breaking news
Belt stores
-
అధికార పార్టీ నేతలకు భయపడున్నా: ఎక్సైజ్ సీఐలు
కర్నూలు: ‘బెల్టు దుకాణాలపై దాడులు చేసి పట్టుబడిన మద్యం ఏ షాపు నుంచి వచ్చిందో నిర్ధారించుకుని కేసులు నమోదు చేసి సస్పెండ్ చేస్తే అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఈ కారణంగానే బెల్టు దుకాణాలను నిర్మూలించలేకపోతున్నాం’ అంటూ కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలు డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు దృష్టికి తెచ్చారు. కలెక్టరేట్లోని డ్వామా కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కర్నూలు, అనంతపురం జిల్లాల ఎక్సైజ్ సీఐలతో డిప్యూటీ కమిషనర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఐలు ఆయన దృష్టికి పలు విషయాలు తెచ్చారు. కర్నూలు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 6 మద్యం షాపులను సస్పెండ్ చేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, దీనివల్ల తాము పడుతున్న కష్టం వృథా అవుతోందని సంబంధిత సీఐలు డీసీకి వివరించారు. లక్ష్యాలకు తగ్గకుండా అమ్మకాలు జరపాలన్న ఒత్తిడి వల్ల కూడా వ్యాపారులు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారని, బెల్టు దుకాణ నిర్మూలనకు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సహకరించడం లేదని, మద్యం వ్యాపారులు బార్ కోడ్‌లో డేటాను నిల్వ చేయకుండా తారుమారు చేయడం వల్ల సరైన ఆధారాలు లభించడం లేదని, సకాలంలో సీఐల బదిలీలు చేపట్టకపోవడం వల్ల వ్యాపారులతో సంబంధాలు పెరిగి చర్యలకు వెనుకాడాల్సి వస్తోందని సీఐలు డీసీ దృష్టికి తీసుకువచ్చారు. ఇంటెలిజెన్స్ తరహాలో బెల్టు షాపుల నిర్మూలనకు ఎక్సైజ్ శాఖలో కూడా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సమావేశంలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్యామ్సుందర్తో పాటు కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు సుధాకర్, హెప్సీబారాణి పాల్గొన్నారు. -
పల్లెలను కాటేస్తున్న సా‘రక్కసి’
యాచారం, న్యూస్‌లైన్ : గ్రామాల్లో బెల్టు దుకాణాలు మూతపడినా నాటుసారా మాత్రం ఏరులై పారుతోంది. సారాకు బానిసలుగా మారుతున్న పేదలు అనారోగ్యాల పాలై మృత్యువును కొనితెచ్చుకుంటున్నారు. కరువు పనులకు వెళ్లి వచ్చిన ఆదాయంలో నిత్యం రూ.30 వరకు సారాకే ఖర్చు చేస్తున్నారు. మండలంలోని 20 గ్రామాల్లో సారా అమ్మకాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తోన్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. రెండేళ్ల కాలంలో మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, చింతపట్ల, మాల్, తక్కళ్లపల్లి, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి తదితర గ్రామాల్లో వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరెంతో మంది అనారోగ్యాల పాలయ్యారు. వీరిపై ఆధారపడి జీవిస్తున్న భార్యాపిల్లలు దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో 20 నుంచి 30 మంది వరకు సారాకాటుకు బలికాగా, 25-50 మంది వరకు అనారోగ్యాలకు గురయ్యారు. మంతన్‌గౌరెల్లి గ్రామంలోని ఓ కాలనీలో వంద కుటుంబాల్లో సారా తాగే వారు ఉండడంతో ఆ కాలనీని ధూల్పేటగా పిలుస్తున్నారు. ఈ కాలనీలో రెండేళ్ల కాలంలో పది మంది వరకు మృత్యువాత పడ్డారు. ఎక్సైజ్ పోలీసులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వారి అండదండలతోనే నాటుసారా తయారీ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. తయారీ జోరు.. రెండు నెలలుగా మండలంలో అన్ని గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం పోలీసులు ఎంతో కృషి చేశారు. దాదాపు వందకు పైగా ఉన్న బెల్టు దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. అయితే, బెల్టు దుకాణాలు మూతపడిన నాటి నుంచి సారా అమ్మకాలు పెరిగాయి. నల్లవెల్లితండా, బానుతండా, మంతన్‌గౌరెల్లి, తక్కళ్లపల్లి తండా, బొల్లిగుట్ట తండా, నీలిపోచమ్మ తండాతో పాటు పలు గ్రామాల్లో సారా తయారీ జోరందుకుంది. తయారు చేసిన సారాను చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్టుషాపుల మూత విషయంలో చొరవ తీసుకున్న పోలీసులు సారా విక్రయాలను కూడా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.