breaking news
Benchmark Capital
-
ఉబర్ మాజీ సీఈవో కలానిక్‌కు కొత్త కష్టాలు
శాన్ఫ్రాన్సిస్కో : రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్‌ను స్థాపించి, దానికి ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపంటూ తీసుకొచ్చిన ఆ కంపెనీ మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ను కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న కంపెనీని, వాటి నుంచి బయట పడేసేందుకు ఇన్వెస్టర్ల ఒత్తిడితో సీఈవో పదవి నుంచి తప్పుకున్న ఈయనపై తాజాగా మోసపూరిత దావా నమోదైంది. ఉబర్ అతిపెద్ద ఇన్వెస్టర్లలో ఒకటైన బెంచ్‌మార్కు వెంచర్ కలానిక్పై యుద్ధానికి దిగింది. మోసం, ఇతర అతిక్రమణల పేరుతో ఆయన్ను ఉబర్ బోర్డు నుంచి కూడా తొలిగించేందుకు సిద్ధమైంది. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిల్ సంస్థ అయిన బెంచ్‌మార్కు, గురువారం డెలావేర్ ఛాన్జరీ కోర్టులో కలానిక్పై ఫిర్యాదు నమోదుచేసింది. ఈ ఫిర్యాదులో ఉబర్ మాజీ ఎగ్జిక్యూటివ్ మోసానికి పాల్పడినట్టు, విశ్వసనీయతకు, కాంట్రాక్ట్‌కు తూట్లుపొడిచినట్టు ఆరోపించింది. అంతేకాక 2016లో పలు బోర్డు సీట్లను కలానిక్ ఎలా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారో వివరించింది. ఉబర్ బోర్డులో కలానిక్‌కు స్థానం ఉండటం అక్రమమని, చెల్లనిదిగా బెంచ్‌మార్కు క్యాపిటల్ తన ఫిర్యాదులోనే పేర్కొంది. ఉబర్ సీఈవోగా కలానిక్ బాధ్యతలు వహించేటప్పుడు పలు స్కాండల్స్ బయటికి వచ్చాయి. దీంతో బలవంతంగా ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం కొత్త సీఈవోగా వెతుకుతున్నట్టు రెండు రోజుల క్రితమే ఆ కంపెనీ సహవ్యవస్థాపకుడు గారెట్ క్యాంప్ చెప్పారు. అంతేకాక ఉబర్ సీఈవో పదవిలోకి ఇక ట్రావిస్ కలానిక్ రారని కూడా వెల్లడించారు. ఇదే విషయాన్ని బెంచ్‌మార్కు క్యాపిటల్ కూడా ప్రకటించింది. తాజాగా బోర్డు సభ్యుడిగా కూడా ట్రావిస్ కలానిక్ను దించేయడానికి బెంచ్‌మార్కు క్యాపిటల్ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ దావాలో ఉన్న ప్రతీ అంశం నిరాధారమేనని, తప్పు అని కలానిక్ అధికార ప్రతినిధి చెప్పారు. కలానిక్ సీఈవోగా లేకపోయినా షాడో లీడర్‌గా కొనసాగాలని ఇతరులు కోరుకుంటున్నట్టు తెలిసింది. ఈ దావా సిలికాన్ వ్యాలీలో ఉన్న స్టార్టప్‌ల గవర్నెన్స్ సమస్యలను ఎత్తిచూపుతోందని విశ్లేషకులంటున్నారు. ఇటీవల స్టార్టప్ వ్యవస్థాపకులే తమ కంపెనీల్లో ఎక్కువ అధికారాలు పొందుతున్నారు. ఇన్వెస్టర్ల కంటే కూడా ఎక్కువగా, అన్ని ఓటింగ్ రైట్స్‌ను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. -
ఉబర్ సీఈవోగా ఆయన ఇక రారు..
ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ ప్రపంచానికి తెగ ప్రాచుర్యం. రైండింగ్ సర్వీసుల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఆ కంపెనీ సంక్షేమం కోసం, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి, తాత్కాలికంగా కంపెనీ సీఈవో నుంచి తప్పుకోనున్నట్టు ట్రావిస్ కలానిక్ రెండు నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు సద్దుమణిగాక, ఆయన మళ్లీ తిరిగి కంపెనీ కీలక వ్యక్తిగా వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన తిరిగి ఉబర్ సీఈవోగా తన పదవిలోకి రారట. ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ మళ్లీ తన పదవిలోకి రారని కంపెనీకి చెందిన కీలక బోర్డు సభ్యుడు చెప్పారు. ఈ వారం ఉబర్ ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌ను రీకోడ్ లీక్ చేసింది. దీనిలో కలానిక్ తిరిగి సీఈవోగా వెనక్కి రారని ఉద్యోగులకు ఉబర్ సహవ్యవస్థాపకుడు గారెట్ క్యాంప్ చెప్పినట్టు వెల్లడైంది. ట్యాక్సీ సర్వీసుల అగ్రగామిని లీడ్ చేయడానికి ప్రముఖ వరల్డ్ క్లాస్ సీఈవోను నియమించనున్నట్టు తెలిపినట్టు తెలిసింది. క్యాంప్ ప్రకటనను బెంచ్‌మార్కు క్యాపిటల్ కూడా ట్వీట్ చేసింది. ఉబర్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన బెంచ్ మార్కు కంపెనీ నిర్ణయాలకు అంకితభావంతో ఉన్నామని, కొత్త సీఈవో కోసం అన్వేసిస్తున్నామని తన ట్వీట్లో పేర్కొంది. సీఈవోగా పదవిలో నుంచి దిగిపోయినప్పటికీ, కలానిక్ ఉబర్ బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే క్యాంప్ మెమో, బెంచ్‌మార్కు ప్రకటన వచ్చి ఉంటుందని రిపోర్టులు వెలువడ్డాయి. 1990లో స్టీల్ జాబ్స్ ఆపిల్ సీఈవోగా ఎలా వెనక్కి తిరిగి వచ్చారో అదేమాదిరి ఉబర్ సీఈవోగా మళ్లీ ట్రావిస్ కలానిక్ తన పదవి చేపడతారని రీకోడ్ గతవారం రిపోర్టు చేసింది. కానీ ఈ రిపోర్టుకు భిన్నంగా తాజా రిపోర్టును వెలువరించింది. లైంగిక వేధింపులు, లింగవివక్ష, పని ప్రదేశంలో సమస్యలు వంటి కారణాలతో సీఈవోగా ట్రావిస్ కలానిక్ రాజీనామా చేయాల్సి వచ్చింది.