breaking news
The British government
-
తెరుచుకున్న భగత్ గది
న్యూఢిల్లీ: బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన విప్లవయోధుడు భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీ వర్సిటీలో అప్పట్లో ఆయన్ను నిర్బంధించిన గదిలోకి బుధవారం విద్యార్థులను అనుమతించారు. వైస్ రీగల్ లాడ్జ్ ఎస్టేట్‌గా పిలిచే ఆ భవంతిలోని ఓ గదిలో 1931లో భగత్‌సింగ్‌ను ఒకరోజుపాటు బ్రిటిష్ప్రభుత్వం నిర్బంధించింది. అనంతరం ఇప్పటి పాక్‌లో ఉన్న లాహోర్ జైలులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను మార్చి 23న ఉరితీశారు. 1933లో ఎస్టేట్‌ను ఢిల్లీవర్సిటీకి అప్పగించగా అనంతరకాలంలో దీనిని వైస్‌చాన్స్‌లర్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఐదు స్కూళ్లకు చెందిన మొత్తం 100 మంది విద్యార్థులను గదిలోకి అనుమతించారు. భగత్‌సింగ్ స్వయంగా రాసిన ఉత్తరాలను గదిలో ప్రదర్శనకు ఉంచారు. ఆ గదిని ప్రజల సందర్శనార్ధం తెరిచే ఉద్దేశంలేదని వర్సిటీ వీసీ యోగేశ్ త్యాగి స్పష్టంచేశారు. పోరాటంచేసే ప్రతి ఒక్కరూ భగత్‌సింగ్ నుంచి స్పూర్తిపొందుతారన్నారు. -
అర్ధరాత్రే ముహూర్తం ఎందుకు?!
మనదేశానికి 1947 ఆగస్టు 14వ తేదీ చివరి ఘడియల్లో, 15 తేదీ ప్రారంభ ఘడియల్లో స్వాతంత్య్రం వచ్చింది. అంటే ఆ అర్ధరాత్రి బ్రిటిష్ నుండి మనదేశానికి అధికార బదిలీ జరిగింది. మన రాజ్యాంగ అసెంబ్లీ మన పాలనాధికారాన్ని స్వీకరించింది. మరి ఇదంతా ఆ అర్ధరాత్రే ఎందుకు జరిగినట్లు? 14వ తేదీన కాని, 15వ తేదీ ఉదయం కాని ఎందుకు జరగన ట్లు అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇలా జరగటం వెనుక చాలా ఆసక్తికరమైన వ్యవహారం చోటుచేసుకుంది. 1947 ఆగస్టు 15న భారతీయులకు అధికార బదిలీ జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే భారతీయులకు అందునా హిందువులకు విశ్వాసాలు, నమ్మకాలు ఎక్కువ. గ్రహాలస్థితిగతులు మానవజీవితంపై ప్రభావం చూపుతాయనే బలమైన విశ్వాసం మరీ ఎక్కువ. అందుకే ప్రతి శుభకార్యానికి ముందేకాక కొన్నింటి ప్రారంభాలకు, రాకపోకలకు కూడా శుభఘడియల కోసం తిథి, నక్షత్రాలు చూస్తుంటారు. ఇలాంటి నమ్మకాలున్న ఢిల్లీలోని ఆనాటి కొందరు జాతీయ నాయకులకు ఆగస్టు 15 మంచిదేనా అని తెలుసుకోవాలనిపించింది. వెంటనే అక్కడి పండితులను సంప్రదించారు. ఆగస్టు 15 శుక్రవారం చతుర్ధశి. పైగా రాత్రి ఏడున్నర గంటల తరువాత అమావాస్య కనుక ఆ రోజు మంచిది కాదని పండితులు స్పష్టం చేశారు. 14వ తేదీ ఎంతో శుభదినమని తెలిపారు. ఆ తరువాత 17వ తేదీ మంచిదన్నారు. దీంతో ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఆ ప్రముఖులకు అంతుపట్టలేదు. పోనీ 14వ తేదీనే అధికార మార్పిడి జరిపిద్దామా అంటే ఆ రోజు లార్డ్ మౌంట్‌బాటన్ కరాచీలో పాకిస్తాన్‌కు అధికార మార్పిడి కార్యక్రమంలో ఉంటారు. ఆ రోజు రాత్రికి కాని ఆయన ఢిల్లీకి బయలుదేరరు. పైగా ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్య్రమని బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఈ సంకట స్థితిపై తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలో ప్రముఖ చరిత్రకారుడు, మలయాళ పండితుడు, హిందూమతాచారాలు, సాంప్రదాయాలపై విస్తృతమైన, లోతైన పరిజ్ఞానం కలిగిన కె.ఎం.పణిక్కర్ ఒక పరిష్కారం సూచించారు. పణిక్కర్ పరిష్కారం ప్రకారం రాజ్యాంగ సభ 14వ తేదీ రాత్రి 11 గంటలకు సమావేశమవుతుంది. సరిగ్గా 12 గంటలు కొట్టగానే బ్రిటిష్ ప్రభుత్వం నుండి అధికారాన్ని స్వీకరిస్తుంది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ముందుగానే ప్రకటించిన ట్లు ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్ర ప్రదానం చేసినట్లవుతుంది. అధికార మార్పిడి జరిగే ఆ ఘడియలు గ్రహస్థితులను సంతృప్తి కలిగించేవి, బ్రిటిష్ ప్రభుత్వానికి తేదీలను మార్చాల్సిన అవసరం లేనివి కావటంతో ఆ పరిష్కారం అందరికి ఆమోదయోగ్యమైంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషమేమిటంటే శుభ దినాన ఏర్పడిన పాకిస్తాన్ ఆ తరువాత 20 ఏళ్లకు రెండుదేశాలుగా విడిపోవడం. రాజ్యాంగ సభలో చర్చించకుండానే మౌంట్‌బాటన్ నియామకం! అంతకుముందు 1947 జులై 31వ తేదీన రాజ్యాంగ నిర్ణయ సభలో 1947 ఆగష్టు 14వ తేదీ అర్ధరాత్రి జరగనున్న కార్యక్రమంపై సభాధ్యక్షుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటన చేశారు. ఆ రాత్రి 12గంటల సమయానికి ముందు సభానాయకుడు జవహర్లాల్ నెహ్రూ వైస్రాయ్ భవనానికి వెళ్లి భారత గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ నియామక సిఫారసును తెలియజేసి ఆమోదించవలసిందిగా లార్డ్ మౌంట్‌బాటన్‌ను కోరతారని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఆ తరువాత కొద్ది క్షణాలకు మహావీర్ త్యాగి అనే సభ్యుడు లేచి మౌంట్‌బాటన్‌కు గవర్నర్ హోదా గురించి ఈ సభ ఏనాడూ చర్చించలేదని, ఆయన భారత గవర్నర్ జనరల్ కావడాన్ని ఏనాడూ సభ అంగీకరించడం కానీ, ఆ మేరకు సభ తీర్మానం ఆమోదించడం కానీ చేయనందున ఆయనను గవర్నర్ జనరల్‌గా ఈ సభ ఆహ్వానించాలని కోరడం నుండి సభను మినహాయించాలని కోరారు. అందుకు ఈ విషయాన్ని ఒక తీర్మాన రూపంలో సభ ముందుంచుతానని సభాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలుపగా చాలామంది సభ్యులు లేచి వద్దు, వద్దంటూ ఆ విషయం అధ్యక్షుని నిర్ణయానుసారమే జరగాలని కోరారు. ఆ విధంగా రాజ్యాంగ నిర్ణయసభలో చర్చ, అంగీకారం, తీర్మానం లేకుండానే భారత గవర్నర్ జనర ల్గా లార్డ్ మౌంట్‌బాటన్ పదవీ స్వీకారం చేశారు. అధికార బదిలీ జరిగిన తీరు ఇక 1947 ఆగష్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నుండి భారత్ అధికార బదిలీలు జరిగిన కార్యక్రమ తీరు ఇలా ఉంది. ఆ రాత్రి 11 గంటలకు రాజ్యాంగ నిర్ణయ సభ సమావేశం ప్రారంభమయింది. సభాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ ప్రసంగించారు. ఆ తరువాత అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కొట్టగానే అధికార బదిలీ జరిగినట్లుగా సభ్యులంతా చేయవలసిన ప్రతిజ్ఞాపాఠంపై సభా నాయకుడు జవహర్లాల్ నెహ్రూ తీర్మానం ప్రతిపాదించారు. దానిని సభాధ్యక్షుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. మరికొన్ని క్ష ణాలలో 12గంటలు కొట్టగానే సభాధ్యక్షునితో సహా సభ్యులంతా నిల్చుని అధ్యక్షుడు ప్రతిజ్ఞాపాఠంలోని ఒక్కో వాక్యాన్ని చదవుతుండగా సభ్యులు దానిని హిందీ, ఇంగ్లీషులలో పునరుచ్ఛాటన చేశారు. ఆ తరువాత భారత పరిపాలనాధికారాన్ని రాజ్యాంగ నిర్ణయ సభ స్వీకరించింది. అలాగే ఆగష్టు 15నుండి భారత గవర్నర్ జనరల్‌గా లార్డ్ మౌంట్‌బాటన్ ఉండాలన్న సిఫారసును సభ ఆమోదించింది. ఈ విషయాన్ని మౌంట్‌బాటన్‌కు సభానాయకుడు నెహ్రూ తెలియపరుస్తారని సభాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. మరుక్షణం సభకు భారత జాతీయ పతాకాన్ని హన్స్మెహతా సమర్పించారు. అలాగే ఈ అధికార బదిలీని పురస్కరించుకుని భారత్‌లోని చైనా రాయబారి డాక్టర్ చిన్ ల్యున్ లో రచించిన గేయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా సభ ఆమోదించింది. ఆ తరువాత ‘సారే జహాసే అఛ్ఛా హిందుస్తాన్ హమారా’ గేయంలోని మొదటి కొన్ని పంక్తులను, జనగణమనలోని ప్రారంభ వాక్యాలను సుచేతాకృపలానీ ఆలాపించారు. ఆ వెంటనే సభ 15వ తేదీ ఉదయం 10గంటలకు వాయిదా పడింది. ఇదీ ఆ రాత్రి మనకు అధికార బదిలీ జరిగిన తీరు. - కె.ఎస్.ఎన్. ప్రసాద్ అర్ధరాత్రి అధికారం... ఉదయం పతాకావిష్కరణ 15వ తేదీ ఉదయం 10గంటలకు గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ రాజ్యాంగ నిర్ణయ సభా ప్రవేశం చేశారు. సమావేశం ప్రారంభమవగానే భారత స్వాతంత్య్రం సందర్భంగా వివిధ దేశాధిపతులు, ప్రభుత్వాధినేతల నుండి శుభ సందేశాలు వినిపించారు. గవర్నర్ జనరల్, సభాధ్యక్షుల ప్రసంగాలు పూర్తయ్యాక సభా భవనం (నేటి పార్లమెంట్ భవనం)పై భారత జాతీయ పతాక ఆవిష్కరణకు గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ సంకేతమిచ్చారు. మరుక్షణమే తుపాకీలు పేల్చిన శబ్దం వినిపించింది. ఆ వెంటనే పార్లమెంట్ భవనంపై జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. సభ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. ఇదీ మన స్వతంత్ర భారత పాలనాధికారం మొదలైన తీరు. ఆదిలోనే హంసపాదు ఈ సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గుర్తు చేసుకోవాల్సి ఉంది. 14వ తేదీ అర్ధరాత్రి వైస్రాయ్ భవనానికి నెహ్రూ వె ళ్లి భారత గవర్నర్ జనరల్‌గా నియామక సిఫారసును మౌంట్‌బాటన్‌కు తెలియజేశారు. ఆ తరువాత తన మంత్రిమండలి సభ్యుల పేర్లున్న జాబితా గల ఒక కవర్‌ను ఆయనకు నెహ్రూ అందజేశారు. సందర్శకులంతా వెళ్లాక మౌంట్‌బాటన్ ఆ కవర్‌ను విప్పగా అందులో ఏమీ లేదు! వట్టి ఖాళీ కవర్ దర్శనమిచ్చి ఆయనను ఆశ్చర్యపరిచింది. ఆ కవర్‌ను సిద్ధం చేసినవారెవరో అందులో జాబితా పత్రాన్ని పెట్టడం మర్చిపోయారు. ఇదొక తమాషా సంఘటనలా అనిపించినా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నెహ్రూ గారి హయాం ప్రారంభమైంది. -
శాంతిశీల సమర యోధుడు!
సంక్షిప్తంగా: మహాత్మాగాంధీ ఇరవయ్యవ శతాబ్దపు భారతదేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ప్రభావితం చేసిన అత్యంత శక్తిమంతుడైన స్వాతంత్య్రోద్యమ నాయకుడు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ‘జాతిపిత’గా ఆయనను భావించినప్పుడు ఒక్క భారత్‌కే ఆయన పరిమితమైన వ్యక్తిగా అనిపించినప్పటికీ, ‘మహాత్మ’గా ఆయనను అవతరింపజేసిన సిద్ధాంతాలు.. అహింస, సత్యాగ్రహం.. విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందినవి! ఈ రెండు సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన భారత జాతీయోద్యమాన్ని ఇంచుమించుగా ఒక్కతాటిపై నడిపించారు. ప్రాథమికంగా హైందవ మత విలువలను అనుసరించిన గాంధీజీ క్రమేణా జైన, క్రైస్తవ మతబోధనలకూ; టాల్‌స్టాయ్, థోరో రచనలకూ ప్రభావితులై అంత్యసారంగా ‘సత్యాగ్రహ’ సిద్ధాంతాన్ని పైకి తేల్చారు. సత్యాగ్రహం అంటే... దౌర్జన్యాలపై హింసకు తావులేని ఒక బలమైన నిరసన విధానం. 1920 నాటికి గాంధీజీ భారత రాజకీయాలలో ముఖ్య నాయకుడయ్యారు. ఆయన నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టింది. శాంతియుతమైన సహాయ నిరాకరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపును అందుకుని బ్రిటిష్ వస్తువులను, సంస్థలను బహిష్కరించిన వేలాదిమంది భారతీయులు అరెస్టయ్యారు. 1922లో గాంధీజీ కూడా అరెస్టయ్యారు. ఆయనకు ఆరేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే రెండేళ్లకే విడుదలయ్యారు. అనంతరం రాజకీయాల నుంచి వైదొలిగి, అప్పటికే క్షీణించి ఉన్న హిందూ-ముస్లిం సంబంధాల పునరుద్ధరణకు అంకితమయ్యారు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించినందుకు నిరసనగా దండి ప్రాంతంలో సముద్రపు ఒడ్డుకు యాత్ర జరిపి, తమ ఉప్పును తామే తయారు చేసుకుంటామన్న సంకేతాన్ని బ్రిటిష్ వారికి పంపారు గాంధీజీ. తర్వాత 1934లో పార్టీకి రాజీనామా చేశారు. తన అహింసా సిద్ధాంతాన్ని పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నందుకు ఆవేదన చెంది ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 1945 నాటికి బ్రిటిష్ ప్రభుత్వానికీ, భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ‘మౌంట్‌బాటన్ ప్లాన్’ తయారైంది. ఆ ప్రకారం 1947లో బ్రిటిష్ ఇండియా విభజన జరిగి ఇండియా, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర రాజ్యాలు మత ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. గాంధీజీ ఈ విభజనను వ్యతిరేకించారు. విభజన కల్లోలాన్ని చల్లబరిచేందుకు ఆయన కలకత్తా, ఢిల్లీలలో నిరాహారదీక్షలు చేపట్టారు కూడా. అటు, ఇటు.. ప్రజలు, ప్రభుత్వాలు సద్దుమణిగే సమయంలో 1948 జనవరి 30న ఒక హిందూ అతివాది పేల్చిన బులెట్లకు గాంధీజీ నేలకొరిగారు. ఆయన మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా? మనిషి గాంధీమార్గంలో నడుస్తున్నంత కాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే.