breaking news
Big Shots
-
డ్రగ్స్ కేసులో బడా‘బాబులు’
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాల ఆరోపణలపై హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్న సంపన్న కుటుంబాలకు చెందిన ఏడుగురి గురించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో కొందరికి గతంలో పోలీసులు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ టోనీసహా నిందితుల్ని న్యాయస్థానం ఆదేశాల మేరకు పంజగుట్ట పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న కీలకాంశాలివీ... ♦ నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్ కుమార్ జైన్‌కు కొన్నాళ్ళ క్రితం ముంబైలోని ఓ పబ్‌లో టోనీతో పరిచయమైంది. అప్పటి నుంచి 30 సార్లు డ్రగ్స్ కొనడంతోపాటు మరికొందరు స్నేహితులకు అలవాటు చేశాడు. నిరంజన్ కుటుంబం ఏటా రూ.600 కోట్ల టర్నోవర్ ఉన్న పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ నడుపుతోంది. నగరంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల్లో అనేకం వీరు చేపట్టినవే. ♦ మరో నిందితుడైన బంజారాహిల్స్ నివాసి శాశ్వత్ జైన్‌ది కూడా కన్స్ట్రక్షన్ వ్యాపారమే. రూ.1,000 కోట్లకుపైగా ఆస్తి ఉన్న ఈ కుటుంబం నగర శివార్లలో ప్రముఖ డిటర్జెంట్ సబ్బుల కంపెనీ నిర్వహిస్తోంది. సీఎస్సార్ కింద ఏటా 400 మంది పేదలకు ఉచితంగా కిడ్నీ తదితర ఆపరేషన్లు చేయిస్తోంది. వీరి కుటుంబ సభ్యుడి పేరుతో ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఓ పెవిలియన్ కూడా ఉంది. 2011లో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ముంబైకి చెందిన అర్వింద్ అనే డ్రగ్ పెడ్లర్ కస్టమర్ల జాబితాలో శాశ్వత్ పేరు ఉండటంతో కౌన్సెలింగ్ చేసినా అతడితో మార్పు రాలేదు. ♦ గౌలిపురకు చెందిన యజ్ఞానంద్ అగర్వాల్ కుటుంబం మసాలా దినుసుల వ్యాపారంలో ఉంది. ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేసే వీరికి తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్‌లున్నాయి. మరో నిందితుడు ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్‌రెడ్డి కీలక నిందితుడు నిరంజన్‌కు స్నేహితుడు. ♦ ఇంకో నిందితుడు బండి భార్గవ్ తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులు నిర్వహిస్తున్నాడు. వెంకట్ చలసాని అనే నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎగుమతులు, దిగుమతుల వ్యాపారి. భార్గవ్ ఇతడి వ్యాపార భాగస్వామి. ♦ నిందితుల్లో కొందరు చిన్నస్థాయి పెడ్లర్లుగానూ వ్యవహరిస్తున్నారు. వీళ్ల అరెస్టు విషయం తెలియగానే స్నేహితులు, పరిచయస్తులైన 200 మంది నగరం నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే సమయంలో ఎవరెవరికీ డ్రగ్స్ అమ్మారు? ఎక్కడెక్కడ రేవ్ పార్టీలు నిర్వహించారు? తదితర అంశాలను సేకరించాలని నిర్ణయించారు. -
కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలు
-
కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలు
న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యంలో తీగలాగితే డొంక కదిలింది. ప్రభుత్వ రహస్య పత్రాలు అంగట్లో సరుకులైన వైనం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ శాఖల కీలక విధాన పత్రాలు అధికార పరిధులు దాటి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిన దారుణం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది. చివరకు ఈ నెల 28న ఆర్థికమంత్రి ఇవ్వనున్న బడ్జెట్ ప్రసంగంలోని అంశాలు సైతం ముందే బహిర్గతమవ్వడం కార్పొరేట్ గూఢచర్యపు లోతులను కళ్లకు కడ్తోంది. సంచలనం సృష్టించిన కార్పొరేట్ గూఢచర్యం కేసులో పెద్దతలకాయలు బయటపడుతున్నాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్లో ఉన్న పెట్రోలియం శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కీలక రహస్య పత్రాలు తస్కరణకు గురైన కేసులో శుక్రవారం పోలీసులు ఇద్దరు పెట్రో కన్సల్టెంట్లు, ఐదు ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఐదుగురు సీనియర్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. గురువారం అరెస్ట్ చేసిన ఐదుగురితో కలుపుకుని ఈ కేసులో ఇప్పటివరకు 12 మందిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘శైలేశ్ సక్సేనా(రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- మేనేజర్, కార్పొరేట్ అఫైర్స్), వినయ్ కుమార్(ఎస్సార్-డీజీఎం), కేకే నాయక్(కెయిర్న్స్ ఇండియా-జీఎం), సుభాశ్ చంద్ర(జూబిలెంట్ ఎనర్జీ-సీనియర్ ఎగ్జిక్యూటివ్), రిషి ఆనంద్(రిలయన్స్ అనిల్ధీరూభాయి అంబానీ గ్రూప్-అడాగ్-డీజీఎం)లను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు. పెట్రోలియం శాఖ ఆఫీసులో తస్కరణకు గురైన రహస్య పత్రాలు కొన్ని వారి వద్ద లభించాయని ఏసీపీ అశోక్ చంద్ తెలిపారు. అంతకుముందు, పెట్రోలియం శాఖ నుంచి డాక్యుమెంట్లను దొంగలించిన వారికి.. కార్పొరేట్లకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించిన ఇద్దరు పెట్రో కన్సల్టెంట్లు శంతను సైకియా, ప్రయాస్ జైన్‌లనూ పోలీసులు అరెస్ట్ చేశారు. సైకియా మాజీ జర్నలిస్టు. ప్రస్తుతం పెట్రో వెబ్ పోర్టల్ నిర్వహిస్తున్నారు. ప్రయాస్కు పెట్రో కన్సల్టెన్సీ ఉంది. వారి నుంచి పెద్ద ఎత్తున కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద నిందితులందరి నుంచి రెండు బస్తాల డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం విశేషం. డొంక కదిలిందిలా.. పెట్రోలియం శాఖకు చెందిన కీలక పత్రాలను ఆ శాఖ కేంద్ర కార్యాలయం ఉన్న శాస్త్రిభవన్ నుంచి దొంగతనంగా తీసుకువెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేయడంతో ఈ కార్పొరేట్ స్కామ్ డొంక కదిలింది. అయితే, పోలీసుల దర్యాప్తులో పెట్రోలియం శాఖతో పాటు ఆర్థిక, బొగ్గు, విద్యుత్ శాఖలకు చెందిన రహస్య సమాచారం కూడా లీక్ అయినట్లు తేలింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో శాస్త్రి భవన్ వద్ద బుధవారం రాత్రి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాటు వేశారు. అర్ధరాత్రి దాటాక ఒక కారులో ముగ్గురు శాస్త్రి భవన్ వద్దకు వచ్చారు. కారులోంచి ఇద్దరు దిగి పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆఫీసులోకి వెళ్లారు. రెండు గంటలయ్యాక డాక్యుమెంట్ల కట్టలతో తిరిగి కారు వద్దకొచ్చారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని లలితాప్రసాద్(36), రాకేశ్ కుమార్(30)లుగా, కారులో ఉన్న వ్యక్తిని మధ్యవర్తి రాజ్‌కుమార్ దూబే(39)గా గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో ఇంకో ఇద్దరిని గురువారం, మరో ఇద్దరిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. డాక్యుమెంట్ల సేకరణ ఎలా..? పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. శాస్త్రి భవన్లో చిరుద్యోగస్తులుగా ఉన్న ఆశారాం, ఈశ్వర్సింగ్లు అధికారుల ఆఫీసు గదుల, కీలక విభాగాల ఫైళ్లున్న బీరువాల తాళం చెవులకు నకిలీ తాళం చెవులను తయారుచేయించేవారు. ఉద్యోగస్తుల డూప్లికేట్ ఐడీ కార్డులను రూపొందించేవారు. సాధ్యమైనంత వరకు నైట్ డ్యూటీలు వేయించుకునేవారు. ఆ సమయంలో ఆఫీసులోని సీసీ కెమెరాలను ఆపేసేవారు. అర్ధరాత్రి దాటాక ఆశారాం కుమారులు లలితాప్రసాద్, రాకేశ్‌కుమార్(వీరు కూడా గతంలో శాస్త్రి భవన్లో ఉద్యోగాలు చేశారు) నకిలీ ఐడీలతో ఆఫీసు లోపలకి వెళ్లేవారు. నకిలీ తాళంచెవులతో ఆఫీసర్ల గదుల తాళాలు తీసి డాక్యుమెంట్లను ఫొటోకాపీలు తీసి బయటకు తీసుకెళ్లేవారు. ప్రత్యేకంగా ఇది, అదని కాకుండా కనిపించిన ప్రతీ ఫైలునూ జీరాక్స్ తీసి తరలించేవారు. వాటిని మధ్యవర్తులకు అందజేసేవారు. మధ్యవర్తుల నుంచి అవి ‘అవసరమైన’ వారి వద్దకు చేరేవి. వారు పెట్రోలియం శాఖలో పెట్రో, సహజవాయు ధరల నిర్ణయం, పెట్రో, గ్యాస్ వెలికితీత విధానం.. వంటి కీలక విభాగాలను నిర్వహిస్తున్న స్పెషల్ సెక్రటరీ రాజీవ్ కుమార్, జాయింట్ సెక్రటరీ(రిఫైనరీస్) సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రటరీ(ఎక్స్‌ప్లొరేషన్) యూపీ సింగ్, డెరైక్టర్(ఎక్స్‌ప్లొరేషన్1) నళిన్ కుమార్ శ్రీవాస్తవ సహా పలువురు ఇతర డెరైక్టర్ల కార్యాలయాల నుంచి ఫైళ్లు తస్కరించారు. వాటిలో జాతీయ గ్యాస్గ్రిడ్కు సంబంధించి రానున్న బడ్జెట్లో ఆర్థికమంత్రి జైట్లీ వెల్లడించనున్న సమాచారమూఉంది. అలాగే, ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర నుంచి వచ్చిన లేఖ సైతం వారి వద్ద లభించింది. నెలల క్రితమే.. కొన్ని కీలక ఫైళ్లు కనిపించకుండా పోయిన విషయాన్ని కొన్ని నెలల క్రితమే పెట్రోలియం శాఖ అధికారులు గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జాయింట్ సెక్రటరీ గిరిధర్ ఆర్మానే వద్ద ఉండాల్సిన పత్రాలు ఒకరోజు ఉదయం ఫొటో కాపీ యంత్రంలో కనిపించడం, కొన్ని గదులు తెరచి ఉండటంతో అధికారులు అప్రమత్తమై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించారని తెలిపాయి. ఆఫీస్‌లో సీసీ కెమెరాలను, గదులకు కొత్త తాళాలను ఏర్పాటు చేసుకున్నారన్నాయి. కాగా ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఎవరిని అరెస్ట్ చేశారు? పెట్రోలియం శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆశారాం(58), ఈశ్వర్‌సింగ్(56), ఆశారాం కుమారులు లలితా ప్రసాద్, రాకేశ్కుమార్లతో పాటు మధ్యవర్తి రాజ్‌కుమార్ దూబేని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో దొంగిలించిన ఫైళ్లను కొనుగోలు చేశారని భావిస్తున్న పెట్రో కన్సెల్టెంట్లు సంతను సైకియా, ప్రయాస్ జైన్లను అరెస్ట్ చేశారు. లలితా ప్రసాద్, రాకేశ్ కుమార్, ప్రయాస్ జైన్, శంతను సైకియాలను కోర్టు ఫిబ్రవరి 23 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మిగతా ముగ్గురు ఆశారాం, ఈశ్వర్‌సింగ్, రాజ్‌కుమార్ దూబేలను జూడీషియల్ కస్టడీకి పంపించింది. లలితప్రసాద్కు రూ. 70 వేలు, రాకేశ్‌కు రూ. 40 వేలు ప్రయాస్ జైన్ నెలవారీగా చెల్లించేవాడని పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిచ్చిన డాక్యుమెంట్లలోని సమాచారాన్ని జైన్ తన క్లయింట్లకు అమ్ముకునేవాడని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పలువురు జర్నలిస్టులు, పెట్రో కన్సల్టెంట్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులను కూడా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. -
బిగ్షాట్స్ని ఒకే వేదికపైకి తెచ్చిన ఆట ఏమిటి?
అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, జయబాదురి, సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్... మన దేశంలో వీరిని మించిన సెలబ్రిటీలు ఎవరు ఉంటారు? వీరందరూ ఒక వేదిక మీదకు వస్తే అభిమానులకు కన్నుల పండుగే. ఈ బిగ్షాట్స్ అందరినీ ఓ ఆట ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. అదే కబడ్డీ ఆట. ఇది మన ఆటే. ఈ నేలపైనే పుట్టింది. ఇది ఈనాటి ఆట కాదు. భారతీయ నాగరికత ఆవర్భవించిన కాలం నుంచి ఈ ఆట మూలాలు ఉన్నాయి. ఆ తరువాత ప్రపంచ స్థాయికి ఎదిగింది. అయిన ఈ ఆటపై మనవారికి అంతగా ఆసక్తి ఉండదు. మనవారికి క్రికెట్ తప్ప ఇతర ఆటలేవీ అంతగా కనిపించవు. ఈ పరిస్థితులలో మార్పు తీసుకురావలన్న ఉద్దేశంతో చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రికెట్‌కు ఐపీఎల్ ఉన్నట్లు ఇతర ఆటలకు కూడా లీగ్స్ పెడుతున్నారు. దేశీయ ఆట అయిన కబడ్డీకి కూడా ఒక లీగ్ ఇప్పుడు నడుస్తోంది. అందులో భాగంగా ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభ వేడుకలకు ఈ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. ఇటీవల ముంబాయిలో జరిగిన ఈ లీగ్ ప్రారంభం అదరగొట్టింది. మొత్తం 8 టీములు ఆడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఒక టీమును అభిషేక్ బచ్చన్ కొన్నారు. భారీ స్థాయిలో సెలబ్రిటీలంతా ఓపెనింగ్ మ్యాచ్‌కు హాజరు కావడానికి ఇదే ప్రధాన కారణం. కారణం ఏదైనా మన గడ్డ మీద పుట్టిన కబడ్డీ ఆటకు ఈ స్థాయి ప్రాధాన్యత రావడం మనందరికీ సంతోషం కలిగించే విషయం. ఇండియన్ క్రికెట్ లీగ్(ఐపిఎల్) ఎంత సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ స్పూర్తితో మన పారిశ్రామికవేత్తల దృష్టి ఇతర ఆటలపై పడింది. బ్యాడ్మంటన్, కబడ్డీ, హాకీ, టెన్నిస్, ఫుట్‌బాల్ లీగ్‌లను కూడా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కబడ్డీలో ఏర్పాటు చేసిన లీగ్ పేరు ప్రొకబడ్డీ లీగ్(పికెఎల్). ప్రొకబడ్టి లీగ్ ప్రారంభంలో 8 నగరాల్లో టీములను ఏర్పాటు చేశారు. ఇవి కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, పాట్నా, పూణే, వైజాగ్, ముంబాయి. జైపూర్ పింక్ పాంథర్స్ టీమును అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేశారు. కోల్‌కతా టీము అయిన బెంగాల్ వారియర్స్‌ను బిగ్ బజార్ ఓనర్ కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూపు కొనుగోలు చేసింది. వైజాగ్ టీము అయిన తెలుగు టైటాన్స్‌ను కోర్ గ్రీన్ గ్రూపు, శ్రీనివాస్ శ్రీరామనేని సంయుక్తంగా కొనుగోలు చేశారు. ప్రొకబడ్డీ లీగ్‌లో ఆడేందుకు మన దేశంలో ఆటగాళ్లనే కాకుండా వివిధ దేశాలకు చెందిన వారిని కూడా వేలంలో కొనుక్కుకున్నారు. వేలంలో ఇండియన్ కబడ్డీ కెప్టెన్ రాకేష్ కుమార్ అత్యధికంగా 12 లక్షల 80 వేల రూపాయలు పలికారు. రాకేష్‌ను పాట్నా పైరేట్స్ దక్కించుకుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్లేయర్ దీపక్ నివాస్‌ను వైజాగ్ టీము తెలుగు టైటాన్స్ 12 లక్షల 60 వేల రూపాయలకు కొనుగోలు చేసింది. ప్రొకబడ్డీ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్ ప్రసారం చేస్తోంది. ప్రైమ్ టైమ్‌లో మ్యాచ్‌లను ఇస్తుండటం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు చూడటానికి అవకాశం ఏర్పడుతుందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జులై ఆఖరు నుంచి ఆగస్టు చివరి దాకా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ బెంగళూరులో జరుగుతాయి. విజేతగా నిలిచిన టీముకు 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. రన్నరప్‌గా నిలిచిన టీముకు పాతిక లక్షలు, సెమీఫైనల్‌కు మిగిలిన రెండు టీములకు పన్నెండున్నర లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తారు. స్వదేశీ ఆట కబడ్డీకి మళ్లీ ప్రజాదరణ తెప్పించేందుకు ఈ స్థాయిలో ప్రయత్నాలు జరగడం సంతోషకరమైన విషయం. ఈ ప్రయత్నం ఫలించి కబడ్డీకి క్రికెట్ స్థాయిలో ఆదరణ లభించాలని ఆశిద్ధాం. - శిసూర్య