇవ్వడానికి స్వేచ్ఛ ఉండటం లేదని ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. అందుకే ఏకంగా సచివాలయ బిజినెస్ రూల్స్‌నే మార్చేందుకు సిద్ధమయ్యారు. సచివాలయ పాలనకు బిజినెస్ రూల్స్ కీలకం. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చే విషయంలో ఆర్థిక శాఖ నిబంధనల మేరకు వ్యవహరిస్తోంది. పెట్టుబడికి మించి రాయితీలు ఇవ్వాలంటూ వస్తున్న ఫైళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.. నిబంధనలను గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాయితీలకు చెందిన అంశాల ఫైళ్లు ఆర్థిక శాఖకు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశాలకు చెందిన ఫైళ్లు ఆర్థిక శాఖకు పంపినప్పటికీ తిరస్కరించకుండా ఉండేలా బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాలని కూడా ప్రతిపాదించారు. అడ్డూ అదుపూ ఉండదిక... ఎప్పటినుంచో ఉన్న బిజినెస్ రూల్స్‌ను మార్చేస్తే ఇక అడ్డూ అదనపు లేకుండా ప్రజాధనాన్ని పాలకులు దోచేసుకుంటారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేబినెట్ పేరుతో పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇప్పుడు బిజినెస్ రూల్స్‌నే మార్చేస్తే యథేచ్ఛగా కావాల్సిన వారికి కావాల్సినంత దోచిపెట్టవచ్చునని, అడిగే నాథుడే ఉండడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం ఒకే రకంగా ఉండాలని, అందుకే బిజినెస్ రూల్స్, నిబంధనలు పెట్టారని, ఇప్పుడు ఆ రూల్స్‌నే సవరిస్తే న్యాయం అనేది ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా అమలవుతుందని చెబుతున్నారు. అలాగే కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మూడు రోజుల్లోగా అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించిన తరువాత ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తాయి. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం ఆయా శాఖలకు వెళితే తగిన ఆదేశాలు జారీ చేస్తాయి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తీర్మానాలు రావడంలో జాప్యం జరుగుతోంది. ఆ జాప్యం నివారించకుండా మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేయాలంటే ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్సియల్ కోడ్, బడ్జెట్ మాన్యువల్ పాటించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
బిజినెస్ రూల్స్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు
పాల్వాయి ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి హరీబాయి చౌదరి సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాజధానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా బిజినెస్ రూల్స్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీబాయి చౌదరి సభకు లిఖితపూర్వక సమాధానం అందజేశారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం అపాయింటెడ్ డే నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా సౌలభ్యం కోసం ప్రజల ప్రాణ, ఆస్తుల సంరక్షణపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ ట్రాన్సాక్షన్ రూల్స్(బీటీఆర్)ను మార్చేందుకు అంగీకరించలేదు. కేంద్ర ప్రభుత్వం జూన్ 4న బీటీఆర్ మార్చడంపై అభిప్రాయాన్ని కోరగా జూలై 5న తెలంగాణ ప్రభుత్వం బదులిచ్చింది. శాంతిభద్రతలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రివర్గం ద్వారా గవర్నర్‌కు నివేదికలు పంపిస్తామని ఆ లేఖలో పేర్కొంది. సంబంధిత నేరాలను గమనించేందుకు డీజీపీ కార్యాలయంలో ఒక అధికారిని నియమిస్తామంది. అలాగే ఉమ్మడి రాజధాని ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో భాగమని, ఇక్కడ ఉమ్మడి శాంతిభద్రతల బలగాలు ఉండబోవని తెలిపింది. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలో అంశమైనందున.. ఇతర రాష్ట్రాలకు చెందిన బలగాలు తమ రాష్ట్ర పరిధిలో ఉండజాలవని తెలంగాణ పేర్కొంది.’ అని వివరించారు.