breaking news
boycott polling
-
ఓటు అడగలేదని పోలింగ్ బహిష్కరణ
మదనపల్లె : పేదలు నివసించే ప్రాంతమని వివక్ష చూపుతూ, కనీసం ఓటు అడిగేందుకు రాకపోవడంతో మూకుమ్మడిగా అందరూ కలిసి ఓట్లు వేసేందుకు వెళ్లమని పోలింగ్‌ను బహిష్కరించిన సంఘటన పట్టణంలోని విజయనగర్ కాలనీలో జరిగింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో స్థానిక విజయనగర్ కాలనీ సిమెంట్ రోడ్డు ప్రాంతంలో సుమారు 100 మందికి పైగా మహిళలు ఓటు వేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2, 3 వార్డుల పరిధిలో తమ కాలనీ వస్తుందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు అడిగేందుకు తమ వార్డులకు రాలేదన్నారు. నాయకులు వస్తే వారికి తమ సమస్యలను చెప్పి, గెలిచిన తర్వాత పరిష్కరించమని అడుగుదామనుకుంటే ఎవరూ అటువైపు చూడకపోవడంతో మా ఓట్లు వారికి అవసరం లేదనుకున్నారేమోనని ఓటుకు వెళ్లడం మానుకున్నామని చెప్పారు. -
పోలింగ్ కు 300 గ్రామాలు దూరం
పురులియా: పశ్చిమ బెంగాల్ లోని పురులియా ప్రాంతంలో 300లకు పైగా గ్రామాలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాయి. ఇప్పటికీ తమ గ్రామాలకు విద్యుత్, తాగునీరు ఇవ్వనందుకు నిరసనగా ఓటర్లు ఎన్నికల పోలింగ్ కు దూరంగా ఉన్నారు. తమకు పాలకులు ఇచ్చిన హామీలు నిలుపుకోలేదని ఈ గ్రామాలకు చెందిన ప్రజలు తెలిపారు. ఇప్పటికీ తమ ఊళ్లలో కరెంట్ లేదని, తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని, తామెందుకు ఓటు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది.