breaking news
Bronze Age
-
స్విగ్గీ, జొమాటో ఇప్పటిమాట.. వేల ఏళ్ల క్రితమే!
ఉరుకులు, పరుగుల లైఫ్.. స్విగ్గీనో, జొమాటోనో ఓపెన్ చేయడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టేయడం.. వండుకునే తీరిక లేకనో, కొత్త కొత్త రకాలు తినాలన్న కోరికనో దీనికి కారణం. మరి ఇలా ఫుడ్ ఆర్డర్ చేసి తినడం ఇప్పుడిప్పుడే మొదలైంది కాదంట. ఎప్పుడో మూడు వేల ఏండ్ల కింద కాంస్య యుగంలోనే ఇలా ఆహారం తెప్పించుకుని తినడం మొదలైందని ఆ్రస్టియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ్రస్టియాలోని ఆల్ప్స్ ప్రాంతంలో కాంస్య యుగం నాటి ఓ రాగి గనిలో చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. అప్పట్లో గనుల్లో తవ్వకాలు చేసి రాగిని వెలికితీసేందుకు ఓ ప్రత్యేకమైన కమ్యూనిటీ ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ కమ్యూనిటీ నివసించే ప్రాంతాలు, గనుల్లో వారు కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో పనిముట్ల నుంచి విశ్రాంతి దాకా.. నివాసానికి అవసరమైన చాలా రకాల వస్తువులు, పరికరాలు దొరికాయి. అప్పట్లో వారు తిని వదలేసిన ఆహార పదార్థాల శిలాజాలు కూడా లభించాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వంట వండటానికి సంబంధించిన వస్తువులుగానీ, ఏర్పాట్లుగానీ కనిపించలేదు. ఇదేమిటని పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. ఈ కమ్యూనిటీ వారంతా వేరే ప్రాంతం నుంచి ఫుడ్ తెప్పించుకుని తినేవారని తేల్చారు. వంట రెడీ చేసి, తెచ్చి పెట్టే పనిని మరో కమ్యూనిటీ వారు చేసేవారని అంచనా వేస్తున్నారు. పరిశోధనల చిత్రం (క్రెడిట్ : పీటర్ ట్రెబ్స్చే, యూనివర్సిటీ ఆఫ్ ఇన్స్బ్రక్) -
ఆ సమాధి ఏ కాలానిది?!
సాక్షి, ఏథెన్స్ : మానవ జాతి వృద్ధి ఎక్కడ జరిగింది..? మనిషి ప్రయాణం ఎక్కడనుంచి ఎక్కడకు సాగింది? ప్రపంచంలో పురాతన నాగరికతలు ఏవి? మనిషి నేడు సాధించిన టెక్నాలజీకన్నా.. ఇనుప, కాంస్య యుగంలోవారే.. అధికంగా సాధించారా? ఇటువంటి ప్రశ్నలు మనిషిని అప్పుడప్పుడూ వేధిస్తుంటాయి.. అందుకు అనుగుణంగానే ప్రపంచంలో ఏదోమూల ఏదో ఒక వింత, విశేషం బయటపడుతూ ఉంటుంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్కు 100 కిలోమీటర్ల దూరంలో అత్యంత పురాతన మైనటొక సమాధి బయటపడింది. పురాతనం అనుకుంటే.. ఏదో సాదాసీదా కాదు.. సుమారు 3,500 ఏళ్ల నాటిది అని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. ఈ సమాధి కాంస్య యుగం నాటికి అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమా సమాధి? ఏమిటా కథ? ఈ సమాధి ( చిన్నసైజు డబుల్‌బెడ్ రూం అంత ఉంటుంది) నాటి గ్రీస్‌లోని సంపన్నవర్గానికి చెందినదిగా పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సమాధిలో స్కెల్టెన్కు అత్యంత ఖరీదైన బంగారు ఆభరణాలు, చేతులకు స్వర్ణ కంకణాలు, ఇతర విలువైన సామగ్రి అందులో లభించింది. సమాధిలో..! సమాధిలో చనిపోయిన వ్యక్తికి 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని, మిసీనియన్ నాగరికతకు చెందిన వ్యక్తిగా పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సమాధిలో ఆభరణాలతో పాటు మృణ్మయపాత్రలు, విల్లంబులు, పురాతన మద్యం, బాణసంచా ఉన్నాయి సమాధి నిర్మాణం సమాధి నిర్మాణం కూడా అత్యంత పటిష్టంగా నిర్మించారు. సమాధిని పగలగొట్టడానికి కూడా సాధ్యం కాకుండా.. పెద్దపెద్ద బండరాళ్లతో నాలుగువైపులా.. పైన నిర్మించారు. సమాధి 21 అడుగుల ఎత్తు ఉంటుంది. చుట్టూ బంకమట్టి, ఇతర పదర్థాలతో సిమెంట్లా ప్లాస్టింగ్ చేశారు. ఈ సమాధి వల్ల కాంస్యయుగంలో ముఖ్యంగా గ్రీకు నాగరికత ఎలా విలసిల్లిందో తెలుసుకోవచ్చని ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆనాటి సామాజిక, ఆర్థిక, జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.