షాకైన ఐటీ: ఫామ్‌హౌజ్‌లో 15 ఎల్ఈడీ టీవీలు
న్యూఢిల్లీ : పన్నులు ఎగవేస్తూ.. కోట్లకు కోట్లు ఆర్జిజిస్తున్న అధికారుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ రాష్ట్రాల్లో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఖరీదైన ఆస్తులు, కార్లు, వస్తువుల బయటపడ్డాయి. గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ వంటి ప్రాంతాల చెందిన కొంతమంది అధికారులపై ఆదాయపు పన్ను దాడులు జరిపింది. ఈ రైడ్స్‌లో 20 కోట్ల రూపాయల బ్లాక్ ఇన్కమ్ వెలుగులోకి వచ్చినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న అధికారుల ఫామ్‌హౌజ్‌ల్లో లెక్కలో చూపని చాలా పెట్టుబడుల డాక్యుమెంట్లను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇతర నగరాల్లో ఉన్న అధికారుల స్థిర ఆస్తులను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
రేంజ్ ఓవర్, ఆడియా, బీఎండబ్ల్యూ లాంటి ఖరీదైన వాహనాలను, ఖరీదైన ఆస్తులను ఈ పన్ను చెల్లించని అధికారులు కలిగి ఉన్నారట. ఓ ఫామ్‌హౌజ్‌లో ఏకంగా 15 పెద్దపెద్ద ఎల్ఈడీ టెలివిజన్ సెట్స్ ఫిట్ చేసి ఉన్నాయని, అవి చూసి తాము షాకయ్యామని తెలిపారు. ఆ ఫామ్‌హౌజ్‌లోనే ఎంతో పకడ్బందీగా నిర్మించిన జిమ్, గెస్ట్ హౌజ్, నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను అక్కడ గుర్తించినట్టు పేర్కొన్నారు.
డెహ్రడూన్‌లోని ఉత్తరప్రదేశ్ రాజకీయ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తన అధికారిక పదవిని ఉపయోగించుకుని పన్ను ఎగొడుతున్నాడనే ఆరోపణల మీద ఈ దాడుల నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. మరో సెర్చ్ ఆపరేషన్‌లో యూపీలోని సిద్దార్థనగర్ కు చెందిన లోకల్ బాడీ చైర్మన్‌పై కూడా దాడులు జరిపినట్టు తెలిసింది. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పథకాల గ్రాంట్స్ ను ఆ చైర్మన్ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని, ఇతనికి రెండు పెట్రోల్ బంకులు, ఓ గ్యాస్ ఏజెన్సీ ఉన్నట్టు గుర్తించినట్టు తేల్చారు. కాన్పూర్ కు చెందిన రోడ్డు రవాణా శాఖ అధికారిపై, నోయిడాకు చెందిన సీనియర్ అధికారి ఇళ్లపైనే ఐటీ దాడులు చేసింది.