కెమెరా ఆఫ్.. భూమి ఆన్!
బిగ్‌బాస్‌లో కనిపించిన నిజమైన మనసు, సహజమైన వెలుగు భూమి శెట్టిని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ నిరాడంబరతలో దాగి ఉన్న ధైర్యం, నిశ్శబ్దంగా పెరిగిన శక్తి ‘మహాకాళి’గా మారి సినీ ప్రపంచంలో ఒక కొత్త రూపాన్ని సృష్టించబోతోంది. ఆ ప్రయాణంలోని విశేషాలన్నీ ఆమె మాటల్లోనే మీ కోసం. నేను కర్ణాటకలోని కుందాపురలో పుట్టాను. సముద్రపు గాలి, ఇంటి ముందున్న చెట్ల నీడ, చిన్న చిన్న పండుగల హడావుడి అవే నా బాల్యపు ఆనందాలు.అమ్మానాన్న భాస్కర్ శెట్టి, బేబీ శెట్టిలది సాధారణ జీవితం, వాళ్లు నేర్పిన విలువలే నేడు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి.ఇంజినీరింగ్ చేశాను. కాని, నా మనసు మాత్రం పూర్తిగా యాక్టింగ్పైనే ఉండేది. అలా నా నటన ప్రయాణం టీవీతో మొదలైంది. ‘కిన్నరి’ సీరియల్లో చేసిన ‘మణి’ పాత్ర నాకు సినిమాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. 2019లో ‘బిగ్ బాస్ కన్నడ’లోకి వెళ్లినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కాని, నా నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రన్నరప్‌గా బయటికి వచ్చినా కూడా, నాకు వచ్చిన ప్రేమ మాత్రం ఒక విజేతలా నిలిచింది.ఆ తర్వాత వచ్చిన ‘ఇక్కట్’ సినిమా ప్రేక్షకుల అభిమానం రెట్టింపు చేసింది. ఆ ప్రేమే నాకు సినిమా మీదున్న నమ్మకాన్ని మరింత బలపరచింది. తర్వాత వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’, ‘కింగ్డమ్’ వంటి ప్రాజెక్టులు నా నటనకు కొత్త షేడ్స్ ఇచ్చాయి. ప్రతి పాత్ర నాకు నాలో ఉన్న మరో భూమిని పరిచయం చేసింది.∙ఇప్పుడు నా ముందున్న పెద్ద మైలురాయి ‘మహాకాళి’. సూపర్‌హీరో ఫిల్మ్‌లో ఫీమేల్ లీడ్‌గా నిలవడం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు. ఒక బాధ్యత కూడా. ఈ పాత్ర నా శక్తులను కొత్తగా పరీక్షించబోతోంది.∙నా రోజువారీ జీవితం మాత్రం చాలా సింపుల్. నాట్యం, కథలు, సంగీతం ఇవే నా హ్యాపీ స్పేస్.కెమెరా ముందు నటిస్తున్నంతసేపు ‘భూమి శెట్టి’ అనే వ్యక్తిని మరచిపోతాను. కాని, కెమెరా ఆఫ్ అయ్యాక మళ్లీ కుందాపుర అమ్మాయిగా నా చిన్న ప్రపంచంలోకి వెళ్తాను.∙అభిమానులు పంపే ప్రేమే నా ఎనర్జీ. వాళ్లే నా నమ్మకం. వాళ్ల వల్లే నా ప్రయాణం ప్రతి రోజూ మరింత అందంగా మారుతోంది.