కార్ల అమ్మకాలు కుప్పకూలాయి..
బ్రెగ్జిట్ దెబ్బతో కార్ల అమ్మకాలు కుప్పకూలాయి. నాలుగేళ్లలో రెండోసారి కొత్త కార్ల అమ్మకాలు తలకిందులయ్యాయి. జూన్ లో కేవలం 2,55,766 మోటార్స్ మాత్రమే అమ్ముడు పోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 0.8శాతం తక్కువగా నమోదయ్యాయి. ప్రైవేట్ కొనుగోలుదారుల అమ్మకాలు కూడా 4.5శాతం పతనమైనట్టు ట్రేడ్ బాడీ మోటార్ తయారీదారుల, ట్రేడర్ల సొసైటీ(ఎస్ఎమ్ఎమ్ టీ) తెలిపింది. గత అక్టోబర్ నుంచి 0.8శాతం పడిపోవడం ఇదే మొదటిసారని, 2012 ఫిబ్రవరి తర్వాత ఇది రెండో పతనమని ట్రేడ్ బాడీ పేర్కొంది.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు అనుకూలంగా ప్రజాభిప్రాయ తీర్పు రావడంతో, యూకే మోటార్ పరిశ్రమలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ భయాందోళనలు కొత్త కార్ల మార్కెట్ పై ప్రభావం చూపించాయని ఎస్ఎమ్ఎమ్ టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ హావెస్ చెప్పారు. మొదటి ఆరునెలలు రికార్డు స్థాయిలో డిమాండ్ ను చూశామని, కానీ రెండో త్రైమాసికంలో ఊహించని విధంగా డిమాండ్ పడిపోవడం చూస్తున్నామని ఆయన అన్నారు. మొదటి ఆరు నెలలు అమ్మకాలు 3.2శాతం ఎగిశాయి.
రెఫరెండం ఫలితంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, కార్ల అమ్మక వ్యాపారాలపై ప్రభావం చూపుతున్నాయని, ఈ ఫలితంతోనే కార్ల అమ్మకాలు మందగించాయని ఐహెచ్ఎస్ గ్లోబల్ ఇన్ సైట్ ఎకనామిస్ట్ హావర్డ్ ఆర్చర్ తెలిపారు. కొత్త కార్ల కొనుగోలను కస్టమర్లు చేపట్టకపోవడం, కారు మార్కెట్ లో విశ్వాసాన్ని దెబ్బతీసి అనిశ్చిత పరిస్థితిని ప్రతిబింబిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.