నర్సుగా కంగనా రనౌత్.. భారత్ భాగ్య విధాత ట్రైలర్ చూశారా?
బాలీవుడ్ లేడీ స్టార్ కంగనా రనౌత్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ భారత్ భాగ్య విధాత(ది అన్‌సీన్ హీరోస్). ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, పరమాన్స్ క్రియేషన్స్, యునోయా ఫిల్మ్స్, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో భారత్ భాగ్య విధాత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ కథ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కంగనా నర్సు పాత్రలో కనిపించనుంది. 26/11 టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిన సమయంలో నర్సుల పోరాటం గురించే ఈ మూవీలో చూపించనున్నట్లు ట్రైలర్లోనే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో గిరిజా ఓక్ గాడ్బోలే, స్మితా తాంబే, సుహిత తట్టే, ఆశా షెలార్, ప్రియా బెర్డే, ఈషా డే, రసిక అఘాసే, అమృత నామ్‌దేవ్, ఆదిత్య మిశ్రా, జాహిద్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది.