breaking news
Bhadrachalam forest department
-
రాకాసి పట్టణం
సాక్షి, హైదరాబాద్: అదో పట్టణం.. విచిత్రమైన రాకాసి పట్టణం. అక్కడ మనకులాగే మనుషులు, ఇళ్లుంటాయని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆ పట్టణంలో మనుషులు మచ్చుకు కూడా కనిపించరు. ఎటు చూసినా సమాధులే దర్శనమిస్తాయి. అవేవో ఈమధ్య కట్టినవి కావు. వీటి వయసు దాదాపు 3వేల ఏళ్లు. అంటే ఇనుపయుగం నాటివి. గుట్టపైకెక్కి తిరుగుతుంటే ఒక్కో రాయికి ఓ సమాధి కనిపిస్తుంది, అందుకే ఆ ప్రాంతానికి స్థానికులు పెట్టుకున్న పేరు.. ‘రాకాసి పట్టణం’. భద్రాచలం దట్టమైన అడవుల్లో ఈ ప్రాంతం ఉంది. జ్యోండిగో.. దక్షిణ కొరియాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఇక్కడి గుట్టల్లో వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు కనిపిస్తాయి. భారీ బండరాళ్లు చుట్టూ పేర్చి.. వాటిపై దాదాపు 15 అడుగుల మందం ఉండే పెద్ద రాయిని మూతగా పెట్టి దాని కింద ఓ గది కట్టి అందులో మృతదేహాన్ని ఉంచేవారు. ఇది వేల ఏళ్లనాటి సమాధి చేసే విధానం. ఒకే ప్రాంతంలో వేల సంఖ్యలో ఇలాంటి సమాధులు ఉండటం ప్రపంచంలో మరెక్కడా లేవనేది ఇప్పటి వరకు ఉన్న మాట. అందుకే దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ సమాధులను చూసేందుకు నిత్యం కొన్ని వేల మంది పర్యాటకులు, పరిశోధకులు అక్కడికి వస్తుంటారు. గోదావరి తీరంలోని పూర్వపు వరంగల్–ఖమ్మం ప్రాంతం.. మల్లూరు, దామరవాయి, జానంపేట, పాండురంగాపురం.. ఇలాంటి గుట్టలతో నిండిన ప్రాంతాలెన్నో. ఈ గుట్టలపై ఆదిమానవుల కాలంనాటి గూడు సమాధులు వేలల్లో ఉన్నాయి. అలా విస్తరించిన ప్రాంతాల పరిధి ఏకంగా దాదాపు 200 కిలోమీటర్లకు పైబడే! ఆదిమానవుల గూడు సమాధులు (డోలమైన్స్, డోల్మనాయిడ్స్) ఇంత విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉండటం.. ప్రపంచంలో మరెక్కడా లేదన్న అభిప్రాయం ఉంది. కొరియాలో సమాధుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆ ప్రాంత విస్తీర్ణం తక్కువ. మనదగ్గర ఆ పరిధి విస్తీర్ణం ఎక్కువ. కానీ వీటికి యునెస్కో కాదు కదా, కనీసం రాష్ట్ర పురావస్తు శాఖ గుర్తింపు కూడా లేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మరొక కొత్త గుట్ట వెలుగు చూసింది. ఇంతకాలం స్థానిక పశువుల కాపరులు తప్ప బయటి వ్యక్తులు వాటిని చూడలేదు. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వాటిని పరిశీలించారు. స్థానికులు రాకాసి పట్టణంగా పేర్కొనే ఈ ప్రాంతం పినపాక మండలంలోని బయ్యారం నుంచి పాండురంగాపురం వెళ్లేదారిలో దట్టమైన అడవిలో ఉంది. పైన కప్పు.. లోపల రాతి తొట్టి! లోహయుగంలో మానవులు చనిపోయిన తర్వాత ప్రత్యేక గౌరవాన్ని పొందేవారు. చనిపోయాక సమాధి చేయటం సాధారణ విషయమే. కానీ, ఆ సమాధిలో సంబంధీకులు ఇష్టపడే ఆహారం, ఆహార్య వస్తువులు ఉంచేవారు. ఆ ఆత్మ తిరిగి వస్తుందన్న నమ్మకంతోనే ఇలా చేసేవారు. పెద్దపెద్ద బండరాళ్లను చెక్కి చుట్టూ కొంతమేర పాతి దాదాపు పదడుగుల గుహను రూపొందించేవారు. దానిపై విశాలమైన పెద్ద బండరాయిని కప్పుగా ఏర్పాటు చేసేవారు. లోనికి వెళ్లేలా చతురస్రాకారంలో మార్గాన్ని ఏర్పాటు చేసేవారు. దాదాపు ఎనిమిదడుగుల రాతి తొట్టిని రూపొందించి మృతదేహాన్ని అందులో ఉంచి ఆ గుహకు పెద్ద రాయితో మూసేసేవారు. పక్కనే వారికి ఇష్టమైన ఆహారం, అలంకరణ వస్తువులను ఆ తొట్టే లో ఉంచేవారు. కొన్ని గుహల్లో రెండు, మూడు తొట్లు కూడా ఉండేవి. పూర్తిగా భూ ఉపరితలంపై ఇలాంటి సమాధులు కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. వాటిని డోలమైన్స్గా చరిత్రకారులు పేర్కొంటారు. కొంతమేర భూమిలోకి పాతినట్టు ఉండేవాటిని డోల్మనాయిడ్స్గా పేర్కొంటారు. ఇప్పుడు తాజాగా వెలుగుచూసిన ప్రాంతంలో వందల సంఖ్యలో డోల్మనాయిడ్స్ కనిపించాయి. స్థానిక పశువుల కాపరులు ఇచ్చిన సమాచారంతో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, ఔత్సాహిక పరిశోధకులు కొండవీటి గోపి, నాగులపల్లి జగన్మోహన్రావు, సింహాద్రి నారాయణలు వాటిని పరిశీలించారు. స్థానిక అమరారం గ్రామం నుంచి పదిహేను కిలోమీటర్ల పాటు దట్టమైన అడవిలోకి వెళ్తే ఇలాంటి వందల సంఖ్యలో సమాధులున్న గుట్టలు కనిపిస్తున్నాయి. గతంలో భూపాలపల్లి జిల్లా దామరవాయి అడవిలో వెలుగుచూసిన సమాధులకు కాస్త భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. గోదావరి తీరంలో ఇలా సమాధులున్న ప్రాంతం మరింత విస్తారంగా ఉందని తాజాగా గుర్తించిన సమాధులు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ నిర్లక్ష్యం? ప్రపంచంలో ఇలా ఒకేచోట వేల సంఖ్యలో ఆదిమానవుల సమాధులు భద్రంగా ఉన్న ప్రాంతాలు చాలా అరుదు. తెలంగాణలోని గోదావరి తీరంలో 200 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాలు ఇప్పటి వరకు యునెస్కో దృష్టికి వెళ్లలేదు. వీటిని పరిరక్షించి యునెస్కో గుర్తింపునకు యత్నించాలన్న ఆలోచన కూడా మన ప్రభుత్వానికి రాలేదు. వెంటనే ఇలాంటి అరుదైన ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇక్కడికి చేరువలో ఉన్న జానంపేటలో ఆంగ్లేయుల కాలంలోనే పరిశోధనలు జరిగాయి. ఇవి చాలా అద్భుత చారిత్రక సంపద అని నాటి పరిశోధకులు తేల్చారు. ఇలాంటి భారీ బండరాళ్లలో భూగర్భంలో సమాధి గూళ్లు రెండేళ్ల క్రితం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తవ్వకాలు జరిపి నాటి ఆదిమానవుల అవశేషాలు గుర్తించి డీఎన్ఏ పరీక్షలకు తరలించింది. భూపాలపల్లి జిల్లా దామరవాయి ప్రాంతానికి అమెరికాలోని శాండియాగో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ ఈ లెవీ ఆధ్వర్యంలో బృందం వచ్చి ప్రాథమిక పరిశోధన జరిపి ప్రపంచంలోనే ఇవి అరుదైన ప్రాంతాలుగా గుర్తించింది. ప్రభు త్వం సహకరిస్తే ఈ మొత్తం ప్రాంతాన్ని లైడా ర్ సర్వే చేసి ఆధునిక పద్ధతిలో పరిశోధనలు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మన పర్యాటక శాఖ, పురావస్తు శాఖ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. వీటిని యునెస్కో నుంచి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభిస్తే వాటి పరిరక్షణకు, పరిశోధనకు పెద్దమొత్తంలో నిధులు సమకూరుతాయి. ఇక వివిధ దేశాల నుంచి పర్యాటకులు వాటిని చూసేందుకు క్యూ కడతారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయంతోపాటు స్థానికుల ఉపాధికి అవకాశం కలుగుతుంది. -
గోపాల.. గోపాల..!
భద్రాచలం : భద్రాచలం అటవీశాఖను ఓ గోపాలుడు కుదిపేస్తున్నాడు. దుమ్ముగూడెం రేంజ్ పరిధిలోని డీ కొత్తూరు బీట్‌లో పట్టుబడిన అక్రమ కలప రవాణాలో అసలు దోషులెవరనే దానిపై సాగుతున్న విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రాచలంలో తిష్టవేసిన ఆంధ్రప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆ శాఖలోని ఓ అధికారి, అదేవిధంగా కొంతమంది సిబ్బంది సహకారంతోనే పెద్ద ఎత్తున టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు వ చ్చాయి. భద్రాచలం డీఎఫ్ఓ శివాల రాంబాబు సైతం సిబ్బంది పాత్ర ఉందని ప్రకటించారు. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. తీగ లాగితే డొంక కదలిందన్న చందాన అనేక ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలిసింది. కలప స్మగ్లింగ్‌కు సూత్రధారిగా అనుమానిస్తున్న భద్రాచలంలోని ఓ ‘గోపాలుడి’సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా కూపీ లాగుతున్నారు. గత నెల రోజుల్లో ఆ వ్యక్తితో టచ్‌లో ఉన్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఎవరనేది ముందుగా ఆరా తీసిన తరువాత, మరింత సమాచారాన్ని రాబట్టే దిశగా విచారణను వేగవంతం చేశారు. డివిజన్ అటవీశాఖలోని ఓ అధికారికి దీనిలో ప్రమేయం ఉందని విస్తృత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అతని కాల్‌డేటాను సైతం నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే రూ.6.80 లక్షల విలువ గల టేకు కలప పట్టుబడిన ఘటనలో విచారణ పక్కదారి పట్టించేందుకు కొంతమంది ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. కలప స్మగ్లర్‌తో టచ్‌లో ఉన్న ఆ శాఖలోని ఓ అధికారి ఈ కే సులో ఇరుక్కోకుండా ఉండేలా భద్రాచలంలోని కొన్నివర్గాల నాయకులతో విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకోస్తున్నారని ఆ శాఖలోని సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇది వరకే ఐదు లారీల వరకూ టేకు కలప ఈ ప్రాంతం నుంచి తరలిపోయిందని, అధికారుల పాత్ర లేకుండా ఇది ఎలా సాధ్యమౌతుందని ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. మళ్లీ టెంటు పడనుందా.. భారీ స్థాయిలో స్మగ్లింగ్ జరిగిందని తెలిసినప్పటకీ, క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగులను బలి పశువులుగా చేయటం సరైంది కాదని ఆ శాఖలోని ఉద్యోగులు అంటున్నారు. భద్రాచలం డివిజన్ అటవీశాఖలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలపై తీవ్రంగా పరిగణిస్తున్న ఉద్యోగులు.. ఇక్కడి అధికారులు అవలంభిస్తున్న ఏకపక్ష విధానాలను ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. గతంలోనూ ఇలానే జరిగితే, అప్పటి అధికారికి వ్యతిరేకంగా డివిజన్ కేంద్రంలో టెంట్ వేశామని, మళ్లీ అటువంటి పరిస్థితులే నెలకొంటున్నాయని అటవీశాఖ ఉద్యోగుల సంఘం నాయకుడొకరు ఆవేదన వెళ్లగక్కారు. భద్రాచలం డివిజన్లోని అటవీశాఖలో జరుగుతున్న అడ్డగోలు డిప్యూటేషన్లు, సస్పెన్షన్లపై గుర్రుగా ఉన్న ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.