breaking news
Biodegradable fertilizer
-
‘లీఫ్రానిక్స్’! వాడేసి పడేస్తే మట్టిలో కలిసిపోతాయి.. ఇవే భవిష్యత్ గ్యాడ్జెట్స్!
మన స్మార్ట్ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు పాడైపోతే చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ వ్యర్థాలుగా మిగిలిపోతాయి కదా. అలా కాకుండా ప్లాస్టిక్ స్థానంలో రాలిపోయిన ఆకుల ఈనెలను సర్క్యూట్ బోర్డులుగా వాడుకుని సర్క్యూట్లను తయారుచేసే కొత్త సైన్స్ మ్యాజిక్కే లీఫ్ట్రానిక్స్. అన్బి‘లీఫ’బుల్ అనిపిస్తోందా! వాడేశాక, లేదా కాలం తీరిపోయాక ఈ లీఫ్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని చెత్తలో పడేసినా, ప్లాస్టిక్‌లా అవి పర్యావరణాన్ని పాడుచేయకుండా మట్టిలో సహజంగానే కుళ్లిపోయి, ఎరువుగా మారిపోతాయి. అంటే, రాబోయే తరాల వారి కోసం ఒక ఆకుపచ్చని భవిష్యత్తు ఎదురు చూస్తోందన్నట్లే!ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇదొక కొత్త, ప్రకృతి హితమైన సాంకేతికత. సాధారణంగా మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల సర్క్యూట్ బోర్డులు, ప్లాస్టిక్ మెటీరియళ్లు పర్యావరణానికి చాలా హాని చేస్తాయి. అవి త్వరగా భూమిలో కలిసిపోవు. దీనికి పరిష్కారంగా జర్మనీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆకుల సహాయంతో ఎలక్ట్రానిక్స్‌ను కనిపెట్టే ప్రయోగాల్లో తలమునకలై ఉన్నారు. ఈ టెక్నాలజీనే ‘లీఫ్ట్రానిక్స్’ అంటున్నారు.ఆకులలో ఉండే ‘ఈనెల’ నెట్వర్క్ నిర్మాణం చాలా గట్టిగా, ప్లాస్టిక్ లాంటి మన్నికను కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఆకులలోని మెత్తని భాగాన్ని తొలగించి, ఆ ఈనెల అస్థిపంజరం లాంటి నిర్మాణాన్ని ప్లాస్టిక్ లేదా గాజుకు బదులుగా ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ తయారు చేయడానికి వాడేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ టెక్నాలజీతో తయారైన ఎలక్ట్రానిక్ పరికరాలు భూమిలో సులభంగా కలిసిపోతాయి. దీనివల్ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఇ–వేస్ట్) చాలా వరకు తగ్గుతాయి.రెండేళ్ల క్రితమే దాదాపుగా విజయంజర్మనీలోని ప్రఖ్యాత ‘డ్రెస్డెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ’ శాస్త్రవేత్తలు 2024 నవంబరులో ఈ టెక్నాలజీని ఒక కొలిక్కి తెచ్చారు. ఈ పరిశోధన బృందానికి ప్రొఫెసర్ కార్ల్ లియో, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రాకేష్ ఆర్. నాయర్ నేతృత్వం వహించారు. లీఫ్ట్రానిక్స్పై వారి కృషికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రసిద్ధ సైన్స్ జర్నల్ ‘సైన్స్ అడ్వాన్సెస్’ లో ప్రచురితమయ్యాయి. భూమిపై నానాటికీ వేగంగా పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈ బృందం రీసెర్చ్ ప్రారంభమైంది.పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు మొదట మగ్నోలియా చెట్ల ఆకులను తీసుకుని, అందులోని మెత్తని కణాలను పూర్తిగా తొలగించారు. కేవలం బలమైన ఈనెల అస్థిపంజరం మాత్రమే మిగిలేలా చేశారు. ఆ అస్థిపంజరం ‘లిగ్నోసెల్యులోజ్’ అనే పదార్థంతో కూడి ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన ఆ ఈనెల నిర్మాణానికి పాలిమర్ కోటింగ్ ఇచ్చారు. ఎలాగంటే, ఈనెను ‘ఇథైల్ సెల్యులోజ్’ అనే ప్లాస్టిక్ లాంటి గట్టి, పర్యావరణ హితమైన (భూమిలో కలిసిపోయే) ద్రవ పదార్థంలో ముంచటం ద్వారా! సాధారణంగా పర్యావరణానికి హాని చేయని పదార్థాలు త్వరగా వేడికి కరిగిపోతాయి.కానీ, ఈ ఆకు ఈనెలల ఆధార (బేస్) నిర్మాణం వల్ల ఆ ‘ఇథైల్ సెల్యులోజ్’ పదార్థానికి ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే దృఢమైన బలం చేకూరింది! దీనిపై లేజర్ కటింగ్ ద్వారా సర్క్యూట్లు ప్రింట్ చేసి, ఎలక్ట్రానిక్ విడిభాగాలను అమర్చారు. ఈ విధంగా ఆకుల సహజ నిర్మాణాన్ని ఉపయోగించి, పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులను తయారు చేసే విధానాన్ని కనిపెట్టి, దానికి ‘లీఫ్ట్రానిక్స్’ అని పేరు పెట్టారు. వాడేసిన తర్వాత వాటిని పారేస్తే సుమారు నెల రోజుల్లో శిథిలమైపోయి, మట్టిలో కలిసిపోతాయి.మాగ్నోలియా చెట్టు కథలీఫ్ట్రానిక్స్ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కార్ల్ లియో... డ్రెస్డెన్ యూనివర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్. ఆర్గానిక్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నవారు. ఆయనతో పాటుగా డాక్టర్ హాన్స్ క్లీమాన్ అనే శాస్త్రవేత్త అదే విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ గ్రూప్ లీడర్‌గా ఉన్నారు. ఆయన కూడా ప్రొఫెసర్ కార్ల్ లియో ఆధ్వర్యంలో పనిచేస్తూ, ఈ లీఫ్ట్రానిక్స్ ప్రాజెక్ట్‌లో కీలకమైన పాత్ర పోషించారు. వీళ్లిద్దరూ ఒకే విశ్వవిద్యాలయంలో, ఒకే ల్యాబ్‌లో కలిసి పనిచేస్తున్న సహచర శాస్త్రవేత్తలు అయినప్పటికీ ఈ లీఫ్ట్రానిక్స్ అనే ఐడియా వచ్చింది మాత్రం వీరిద్దరికీ కాదు. అక్కడే పీహెచ్డీ చేసిన రాకేష్ నాయర్‌కి వచ్చిన ఆలోచన అది! యూనివర్సిటీ ప్రాంగణంలోని మాగ్నోలియా చెట్టు కింద నడుస్తున్నప్పుడు రాకేష్‌కి లీఫ్ట్రానిక్స్ ఆలోచన తట్టింది. అంటే లీఫ్ట్రానిక్స్ అనే భావన ఏ రసాయన ప్రయోగశాలలోనో పుట్టలేదు. యూనివర్సిటీ ఆవరణలోని ఒక మాగ్నోలియా చెట్టు కింద జీవం పోసుకుంది.దానికి ముందరి కథ..!క్లీమాన్ దగ్గర పీహెచ్డీ చేసిన డాక్టర్ రాకేష్ నాయర్, ప్లాస్టిక్ లేదా గాజుకు బదులుగా పర్యావరణంలో సులభంగా కుళ్లిపోయే, లేదా శిథిలమైపోయే సహజ పదార్థాల కోసం వెతుకుతున్నారు. ఇద్దరూ కలిసి రకరకాల కాగితాలు, ప్లాస్టిక్, రబ్బరు, నైలాన్ పాలిథిన్ కవర్లను, సెల్యులోజ్‌ను పరీక్షించినప్పటికీ, ఎలక్ట్రానిక్స్ తయారీలో అవసరమైన వేడిని అవి తట్టుకోలేక కరిగిపోవటమో లేదా వంకరపోవటమో జరిగింది. ఏం చేయాలా అని సతమతమవుతున్న సమయంలో, రాకేష్ నాయర్ ఒక రోజు మాగ్నోలియా చెట్టు పక్కనుండి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే ఆయనకు.. ప్రకృతిలోని చెట్ల ఆకులు ఈ సమస్యకు పరిష్కారం చూపగలవనే ఆలోచన వచ్చింది.ప్రయోగశాలలో నిర్ధారణమాగ్నోలియా ఆకులు చాలా గట్టిగా, బలమైన ఈనెల నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. నాయర్ వెంటనే ఆ ఆకులు సేకరించి ల్యాబ్‌కి తీసుకెళ్లారు. ఆకులపై ఉన్న మెత్తని భాగాన్ని తొలగించి, కేవలం బలమైన ఈనెల అస్థిపంజరాన్ని మాత్రమే మిగిల్చారు. ఆ ప్రకృతి సిద్ధమైన ఈనెల నిర్మాణం, పర్యావరణ హితమైన పదార్థాలకు 180 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుందని కనుగొన్నారు. అలా ఆ మాగ్నోలియా చెట్టు కింద కలిగిన చిన్న ఆలోచనే నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ‘లీఫ్ట్రానిక్స్’కు దారితీసింది!ఐదు శాస్త్ర విభాగాలు కలవాలిలీఫ్ట్రానిక్స్ సాంకేతికత విజయవంతమై, ల్యాబ్ నుండి మన రోజువారీ వినియోగంలోకి రావాలంటే ప్రధానంగా 5 ముఖ్యమైన శాస్త్ర విభాగాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది.అవి: మెటీరియల్స్ సైన్స్, బయో–మెటీరియల్స్ ఇంజనీరింగ్ (ఆకుల నుండి రసాయనాలను తొలగించి, కేవలం గట్టి పీచు చట్రాన్ని వేరు చేయడం; అది తేమకు, వేడికి దెబ్బతినకుండా స్థిరపరచడం ఈ విభాగం బాధ్యత); ఆర్గానిక్–ఫ్లెక్సిబుల్ ఎలక్టాన్రిక్స్ (సహజమైన ఆకు ఉపరితలంపై ప్రవహించే వెండి/రాగి లిక్విడ్ ఇంక్‌లు, విద్యుత్ ప్రసరించే ఆర్గానిక్ పొరలు, సర్క్యూట్లు, ఒలెడ్ డిస్ప్లేలను డిజైన్ చేయడానికి ఈ శాస్త్రం అవసరం); ప్లాంట్ బయాలజీ–బయోమిమెటిక్స్ (ఏ రకం ఆకులు, వాటి ఈనెల ఆకారాలు ఎలక్ట్రానిక్స్‌కు బాగా సరిపోతాయో అధ్యయనం చేయడం, మొక్కల కణజాలం, వాటి బలాన్ని అర్థం చేసుకోవడంలో ఈ శాస్త్రం తోడ్పడుతుంది); కెమికల్ ఇంజనీరింగ్– సర్ఫేస్ సైన్స్ (ఆకు పొరలపైన లోహపు మార్గాలు ఊడిపోకుండా ఉండేలా చూడటం, లోహాల అణువులు ఆకు కణాల్లోకి వ్యాపించి సర్క్యూట్ పాడవకుండా ఉండేలా కెమికల్ బాండింగ్‌ను నిర్వహించడం ఈ విభాగం కిందకు వస్తుంది); ఎన్విరాన్మెంటల్ సైన్స్–ఎకో టాక్సికాలజీ (ఈ పరికరాలు వాడి పడేసిన తర్వాత మట్టిలో ఎంత త్వరగా కుళ్లిపోతాయి? వీటిలోని లోహాలు మట్టిని లేదా నీటిని విషపూరితం చేస్తాయా? అనే అంశాలను పరిశోధించి పర్యావరణానికి పూర్తిగా సురక్షితమని ధ్రువీకరించటానికి ఈ విభాగం అవసరం).భవిష్యత్ ప్రయోజనాలులీఫ్ట్రానిక్స్ సాంకేతికత అందుబాటులోకి వస్తే, మానవ జీవితం మీద, పర్యావరణంపైన దాని ప్రభావం చాలా విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా ఎలక్టాన్రిక్ వ్యర్థాల సమస్యను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.వ్యవసాయ పొలాల్లో, అడవుల్లో నీటి శాతం, నేల సారం లేదా వాతావరణ మార్పులను పర్యవేక్షించే సెన్సర్లను తయారు చేయవచ్చు. ఇవి పని పూర్తయ్యాక నేలలో కలిసిపోతాయి కాబట్టి వీటిని తిరిగి సేకరించాల్సిన అవసరం ఉండదు.మానవ శరీరంపై అంటించే స్మార్ట్ హెల్త్ ప్యాచెస్, షుగర్ టెస్ట్ స్టిప్స్ర్, ఈసీజీ సెన్సర్ల తయారీలో వాడవచ్చు. ఇవి చర్మానికి ఎలాంటి హానీ చేయవు. ప్లాస్టిక్ వ్యర్థాలను పెంచవు.కొరియర్ ప్యాకింగ్‌లపై వాడే స్మార్ట్ ట్రాకింగ్ ట్యాగ్లు, తాత్కాలిక డిస్ప్లేలు, స్మార్ట్ లేబుల్స్గా వాడొచ్చు.ఆకుల ఈనెల ఆకారాన్ని ఉపయోగించి, వాటిపై రాగి లేదా వెండి పూత పూసి సూక్ష్మక్రిములను సంహరించే సహజమైన ఫిల్టర్లుగా మార్చవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఇ–కోలి వంటి బ్యాక్టీరియాలను నీటి నుండి తొలగిస్తుంది.వంగే స్వభావం ఉండే ఫ్లెక్సిబుల్ సోలార్ ప్యానెళ్లు, సూపర్ కెపాసిటర్లు, తేలికపాటి ఒలెడ్ (ఆర్గానిక్ లైట్–ఎమిటింగ్ డయోడ్) డిస్ప్లేల తయారీలో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం మనం వాడే ఎలక్ట్రానిక్స్ ప్లాస్టిక్, పలు విషపూరితమైన కెమికల్స్‌తో తయారై వేల సంవత్సరాలు మట్టిలో కరగకుండా ఉండిపోతున్నాయి. అలా కాకుండా, లీఫ్ట్రానిక్స్ ద్వారా ‘వాడేసి పడేశాక మట్టిలో కలిసిపోయే’ ఆకుపచ్చని భవిష్యత్తును నిర్మించవచ్చు.తయారీలో ప్రధాన సవాళ్లు ‘లీఫ్ట్రానిక్స్’ అనేది సహజమైన ఆకుల ఈనెల వ్యవస్థను, ప్లాంట్ స్కాఫోల్డ్లను (ఆకుల అస్థిపంజరాలు) ఉపయోగించి పర్యావరణ రహిత, బయోడిగ్రేడబుల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారుచేసే ఒక నూతన సాంకేతిక రంగం కనుక సహజంగానే పరిశోధకులకు కొన్ని సవాళ్లూ ఎదురౌతున్నాయి. మొదటది, ప్రతి ఆకు పరిమాణం, మందం, ఈనెల నిర్మాణం వేర్వేరుగా ఉంటాయి. అందుకే పరిశ్రమలలో ఒకే ప్రమాణంతో మాస్ ప్రొడక్షన్ చేయడం పెద్ద సవాలు. రెండవది, ఆకులలో ఉండే పీచు పదార్థాలు గాలిలోని తేమను త్వరగా పీల్చుకుంటాయి. దీనివల్ల ఆకుల సర్క్యూట్లలో షార్ట్ సర్క్యూట్లు కావడం లేదా పొరలు విడిపోవడం జరిగే అవకాశం ఉంది.మూడు, సాధారణ ఎలక్ట్రానిక్ (ఎఫ్.ఆర్.–4) బోర్డులతో పోలిస్తే ఆకుల పీచు, బయో–పాలిమర్లు అధిక ఉష్ణోగ్రతల వద్ద (ఉదాహరణకు సోల్డరింగ్ చేసేటప్పుడు) దెబ్బతినే అవకాశం ఉంది. నాలుగు, సర్క్యూట్ మార్గాల కోసం వాడే వెండి లేదా రాగి లోహాల సూక్ష్మ అణువులు కాలక్రమేణా ఆకు కణజాలంలోకి విస్తరించి సర్క్యూట్ పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా, లీఫ్ట్రానిక్స్ సాంకేతికత తక్కువ విద్యుత్ వాడే, స్వల్పకాలిక లేదా పునర్వినియోగ పరికరాలకు మాత్రమే అనుకూలం. హై–పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్ల స్థానంలో దీనిని ఇప్పటికిప్పుడే వాడలేము.పదహారేళ్లుగా ప్రయోగాలు!లీఫ్ట్రానిక్స్ను ఆవిష్కరించేందుకు 2010 చివర్ల నాటి నుంచీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఆకుల నిర్మాణాన్ని సోలార్ సెల్స్, సూపర్ కెపాసిటర్లు, ఫ్లెక్సిబుల్ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఉపయోగించడంపై విశ్వవిద్యాలయాలలో గత పదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తొలిసారి 2024 చివరిలో ముందడుగు పడింది! వీరు ఆకుల స్కాఫోల్డ్లపై ఆధారపడి పనిచేసే ‘ఆర్గానిక్ లైట్–ఎమిటింగ్ డయోడ్’ (ఒలెడ్)ను, ట్రాన్సిస్టర్లను విజయవంతంగా తయారు చేసి చూపించారు.ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలు గ్రీన్–టెక్ స్టార్టప్‌లు దీనిని వ్యాపారాత్మకంగా వినియోగంలోకి తీసుకురావడానికి పైలట్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తున్నాయి. లీఫ్ట్రానిక్స్ కేవలం ఒక కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి మన భూమిని రక్షించే ఒక తిరుగులేని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఆకులతో భవిష్యత్ ఎలక్ట్రానిక్స్‌ను నిర్మించడం ద్వారా టెక్నాలజీ అంటే పర్యావరణాన్ని నాశనం చేయడం కాదు, దానితో కలిసి జీవించడమే అని ఈ సాంకేతికత నిరూపిస్తోంది. రాబోయే కాలంలో మనం వాడే గ్యాడ్జెట్స్ పర్యావరణానికి భారం కాకుండా, తిరిగి మట్టికి ప్రాణం పోసేలా మారనున్నాయనే అనుకోవాలి!- సాక్షి స్పెషల్ డెస్క్ఇవి కూడా చదవండి: కొబ్బరిచెట్టు కోసం కేసు.. ‘టీ తాగుతూ మాట్లాడుకోండి’ అన్న కోర్టు! -
తినే నూడుల్స్‌తో పేపర్.. జపాన్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
జపాన్‌లోని కగావా శాస్త్రవేత్తలు సరికొత్త విప్లవాత్మక సాంకేతికతకు తెరలేపారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి పెను సవాలుగా మారుతున్న ఆహార వ్యర్థాల సమస్యకు వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. హోటళ్లలో మిగిలిపోయి, పారేసే ‘ఉడాన్ నూడుల్స్’ తో పర్యావరణహిత, బయోడిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) కాగితాన్ని తయారు చేసి అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, వ్యర్థాలను అద్భుతమైన వనరుగా మార్చిన ఈ పరిశోధన వివరాలు ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగంలో సంచలనంగా మారాయి.ప్రత్యేక నూడుల్స్.. పెరిగిపోతున్న వ్యర్థాలుజపాన్లోని కగావా ప్రిఫెక్చర్ ‘సానుకి ఉడాన్’ అనే ప్రాంతీయ నూడుల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఈ రుచికరమైన వంటకాన్ని ఆస్వాదించడానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అంతే స్థాయిలో ఇక్కడ ఆహార వృథా కూడా జరుగుతోంది. స్థానిక రెస్టారెంట్లలో అమ్ముడుపోని నూడుల్స్, అలాగే ఉడకబెట్టిన తర్వాత ఎక్కువ సమయం ఉంచడం వల్ల రుచి కోల్పోయిన నూడుల్స్‌ను భారీ మొత్తంలో పారేయాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన ఆహార వృథా సమస్యను అరికట్టాలనే లక్ష్యంతో పరిశోధకులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు.ప్రొఫెసర్ తనకా వినూత్న ఆలోచనకగావా యూనివర్సిటీ అగ్రికల్చర్ ఫ్యాకల్టీకి చెందిన ప్రొఫెసర్ నవోటాకా తనకా నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. సూక్ష్మజీవులు, సెల్యులోజ్ ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాపై ఆయన చేసిన సుదీర్ఘ పరిశోధనల ఆధారంగా ఈ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ‘మా ప్రాంతంలో భారీ మొత్తంలో ఉడాన్ నూడుల్స్ వృథాగా పారేయడం నన్ను ఆలోచింపజేసింది. వీటిని రీసైకిల్ చేయడం ద్వారా ఆహార వ్యర్థాలను తగ్గించవచ్చని భావించాను’ అని ప్రొఫెసర్ తనకా తెలిపారు. నూడుల్స్‌ను చక్కెరగా మార్చే ప్రక్రియ చాలా సులభం కావడంతో ఆయన ఈ ఆలోచనను ఆచరణలో పెట్టారు.నూడుల్స్ నుండి కాగితం తయారీ ఇలా..సాధారణ కాగితం తయారీ పద్ధతులకు భిన్నంగా, ఈ ప్రక్రియలో అధునాతన జీవ సాంకేతికతను ఉపయోగించారు. మొదటగా మిగిలిపోయిన నూడుల్స్‌ను నీటితో కలిపి మిశ్రమంగా మారుస్తారు. ఆ తర్వాత, అందులోని పిండి పదార్ధాన్ని గ్లూకోజ్‌గా మార్చడానికి కొన్ని ప్రత్యేక ఎంజైమ్‌లను జోడిస్తారు. ఈ మిశ్రమానికి ఎసిటిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చేర్చిన కొద్ది రోజుల్లోనే, ఆ మిశ్రమం పైభాగంలో బ్యాక్టీరియా ఒక సెల్యులోజ్ పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరను జాగ్రత్తగా ట్రేలలో ఉంచి, సహజ గాలిలోనే ఆరబెట్టడం ద్వారా జపాన్ సాంప్రదాయ ‘వాషి’ కాగితం లాంటి పలచని షీట్లు సిద్ధమవుతాయి.అద్భుతమైన మన్నిక.. పర్యావరణానికి మేలుఒక్క ప్లేట్ ఉడాన్ నూడుల్స్ వ్యర్థాల నుండి దాదాపు 5 నుండి 10 వరకు ఏ4 సైజు కాగితాలను తయారు చేయవచ్చు. ప్రొఫెసర్ తనకా తెలిపిన వివరాల ప్రకారం ఈ మైక్రోబియల్ పేపర్ సాధారణ కాగితం కంటే చాలా తేలికగా ఉండటమే కాకుండా, నీటిని తట్టుకునే శక్తిని, మన్నికను కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, వాడేసిన తర్వాత మట్టిలో పడేసినా, సూక్ష్మజీవుల సహాయంతో ఇది చాలా వేగంగా, సహజంగా కలిసిపోతుంది. నిజానికి ఈ సాంకేతికతను ప్రొఫెసర్ సుమారు 16 ఏళ్ల క్రితమే విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా చూపించడానికి అభివృద్ధి చేయడం గమనార్హం.అడ్డంకులను అధిగమించి స్థిరమైన ఉత్పత్తి2020 సంవత్సరంలో, ఈ సాంకేతికతను స్థానిక సామాజిక సేవా సంస్థకు విశ్వవిద్యాలయం ఉచితంగా అందించింది. దీని ద్వారా వికలాంగులకు ఉపాధి అవకాశాలు లభించాయి. ప్రారంభంలో బ్యాక్టీరియా కాలుష్యం, బూజు పట్టడం వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ఉష్ణోగ్రత నియంత్రణ పెట్టెలను ఉపయోగించి నాణ్యమైన ఉత్పత్తిని సాధించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో నెలకు సుమారు 100 కాగితపు షీట్లను తయారు చేస్తున్నారు. వీటిని విశ్వవిద్యాలయమే కొనుగోలు చేస్తోంది. తద్వారా రెస్టారెంట్లు, పరిశోధకులు, సామాజిక కార్యకర్తలతో కూడిన ఒక బలమైన స్థానిక రీసైక్లింగ్ నెట్వర్క్ ఏర్పడింది.భవిష్యత్ ప్రణాళికలు.. పరస్పర సహకారంఈ పర్యావరణహిత కాగితాన్ని ఇప్పటికే ప్రచార సామగ్రి, కళాఖండాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు దీనిని నీటిలో కరిగిపోయే చేపల ఎరగా ఉపయోగించే అంశంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు, నూడుల్స్ వ్యర్థాలను అందించే రెస్టారెంట్లకు విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేక సహాయం చేస్తోంది. వాతావరణ మార్పులు, ఆహార వినియోగ అంచనాలకు సంబంధించిన డేటాను వారికి అందిస్తూ, ముందస్తుగా ఆహార వృథాను అరికట్టేలా ప్రోత్సహిస్తోంది. ఈ వినూత్న ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యర్థాల నిర్మూలనకు ఒక గొప్ప రోల్ మోడల్‌గా మారుతుందని ప్రొఫెసర్ తనకా ఆశాభావం వ్యక్తం చేశారు. -
పుష్పించే మాస్కులు!
ఇప్పుడంతా ఎటుచూసినా మాస్కులు ధరించిన ముఖాలే కనిపిస్తున్నాయి. ఈ భూమి మీద ఉన్న దాదాపు తొంబై శాతం జనాభా మాస్కు లేకుండా బయటికి రావడం లేదు. ఇంతమంది ఒక్కసారి మాస్కు పెట్టుకోవాలంటే ఎన్ని మాస్కులు కావాలో కదా! అటువంటిది ఒక్కొక్కరి దగ్గర సగటున కనీసం ఐదారు మాస్కులైనా ఉంటాయి. కోట్లలో ఉత్పత్తి అవుతోన్న మాస్కులు కరోనాను అడ్డుకుంటున్నప్పటికీ పర్యావరణానికి మరో కోణంలో ముప్పుగా పరిణమిస్తున్నాయనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ విషయాన్నీ నిశితంగా గమనించిన డచ్ గ్రాఫిక్ డిజైనర్ మరియాన్నే డీ గ్రూట్పోన్స్ పర్యావరణానికి ఎటువంటి హానీ తలపెట్టని మాస్కులను ప్రత్యామ్నాయంగా చూపిస్తున్నారు. మరియాన్నేకు వచ్చిన వినూత్న ఐడియాతో వందశాతం మట్టిలో కరిగిపోయే ‘మేరీ బీ బ్లూమ్’ మాస్కులను రూపొందిస్తున్నారు. వీటిని వాడిన తరువాత మట్టిలో పాతితే అందమైన పువ్వులు కూడా పూస్తాయట. నెదర్లాండ్స్‌లోని ఉట్రేచ్ట్ నగరానికి చెందిన మరియాన్నే స్వతహాగా గ్రాఫిక్ డిజైనర్ అయినప్పటికీ రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు సరికొత్త ఆలోచన చేసింది. కరోనా కాలు పెట్టిన తరువాత ప్రపంచవ్యాప్తంగా సర్జికల్ మాస్కులు వాడిపారేయడం వల్ల మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని ఎలాగైనా తగ్గించాలనుకున్న ఆమె మనం రోజూ అన్నం రూపంలో తీసుకునే బియ్యంతో మొదట పేపర్ తయారు చేసి దానిలో డచ్ గడ్డిమైదానంలో పెరిగే వివిధ రకాల పూలమొక్కల విత్తనాలు నింపుతారు. ఈ మాస్కులు సాధారణ మాస్కుల్లాగా వాడిన తరువాత ఎక్కడైనా పారేసినాగానీ, లేదా కాస్త చిన్నపాటి గుంతలో పడేసినా అవి పరిసర ప్రాంతాల్లోని నీటిని పీల్చుకుని మొలకెత్తి పూలు పూస్తాయి. ఈ పువ్వులు తేనెటీగలకు ఎంతో సాయపడతాయని మరియాన్నే చెప్పింది. ఇలా మాస్కులన్నీ మొలకెత్తితే రంగు రంగుల పూలు పూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పూర్తి ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేయడం వల్ల వంద శాతం ఈ మాస్కులు మట్టిలో కలిసిపోయి పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించవు. ఇప్పుడు మనం వాడే మాస్కుల తయారీలో సాధారణంగా మందమైన ఎలాస్టిక్ని తాళ్లు అంటే లేసులుగా ఉపయోగిస్తారు. ఇవి చెవులకు తగిలించడం వల్ల మాస్క్ మాఖానికి పట్టి ఉంటుంది. కానీ మాస్కు వాడి పారేసినప్పుడు ఈ ఎలాస్టిక్ మట్టిలో కలిసిపోదు. ఫలితంగా కాలుష్యానికి దారి తీస్తుంది. అయితే మేరీ బీ బ్లూమ్ మాస్కుల్లో ఎలాస్టిక్ కు బదులుగా గొర్రెల నుంచి తీసిన ఉన్నితో తయారు చేసిన తాడును వాడుతున్నాం. ఇది పర్యావరణానికి ఎటువంటి నష్టం చేయదు’’ అని మరియాన్నే వివరించింది. ఇక మాస్క్‌ల మీద ఆయా కంపెనీల పేర్లు ఇంక్‌తో రాసి ఉంటాయి. ఇంక్ స్థానం లో ఆర్గానిక్ గ్లూ వాడి కంపెనీ లోగోను ముద్రించామని మరియాన్నే చెబుతూ... ‘‘ప్రసుతం మేము తయారు చేసిన మాస్కుల్లో కొన్నింటిని మట్టిలో పాతిపెట్టాం.. అవి పూలు పూయడానికి సిద్ధంగా ఉన్నాయి.. వాటిని చూసేందుకు ఎంతో మంది ఆసక్తితోనూ, ఓర్పుతోనూ వేచి చూస్తున్నామన్నారు. ఇప్పటికే మేరీ బీ బ్లూమ్ మాస్క్‌లు కావాలనీ భారీ ఆర్డర్లు వస్తున్నాయని, డిమాండ్‌ను బట్టి మాస్కుల ఉత్పత్తిని పెంచుతామని ఆమె వివరించారు. l -
ఉపాధి కుటీరం!
ప్లాస్టిక్ రహితమే లక్ష్యంగా కుటీర పరిశ్రమ స్థాపించివిస్తరాకులు, వక్క చెట్లబెరడులతో బోజనం, టిఫన్ ప్లేట్లు, కప్పులు, తయారు చేసి తాను ఉపాధి పొందడమేకాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే షేక్ అలీముస్తఫా కంభం: బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల తయారీతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు మాజీ సైనికుడు అలీ ముస్తఫా. కుటీర పరిశ్రమ స్థాపనతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కంభం మండలంలోని కందులాపురం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు షేక్ అలీ ముస్తఫా ఆర్మీలో ఉద్యోగం చేస్తూనే పదవీ విరమణకు ముందు హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్డీ రూరల్ టెక్నాలజీ పార్క్‌లో ఉపాధి శిక్షణ పొందారు. రీ ఎంప్లాయ్మెంట్లో భాగంగా సైన్యంలో పనిచేసే వారికి ఉద్యోగ విరమణకు ముందు 21 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. అందులో ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీపై ముస్తఫా శిక్షణ పొందారు. రిటైరైన తర్వాత అసోం, ఒడిశా, హైదరాబాద్ నుంచి అవసరమైన మిషనరీని తెప్పించి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వగ్రామం కందులాపురంలో కుటీర పరిశ్రమ స్థాపించారు. పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా.. కుటీర పరిశ్రమలో ప్లాస్టిక్ రహిత ప్రసాదం ప్లేట్లు, భోజనం, బిర్యానీ, టిఫిన్, పానీపూరీ, చాట్, టేబుల్ ప్లేట్లు, బఫే ప్లేట్లు తయారు చేస్తున్నారు. వీటి తయారీ కోసం మాడపాకులు(విస్తరాకులు), కాన్సెషన్ పేపర్, బ్రౌన్ క్రాఫ్ట్, డీగ్రేడబుల్ ఎల్డీ పేపర్ వినియోగిస్తున్నారు. వక్కచెట్ల బెరడుతో ప్రత్యేకంగా ప్లేట్లు తయారు చేస్తారు. 4 అడుగుల సైజు నుంచి 12 అడుగుల సైజు వరకు ప్లేట్లు ఇక్కడ తయారవుతున్నాయి. అలాగే బ్రిచ్‌ఉడ్ స్పూన్స్, ఫోర్కులు, బయో డీగ్రేడబుల్ వాటర్ గ్లాసులు కూడా తయారు చేస్తున్నారు. నెలకు 60 వేల ప్లేట్ల తయారీ డిమాండ్‌ను బట్టి నెలకు 60 వేల ప్లేట్లు తయారు చేస్తామని అలీ ముస్తఫా తెలిపారు. ప్లేట్ల తయారీ కోసం ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎక్కువగా కోయంబత్తూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరానికి ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. పూర్తిగా ప్లాస్టిక్ రహితం కావడం, బయోడీగ్రేడబుల్ మెటీరియల్ వినియోగిస్తుండటంతో ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్లాస్టిక్, డిస్పోజల్ ప్లేట్లతో పోల్చితే వీటి ఖరీదులో పెద్దగా వ్యత్యాసం లేదు. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహిత వస్తువులు ఆర్మీ నుంచి రిటైరైన తర్వాత ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కుటీర పరిశ్రమ కోసం సుమారు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టా. కందులాపురంతోపాటు గిద్దలూరులో కూడా ప్లేట్లు తయారీ చేస్తాం. రెండు చోట్లా కలిపి 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నెలలో 24 రోజులు ప్లేట్లు, గ్లాసులు తయారు చేస్తాం. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ రహితంగా తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా పంపిస్తున్నా. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ నిర్మూలన పూర్తి స్థాయిలో చేపడితే బయోడీగ్రేడబుల్ ఉత్పత్తుల వాడకం మన ప్రాంతంలో కూడా పెరిగే అవకాశం ఉంది. – ఎస్కే అలీ ముస్తఫా, మాజీ సైనికుడు -
‘సేంద్రియం’ వైపు చూపు..
‘‘సాధారణంగా పంటల సాగులో రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువుల ప్రభావం ఆయా పంటలపై ఉంటోంది. రసాయన ఎరువుల ప్రభావంతో భూమిలో సారం తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తే భూసా రం పెరుగుతుందని, అలా పండించిన పంట లు ఆరోగ్యానికీ మంచివని పేర్కొంటున్నారు. నేను సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. ఏడాది క్రితమే ఈ నిర్ణయానికి వచ్చాను. రుద్రూర్‌లోని కృషి విజ్ఞా న కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాను. అంబం(ఆర్) రోడ్డు సమీపంలో ఎకరం 30 గుంటల భూమి ఉంది. ఆ భూమిలో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు ప్రారంభించాను. ఆరు నెలల క్రితం సొంతంగా అభ్యుదయ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాను. వంకాయ, బీరకాయ, బెండకాయ, టమాట, చెర్రి టమాట, కీరదోస, కాకర, సోరకాయ పండిస్తున్నాను. కూరగాయలను అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేసి విక్రయిస్తున్నాను. ఎందరు వారించినా.. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తాననగానే తెలిసిన వారు వారించారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. కూరగాయలను ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని, నష్టపోతావని పేర్కొన్నారు. అయినా నేను వెనుకంజ వేయలేదు. లాభమైనా.. నష్టమైనా.. అనుభవించాలని నిర్ణయించుకుని ముందుకే సాగాను. మా నాన్న రాజారాం మాజీ వైస్ ఎంపీపీ. ఆయనను ఒప్పించి సేంద్రియ పద్ధతు ల్లో కూరగాయల సాగు మొద లు పెట్టాను. పొలంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశాను. మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాను. డ్రిప్ కోసం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించింది. రూ. 12 వేలు ఖర్చయ్యాయి. మిత్రులు చెప్పినట్లుగానే పెట్టుబడి ఖర్చు ఎక్కువైంది. సాధారణ పద్ధతులకంటే దిగుబడి కూడా తక్కువగానే వస్తోంది. దీంతో మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు కూరగాయలు అమ్మా ల్సి వస్తోంది. సాధార ణ పద్ధతుల్లో పండించి న కూరగాయలకంటే కిలోకు రూ. 10 నుంచి రూ. 15 ఎక్కువ ధర తీసుకుంటున్నాను. మొదట్లో ఎక్కువ ధర చెల్లించడానికి ప్ర జలు వెనుకంజ వేశారు. అయితే ఇప్పు డు ఆ సమస్య లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్య త ఇచ్చేవారు సేంద్రి య పద్ధతుల్లో సాగు చేసిన కూరగాయలు కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ బాగానే ఉంది. ధర ఎక్కువైనా.. కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్.. వ్యవసాయ క్షేత్రం వద్దే కాకుండా సమీప గ్రామాల్లో జరిగే సంతలకు కూరగాయలను తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. డిమాండ్ బాగానే ఉంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు వైద్యులు ఇక్కడి నుంచి కూరగాయలను తీసుకెళ్తున్నారు. చాలా మంది రెగ్యులర్‌గా మా వద్దే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చెర్రి టమాట ధర కిలో రూ. 60, కీరదోస కిలో రూ. 40గా నిర్ణయించాను. ఏడాది వరకు ధరలో మార్పుండదు. ఇతర కూరగాయలను మార్కెట్ ధర కంటే 10 నుంచి 15 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాను. నెలకు రూ. 25 వేలనుంచి రూ. 30 వేల ఆదాయం వస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగును ప్రోత్సహించడమే నా ధ్యేయం. పలువురు రైతులు ఈ పద్ధతిలో కూరగాయల సాగుకు ముందుకు వస్తున్నాను. త్వరలో నా మిత్రులు మూడెకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేయనున్నారు’’ అని రామరాజు వివరించారు.


