breaking news
B.S. ramulu
-
అసలైన అర్హులకే సత్కారాలు
సందర్భం ప్రత్యేక రాష్ట్రం కోసం విభిన్న రంగాల్లో కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా సత్కరిస్తోంది. కానీ అర్హులైన వారికే ఈ సత్కా రాలు అందేలా ప్రభుత్వం ఒక స్థిర యంత్రాంగాన్ని ఏర్పర్చాల్సి ఉంది. తెలంగాణ అవతరణ ఉత్సవాలు జూన్ 2 నుంచి ప్రారంభం కాను న్నాయి. 2014 జూన్ 2నతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా జరిగిన తొలి ఉత్సవాలు ఒక ఉద్వేగభరిత స్వాతం త్య్రోద్యమ స్ఫూర్తితో సాగాయి. 2015 జూన్ 2 నాటి తెలంగాణ అవతరణ వారోత్సవాలను గ్రామ, మండల, రెవెన్యూ, జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఎక్కడికక్కడ నిర్వహించారు. ఎందరో కళాకారులు, రచయితలు, విభిన్న రంగాలలో కృషి చేసినవారిని సత్కరించి తెలంగాణ ప్రభుత్వం తనను తాను గౌరవించుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల తరపున మహనీయుల జయంతి, వర్ధంతుల నిర్వహణతో పాటు, వందలాది మందిని సత్కరించి, పురస్కారాలు అందజేసింది. తొలిదశలో హడావుడి తప్పలేదు కానీ, ఇకనుంచి నిజంగా అర్హులైన వారిని గుర్తించి సత్కరించుకోవడానికి ఒక సమగ్ర దృష్ట్టితో స్థిరమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం అవసరం. 1) ముఖ్యంగా 1969 నాటి జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇంకా జీవించి ఉన్న ఉద్యమకారులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వారి త్యాగాలను వెలకట్టలేము. నగదు పురస్కారాలు ముఖ్యం కాదు. వారి త్యాగాలకు, కృషికి సమాజంలో తగు గుర్తింపు ఇచ్చే విధంగా సత్కరిస్తే చాలు. 2016 జూన్ 2 నాటి తెలంగాణ అవతరణ ఉత్సవాలతోనే ఈ కార్యక్రమాలు ముగించకుండా, ఆగస్టు 15 వరకు వెలికివచ్చే వివరాలను బట్టి.. వారిని గౌరవించుకునే సభలు, సదస్సులు ఏర్పాటు చేయాలి. 2) తెలంగాణ ఉద్యమంలో కళాకారులు, జర్నలిస్టులు, పాటల కవులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమ కారులు, విద్యావంతులు, అడ్వొకేట్లు, రచయితల పాత్ర ఎనలేనిది. ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు తదితర అనేక రంగాల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నెలల తరబడి రిలే నిరాహార దీక్షా శిబిరాలను నిర్వహించిన నిర్వాహకులు మొదలైన వారందరినీ తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. పలు త్యాగాలు చేస్తూ, ఉద్యమాలు చేసిన అనేక రంగాల విద్యా ర్థులను, మహిళలను, యువతరాన్ని ప్రత్యేకంగా గౌరవించాలి. అలా పలు రంగాల్లో కృషి చేసినవారిని సత్కరించుకోవడం అంటే మనని మనం సత్కరించుకోవడమే. 3) రెండేళ్లు గడుస్తున్నాయి. ఈసారి గత రెండేళ్లుగా సత్కారాలకు, పురస్కారాలకు వెలుపలే ఉండి పోయిన వివిధ రంగాల కృషీవలురను, ఉద్యమ త్యాగశీలురను సత్కరించుకోవడం, గౌరవించుకోవడం అందరి కర్తవ్యం. ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఆహ్వానం కోసం వేలాది మంది నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రికి వందల, వేలమందితో ప్రత్యక్ష, పరోక్ష పరిచయమే ఉంది. వారి వారి కృషిని గుర్తించి, సముచిత సత్కా రాలను, పురస్కారాలను అందజేయడం సముచితంగా ఉంటుంది. 4) ఉత్తమ రచయితలకు, కళాకారులకు, వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారం, ఆ తర్వాత 5 లక్షలు, 3 లక్షలు, లక్ష రూపాయలకు తగ్గకుండా జిల్లా స్థాయి పురస్కారాలు ఇవ్వడం ద్వారా దేశానికి, రచయితలకు, కళాకారులకు, వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి గొప్ప సందేశం చేరుతుంది. ఇతర రాష్ట్రాల్లోని సుప్రని ద్ధులను కూడా ఇలా సత్కారాల్లో చేర్చడం అవసరం. 5) వివిధ ప్రక్రియలు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో 20 సాహిత్య కళా ప్రక్రియలకు, రచనలకు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు చొప్పున మూడు పురస్కారాలు... 60 మందికి ఇవ్వడం సముచితంగా ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో 2 లక్షలు, లక్ష, 50వేల చొప్పున 60 మందికి పురస్కారాలు యివ్వడం ద్వారా తెలం గాణలో సాహిత్యం, కళలు, నాటి అణచివేత పరిమితులను, వివక్షను, వెలివేతను అధిగమించి ఇతోధికంగా అభివృద్ధి చెందుతాయి. సీనియర్ రచయితలకు, కళాకారులకు, రూ. 10 లక్షల చొప్పున ఇచ్చే అన్ని పుర స్కారాలకు అయ్యే వ్యయం మొత్తం రూ. 20 లేదా 25 కోట్లకు మించి ఉండదు. 6) బంగారు తెలంగాణ సాధనలో అందరి కృషీ అవసరం. అందుకు అందరికీ ప్రోత్సాహకాలు కూడా అవసరం. నూతన రాష్ట్రం కోసం పోరులో భాగంగా డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో చేరిన నళిని తిరిగి ఉద్యోగాన్ని ఆశిస్తున్నదని తెలుస్తున్నది. అలాగే శ్రీకాంతాచారిలా ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి తల్లులు, కుటుంబీకులు ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కూడా సముచితంగా గౌరవించుకోవాల్సి ఉంది. హుస్సేన్‌సాగర్ సమీపంలోని సంజీవయ్య పార్కులో నెలకొల్పుతున్న తెలం గాణ అమరవీరుల స్థూపం శంకుస్థాపన నుంచి దాని ఆవిష్కరణ వరకు అందరి వివరాలు సేకరించి ఏదో ఒక రూపంలో సత్కరించుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వేలాదిమంది కేసుల పాలయ్యారు. చిత్రహింసలబారిన పడ్డారు. ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇలాంటి వారందరినీ పేరుపేరునా గౌరవించుకోలేకపోవచ్చు. అయితే, 1969 జై తెలంగాణ ఉద్యమకారులతో పాటు, సాహిత్య, సామాజిక, కళ, విద్య, వైద్య తదితర సమస్త రంగాల వారిని వీలైన మేరకు గుర్తించి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సర్టిఫికెట్‌తోపాటు సత్కరించడం, గౌరవించడం ద్వారా తెలంగాణ తన చరిత్రను తాను గౌరవించుకున్నట్టవుతుంది. - బి.ఎస్. రాములు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త మొబైల్ : 8331966987 -
పుస్తక సమీక్షణం:
దళిత, బహుజన చైతన్యం పుస్తకం : దళిత బహుజన సాహితీవేత్తలు రచన : బి.ఎస్.రాములు పేజీలు: 184 వెల: 100 విషయం : వివిధ పత్రికలు, పుస్తకాల్లో భిన్న సందర్భాల్లో బి.ఎస్.రాములు రాసిన వ్యాసాలు, పీఠికలను ‘దళిత బహుజన సాహితీవేత్తలు’(1990-2012) పేరుతో సంకలనం చేశారు కర్రె సదాశివ్, మొయిలి శ్రీరాములు. ప్రతి వ్యాసం దళిత బహుజన భావజాలాన్ని అంతర్లీనంగా పరిచయం చేస్తుంది. దళిత బహుజన సాహిత్యం ఉధృతంగా వెల్లువెత్తిన కాలాన్ని గుర్తు తెస్తుంది. జన నాట్య మండలికి పూర్వం సాహిత్యం ఎలా ఉండేది? గద్దర్ పాటల్లోని ప్రయోగాల్లో ఉన్న వైవిధ్యం ఏమిటి? ‘అందుకో దండాలు బాబా అంబేద్కరా’ పాటతో బహుజన సాహిత్యానికి ఊపు తెచ్చిన మాస్టార్జీ కలంలోని పదును, నర్రెంగ చెట్టు కింద గళాన్ని సవరించిన శివసాగర్ పాటల లోతు, అలిశెట్టి ప్రభాకర్ అక్షరాయుధంలోని మెరుపు.... ఎన్నో విషయాలు. వ్యక్తుల గురించి చదువుతున్నట్లుగా ఉంటుంది. వారి వ్యక్తిగతం తెలుసుకున్నట్లుగా ఉంటుంది. కాని మనం చదివింది వ్యక్తిగతం కాదు ‘దళిత సామాజిక చరిత్ర’ అనే ఎరుక పుస్తకం ముగించేలోపు అర్థమవుతుంది. సాహు గురించిన సంస్మరణ వ్యాసం మళ్లీ మళ్లీ చదివిస్తుంది. జయధీర్ తిరుమలరావు అన్నట్లు రెండు దశాబ్దాల తాత్విక, సైద్ధాంతిక చర్చలు, పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. - పాషా ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ, 201, సులేఖ గోల్డెన్ టవర్స్, 2-2-186/53/5, రామకృష్ణ నగర్, బాగ్ అంబర్పేట్, హైదరాబాద్-13; ఫోన్: 8331966987 హృదయ స్పందనల సవ్వడి పుస్తకం : సవ్వడి (వ్యాసాలు) రచన : జి.వి.చక్రవర్తి పేజీలు: 222 వెల:100 ప్రతులకు: సంజీవ్ మీడియా హౌస్, 202, నంది ఎన్క్లేవ్, సిద్దార్థ నగర్, హైదరాబాద్-38; ఫోన్: 97043 33337 విషయం : నేటి సమాజ పోకడలను, విలువల పతనాన్ని, వస్తు సంస్కృతీ వ్యామోహాన్ని, అనుబంధాలు ఆత్మీయతలు పెళుసు బారిపోయిన విధాన్ని చూస్తూ కూర్చోలేని ఒక యదార్థవాది స్పందనలకు అక్షర రూపం ఈ వ్యాససంపుటి. నాడు సాక్షి వ్యాసకర్త పానుగంటి వారిలాగే నిత్యం మన చుట్టూ జరిగే అనేక సంఘటనల్ని, కుపిత నాయిక వాలుజడతో చరపు చరచినట్లు, లోకహితం కోసం చేసిన హృదయాక్రోశమే ఈ సవ్వడి. అయితే సాక్షిలోలా కాలాచార్యుడు, జంఘాల శాస్త్రి, వాణీదాసు, వైశ్యుడు లాంటి నాటకీయ పాత్రలు లేకున్నా, నవరసాల మేళవింపుగా రాసిన వ్యాస కదంబంలో అన్నీ తానై నిలిచాడు రచయిత. ఒళ్లంతా కళ్లు, బొడ్డు చూడు బొడ్డందం చూడు, ఆఫ్టర్నూన్ ఆంటీస్ లాంటి వ్యాసాలు మనలోని నలుపును గుర్తుచేస్తున్నాయి. సంసారం ఓ సాగరం, హింసధ్వని లాంటి వ్యాసాలు బాధ్యతలు మరవవద్దని హితవును చెప్తాయి. గుణమా... ఆ ఒక్కటీ అడక్కు, ఆరో తరగతి ప్రేమికులు, ఉత్తరోత్తరా చెప్పొచ్చేదేమిటంటే... వంటివి మమకారాల్ని, సహాయ సహకారాల్ని అమ్మకాలకు పెట్టవద్దని సందేశమిస్తాయి. - మీరాసాహెబ్ అక్షర గంగ పుస్తకం : స్వరగంగ - ఎం.ఎస్.సుబ్బులక్ష్మి సంపాదకులు : ‘లకుమ’ బుదేశ్వరరావు పేజీలు: 300 వెల: 299 విషయం : ‘ఆమె పాడకపోతే దేవుళ్లకు కూడా తెల్లవారదు/ ఆమె పాట వినబడకపోతే దేశమే తానైన/ ఏ పల్లే లేవదు’ అంటూ సుబ్బులక్ష్మి గురించి లకుమ చెప్పడం అక్షర సత్యం. కర్నాటక సంగీతానికి తన గళ మాధుర్యంతో ప్రపంచవ్యాప్త ఖ్యాతి తేవటమేకాక, భారతరత్న పొందిన తొలి సంగీత కళాకారిణిగా చరిత్రలో శిఖరాయమానంగా ఆమె నిలిచిపోయారు. సుబ్బులక్ష్మి జీవిత, సంగీత ప్రయాణంపై వెలువరించిన పుస్తకం ఇది. ఆధ్యాత్మిక లోకాల్లోకి ప్రయాణింపజేసే ఆమె స్వరాన్ని ఇది ఆసక్తిదాయకంగా వ్యక్తీకరించింది. ఓ రకంగా స్మృతి సంకలనమైన ఈ పుస్తకంలో ‘రాశులు - దుద్దులు - బేసరలు - పెర్ఫ్యూమ్లు - మల్లెపూలు - మట్టిగాజులు- రికార్డులు - జిలుగులు- సంస్కరణలు- ప్రతిష్టలు’ అంటూ చేసిన వ్యాస విభజన లకుమ పరిశోధన దృష్టిని చెబుతుంది. 64 మంది రాసిన వ్యాసాలతోపాటు, మంచి ఫొటోలను పొందుపర్చటం పుస్తకానికి నిండుదనాన్నిచ్చింది. - డా. నూకతోటి రవికుమార్ కొత్త పుస్తకాలు గురజాడ దర్బార్ (ఆధునిక సాహితీ రూపకం) రచన: డా. ద్వానా శాస్త్రి పేజీలు: 32; వెల: 30 ప్రతులకు: కిన్నెర పబ్లికేషన్స్, మద్దాళి గోల్డెన్ నెస్ట్, ఫ్లాట్ 101, 102, 2-2-647/153, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-13. ఫోన్: 040-27426666 1.మమకారం (కథలు) రచన: రేగులపాటి విజయలక్ష్మి పేజీలు: 92; వెల: 90 2.ఈతరం పెళ్లికూతురు (కథలు) రచన: రేగులపాటి కిషన్‌రావు పేజీలు: 130; వెల: 120 ప్రతులకు: కవితా నిలయం, 10-1-436, సంతోష్‌నగర్, రామ్‌నగర్, కరీంనగర్-505001; ఫోన్: 7396036922 నిప్పు కణికలు (కవిత్వం) రచన: మొగిలి స్వామిరాజ్ పేజీలు: 94; వెల: 65 ప్రతులకు: రచయిత, 1-1-1653, రాకాసిపేట్, బోధన్, నిజామాబాద్- 503185; ఫోన్: 9963642205 ప్రతులకు: లకుమ, ప్రెసిడెంట్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ఫౌండేషన్, ఎ.239, హిల్ కాలనీ, నాగార్జున సాగర్, నల్లగొండ జిల్లా; ఫోన్: 08680 276454