breaking news
Billy Graham
-
బిల్లీ గ్రాహమ్ కన్నుమూత
మాంట్రీ(యూఎస్): విఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రచారకర్త బిల్లీ గ్రాహమ్ కన్ను మూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉత్తర కరోలినాలోని తన స్వగృహంలో మృతిచెందారు. అమెరికాలో ఉదారవాద ప్రొటెస్టాంట్లు, రోమన్ కేథలిక్‌లకు పోటీగా మత ప్రచార కార్యక్రమాలను ఆయన ఒక ఉద్యమంలా నిర్వహించారు. 185కు పైగా దేశాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించి సంప్రదాయ క్రైస్తవుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్టుల పాలనలోని క్రైస్తవులకు కూడా ఆశా కిరణం గా నిలిచారు. మత బోధనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందికి చేరువైంది గ్రాహమే అంటే అతిశయోక్తి కాదు. ‘అమెరికా పాస్టర్’గా పేరొందిన గ్రాహమ్.. ఐసన్‌హోవర్ నుంచి జార్జి డబ్ల్యూ బుష్ వరకు పలువురు అమెరికా అధ్యక్షులకు ఆధ్యాత్మిక సలహాదారుగా, సన్నిహితుడిగా వ్యవహరించారు. బహిరంగ ప్రార్థనలే కాకుండా టీవీలు, రేడియోల ద్వారా కూడా గ్రాహమ్ మిలియన్ల కొద్ది అభిమానులను సంపాదించుకున్నారు. గ్రాహమ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. 21 కోట్ల మందికి ప్రసంగం 2005లో న్యూయార్క్ పట్టణంలో నిర్వహించిన తన చివరి ప్రార్థనలో ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల మందిని ఉద్దేశించి ప్రసంగించి రికార్డు సృష్టించారు. అయనలా మరో ఎవాంజలిస్ట్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం తలపెట్టే అవకాశాలు దాదాపు అసాధ్యమే. 1983లో అప్పటి అధ్యక్షుడు రీగన్ నుంచి గ్రాహమ్ అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను అందుకున్నారు. గ్రాహమ్ 1918, నవంబర్ 7న చార్లెట్లో సంప్రదాయ క్రైస్తవుల కుటుంబంలో జన్మించారు. కాలేజీలో చదువుతుండగా చైనాకు చెందిన రూత్ బెల్ అనే యువతితో పరిచయమైంది. 1943లో వారు వివాహం చేసుకున్నారు. -
విశ్వ బోధకుడు బిల్లీ గ్రాహం
సందర్భం ఆయన ప్రవేశంతో ఈరోజు పరలోకం పులకరించిపోయింది. కానీ పుడమి ఒక మహోన్నత క్రైస్తవుణ్ణి కోల్పోయింది. ఒకటిమాత్రం నిజం. ఐదారు శతాబ్దాల కొకసారి బిల్లీ గ్రాహం వంటి మహా దైవజనుడు ఈ లోకంలో కనబడతాడు. ఆకలేసిన పసికందులు పాల కోసం ఏడ్వడం ఆరంభిస్తే ఏ తల్లైనా విసుక్కొంటుందా? తన పనులన్నీ వదిలేసి పరిగె త్తుకునివచ్చి బిడ్డను ఆలింగనం చేసుకొని ప్రేమతో పాలు పడు తుంది కదా. ఆపదలో, కష్టాల్లో ఉన్న విశ్వాసి చేసే ఆక్రందన లతో కూడిన ప్రార్థనకు కూడా దేవుడు అలాగే ప్రతిస్పందిస్తాడు. తన బిడ్డలైన ప్రజల్ని కాపాడుకోవడం, ఆదరించడమే దేవునికి ఎంతో ఇష్టమైన విషయం. దైవ మానవ బంధాన్ని, ప్రార్ధనా ప్రక్రి యను ఎలా ఎంతో ఆర్ధ్రంగా, అద్భుతంగా, అందంగా, మనసుకు హత్తుకు నేలా సోదాహరణంగా నిర్వచించగలి గిన ఏకైక మహా దైవజనుడు రెవ. డాక్టర్. బిల్లీగ్రాహం. గత నవంబర్ 7న నూతన సంవత్సరంలోకి ప్రవేశించిన బిల్లీగ్రాహంగారి వందేళ్ల జన్మదినోత్సవాలను అమెరికా లోని నార్త్ కేరొలిన్ రాష్ట్రంలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వేలాదిమంది ఆహ్వానితులు, ఆయన అభి మానులు, శిష్యుల సమక్షంలో ఎంతో పెద్ద ఎత్తున నిర్వ హించడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఆయన ఫిబ్రవరి 21న ఈ లోకంతో తనువు చాలించి పరలోకానికి వెళ్లిపోయారు. ఈ శతాబ్దపు, గత శతాబ్దపు క్రైస్తవ దైవజనుల్లో అగ్రగణ్యుడు రెవ. డాక్టర్. బిల్లీ గ్రాహం. కడిగిన ముత్యంలా నిష్కళంక జీవితంతో, వాక్చాతుర్యం జోలికి పోకుండా అత్యంత సరళమైన పదాలతో, అందరికీ రోజూ ఎదురయ్యే అనుభవాలనే సోదాహరణంగా పేర్కొంటూ సాగే ఆయన ప్రసంగ శైలి అత్యంత విల క్షణమైనది. ‘గాడ్ లవ్స్ యూ, కమ్ టు హిమ్ టు నైట్’ (దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన వద్దకు వచ్చేయండి) అంటూ ఆయన తన సువార్త మహా సభల్లో ప్రసంగం చివర తన రెండు చేతులూ చాచి ఆహ్వానిస్తే, వేలాదిమంది ఉన్నఫళంగా లేచి నిలబడి దేవుణ్ణి తమ జీవితాల్లో హత్తుకొని పరి వర్తన చెందడం అత్యంత సామాన్యమైన దృశ్యం. అమెరికాలో ఉత్తర కేరొలినా రాష్ట్రంలోని శాల్లెట్ పట్టణంలో ఒక పేద రైతు కుటుంబంలో డాక్టర్ బిల్లీ గ్రాహం జన్మించారు. సదరన్ బాప్టిస్ట్‌గా పిలిచే క్రైస్తవ శాఖకు చెందిన బిల్లీ గ్రాహం ఫ్లోరిడాలోని ట్రినిటీ బైబిల్ కాలేజీలో బైబిలు అధ్యయన శాస్త్రం (థియాలజీ) చదివి క్రైస్తవ పరిచారకుడయ్యాడు. లక్షలాదిమంది హాజరయ్యే అతిపెద్ద సువార్త సభల్లో 1947 నుండి 2005 వరకు అనేక వందల సభల్లో ఆయన ప్రసంగించారు. పత్రికలు, రేడియో, టీవీల ద్వారా ఆయన అందజేసిన సువార్త ఇప్పటిదాకా 100 కోట్ల మందికిపైగా ప్రజలకు చేరిందని అంచనా. తాను నమ్మిన క్రైస్తవ విశ్వాసాన్ని అందరికీ ధైర్యంగా ప్రకటించడమేగాక దాన్నే తూ.చ. తప్పకుండా తన జీవితంలో ఆచరించి చూపాడాయన. ప్రపంచీక రణ, సరళీకరణ పెనుగాలులకు క్రైస్తవ మత విశ్వాసం అనే దీపం ఆరిపోతుందేమోనన్నంతగా రెపరెపలాడు తుండగా, ఉవ్వెత్తున కెరటంలా లేచిన ఎంతోమంది గొప్ప క్రైస్తవ బోధకులు, వారి జీవితాల్లో క్రైస్తవ విలు వలను ఆచరించడంలో విఫలమై మట్టికాళ్ల మహా ప్రతి మలుగా కుప్పకూలుతున్న ఆధునిక సమకాలీన ప్రపం చంలో హిమాలయమంత ఎత్తుకు ఎదిగి చిట్టచివరిదాకా అంతే స్థిరంగా పడిపోకుండా నిలిచిన మహోన్నత పర్వతం డాక్టర్ బిల్లీ గ్రాహం. కోట్లమందికి సువార్త అనే ఆశీర్వాదాన్ని ఆయన ద్వారా పంచిపెట్టాడు. హైదరాబాద్ నగరాన్ని కూడా ఆయన 1970వ దశకంలో ఒక సువార్త మహాసభ ద్వారా దర్శించాడు. కృష్ణా జిల్లా దివిసీమలో 1977లో వచ్చిన ఉప్పెన సమయంలో బిల్లీ గ్రాహం ఆ ప్రాంతాలు దర్శించి అక్కడి దృశ్యాలు చూసి చలించిపోయి వేలాది మందికి ఇళ్లు కట్టించడానికి నడుంబిగించి విరాళాలు సేకరించి ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఏ విధంగా చూసినా బిల్లీ గ్రాహం గారిది ధన్య జీవితం. సాత్వికత్వం, నిశ్చల త్వం, సౌశీల్యం, అలుపెరుగని అవిశ్రాంత వ్యక్తిత్వం బిల్లీ గ్రాహం సొంతం. పాటలంటే ఆయన ప్రాణం. ఆయన బెవర్లీషీ అనే గొప్ప గాయకుడు, ప్రాణ మిత్రుడు బిల్లీ గ్రాహం ప్రసంగించే ముందు ఒక పాట పాడేవారట. లక్షలమంది పాల్గొన్న ఒక సభలో ఒకసారి బెవర్లీషీ ‘అమేజింగ్ గ్రేస్’ అనే పాట పాడితే పరవశించిపోయిన బిల్లీగ్రాహం మైక్ ముందుకొచ్చి, అంత అద్భుతమైన పాటే ఈనాటి ప్రసంగం అని ప్రకటించి ప్రసంగించ కుండా ప్రార్థించి సభను ముగించారట. ఆయన ప్రవేశంతో ఈరోజు పరలోకం పులకరించి పోయింది. కానీ పుడమి ఒక మహోన్నత క్రైస్తవుణ్ణి కోల్పోయింది. ఐదారు శతాబ్దాల కొకసారి బిల్లీ గ్రాహం వంటి మహా దైవజనుడు ఈ లోకంలో కనబడ్తాడు. యేసు నడిచివెళ్లిన అడుగు జాడలు ఆయన మరోసారి లోకానికి కనిపించే విధంగా తన అడుగు జాడల్లో చూపించి వెళ్లాడు. దైవ జనులంటే సినీతారల్లాగా, క్రికెటర్లలాగా సెలబ్రిటీలు కాదని, యేసు జీవితాన్ని, బోధల్ని ఆచరించి చూపించే ‘సెలబ్రేషన్’గా జీవించిన మహామహులని ఆయన నిరూపించాడు. ఈ మాటలు ఆయన తన డైరీలో రాసుకున్నారు. ‘‘ఒక రోజున టీవీల్లో, దినపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో బిల్లీ గ్రాహం చనిపోయారన్న వార్త వింటారు, చదువుతారు, తెలుసుకుంటారు. కానీ ఆ వార్తను మీరు ఏ మాత్రం నమ్మొద్దు. ఇప్పటికన్నా క్రియాశీలకంగా, బలంగా నేను జీవిస్తూంటాను. కాకపోతే నా చిరునామా ఈ లోకం నుండి పరలోకానికి మారుతుంది. అక్కడ దేవుని సమక్షంలో సంతోషంగా ఉంటాను...’’ మొబైల్ : 98488 21472 రెవ. డా. టి. ఎ. ప్రభుకిరణ్ -
ప్రముఖ మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహం కన్నుమూత
వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహం కన్నుమూశారు. 99 ఏళ్ల బిల్లీ గ్రాహం అమెరికా నార్త్ కరోలినాలో మోన్‌ట్రీట్‌లోని స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ క్యాన్సర్, పార్కిన్సన్, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న బిల్లీ గ్రాహం మృతిచెందారని ఆయన అధికార ప్రతినిధి జెరేమీ బ్లూమ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతాపం ప్రకటించారు. క్రైస్తవులతో పాటు ఇతర మతాల వాళ్లు ఓ మంచి వ్యక్తిని కోల్పోయారని ట్రంప్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా మత ప్రబోధకుడిగా బిల్లీ గ్రాహం విశేష సేవలు అందించారు. చివరి వరకు మానవ హక్కుల కోసం జరిగిన ప్రతి పోరాటంలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఆయన ప్రబోధాలను 185 దేశాల్లో మాట్లాడే 45 భాషల్లోకి అనువదించారు.