breaking news
Betting controversy
-
భార్యాబిడ్డలను జూదమాడిన భర్త
న్యూఢిల్లీ : ద్వాపర యుగంలో ధర్మరాజు ద్రౌపదిని జూదమాడాడని మహాభారతంలో విన్నాం. కానీ ఆధునిక యుగంలో మనుషులు సిగ్గుతో తలదించుకునేలా చేసాడు జూదానికి బానిసైన ఓ వ్యసనపరుడు. ఉత్తరప్రదేశ్‌లోని బులాంద్షార్లో జరిగిందీ ఘటన. భార్యని జూదమాడి ఓడిన మోహిసిన్ అనే వ్యక్తి తన ఆరు, ఏడేళ్ళ కొడుకులిద్దరినీ వదల్లేదు. చిన్నారులను సైతం జూదంలో పెట్టాడు. భార్య, బిడ్డలిద్దర్నీ మోహిసిన్ జూదంలో ఓడిపోవడంతో జూదంలో గెలిచిన ఇమ్రాన్ నేరుగా మోహిసిన్ ఇంటికి వెళ్ళి మోహిసిన్ భార్యను తనతో రమ్మని బలవంత పెట్టిన ఘటన స్థానికులను నివ్వెరపోయేలా చేసింది. మోహిసిన్ భార్య దీనికి నిరసనగా ఆందోళనకు దిగడంతో పంచాయితీ నిర్వహించారు. మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే మోహిసిన్ భార్య జూదగాడితో వెళ్ళేందుకు నిరాకరించడంతో కనీసం ఇద్దరు పిల్లల్లో ఒకరినైనా జూదంలో గెలిచిన ఇమ్రాన్ వెంట పంపాలని పంచాయితీ తీర్పునిచ్చింది. దీంతో మోహిసిన్ ఇద్దరు పిల్లల్లో ఒకరిని జూదంలో గెలిచిన ఇమ్రాన్ తన వెంట తీసుకెళ్ళడం కలకలం రేపింది. ఈ ఘటన అనంతరం తనను జూదమాడిన భర్తకు విడాకులిచ్చేసిన భార్య తన భర్తతో పాటు, తనను బలవంతంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నించిన ఇమ్రాన్ సహా మరో నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అనేకసార్లు పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా, ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుని ఆశ్రయించారు. మోహిసిన్ భార్య పిటిషన్‌పై స్పందించిన చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఆలస్యంగా వేట మొదలు పెట్టారు. అయితే ఈ ఘటనలో భార్యాబిడ్డల్ని జూదంలో పెట్టిన మోహిసిన్ తొలి ముద్దాయి అయితే, వాళ్ళ కొడుకుని జూదగాడితో పంపిన పంచాయితీ సైతం నేరంలో భాగం కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. -
దోషులుగా తేలితే ఇలా చర్యలు...
ఐదు ప్రత్యామ్నాయాలు సూచించిన బీసీసీఐ సుప్రీం విచారణ నేటికి వాయిదా న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో దోషులుగా తేలిన వారిపై తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయంలో సుప్రీం కోర్టుకు బీసీసీఐ ఐదు ప్రత్నామాయాలు సూచించింది. సోమవారం వాయిదా పడిన విచారణ మంగళవారం కొనసాగింది. స్పాట్ ఫిక్సింగ్‌లో దోషులపై తాము కఠినంగా చర్యలు తీసుకుంటామని బోర్డు మరోసారి ఉద్ఘాటించింది. ఈనేపథ్యంలో దోషులపై తాము తీసుకోబోయే చర్యల గురించి కోర్టుకు వివరించింది. 1.బీసీసీఐ అంతర్గత క్రమశిక్షణ కమిటీ ఈ వ్యవహారం చూసుకోవడం.. 2.ఇద్దరు స్వతంత్ర నిపుణుల కమిటీని బోర్డు నామినేట్ చేయడం.. 3.కోర్టు ఓ క్రమశిక్షణ కమిటీని నియమించడం.. 4.ఇద్దరు జ్యుడీషియల్ అధికారులను కోర్టు నియమించడం.. 5.ముద్గల్ కమిటీయే చర్య లేక శిక్షను నిర్ణయించడం.. వంటి ప్రతిపాదనలను బీసీసీఐ కోర్టు ముందుంచింది. అయితే వీటిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా విచారణను నేటి (బుధవారం) ఉదయానికి వాయిదా వేసింది. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఈ విషయంలో శ్రీనివాసన్ బీసీసీఐకి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే శ్రీని కౌన్సిల్‌కు కోర్టు మూడు ప్రత్యామ్నాయాలను సూచించింది. శ్రీనివాసన్ లేకుండా బోర్డు ఎన్నికలకు వెళ్లడం.. కొత్తగా ఎన్నికైన బాడీ గురునాథ్‌పై చర్య తీసుకోవడం; బీసీసీఐ పాలక మండలి సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి వారు చర్య తీసుకోవడం; మాజీ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేసి బీసీసీఐ ఎన్నికల గురించే కాకుండా ఇతర విషయాలను చూసుకోవడం. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలుంటే ఇవ్వాల్సిందిగా శ్రీనివాసన్ కౌన్సిల్‌ను కోర్టు అడిగింది. అలాగే క్రికెట్ పరిపాలను దూరంగా ఉండాల్సిందిగా తాము ఆదేశించినప్పటికీ తమిళనాడు క్రికెట్ సంఘం అధ్యక్ష హోదాలో సమావేశాలకు వెళ్లడాన్ని కోర్టు ప్రశ్నించింది. అయితే ఇది తప్పేనని, మున్ముందు హాజరుకానని శ్రీని తెలిపారు. ఇక బోర్డు ఎన్నికల్లో పోటీ చేయడమా? చెన్నై జట్టు యజమానిగా ఉండడమా? ఏదో ఒకటే తేల్చుకోవాలని కోర్టు శ్రీనివాసన్‌కు స్పష్టం చేసింది.